మనిషి స్థాయినిబట్టి పెట్టే విందును భరద్వాజ విందు అంటారు. అంటే ఆ మనిషి స్థితిగతిని చూసి అందుకు అనుగుణంగా ఇచ్చే అతిధ్యమే భరద్వాజ విందు. ఈ నానుడి కూడా రామాయణ కథల నుండే వచ్చింది. అదేమిటో చూద్దాం.
శ్రీరాముడు, సీతాలక్ష్మణ సమేతంగా అరణ్యవాసానికి బయలుదేరాడు. అరణ్యంలో భరద్వాజ మహాముని ఆశ్రమానికి వెళ్లాడు. భరద్వాజుడు వారిని గృహంలోకి ఆహ్వానించి విందు ఏర్పాటు చేశాడు. ఆ విందు సాదాసీదాగా ఉంది. అంటే అడవిలో లభించే పండ్లు, దుంపలు, వంటి కందమూలాలతో సాధారణ భోజనాన్ని వడ్డించాడు. వారు వాటినే అరగించి సెలవు తీసుకుని వెళ్లిపోయారు.
వనవాసం పూర్తయింది. లంకా యుద్ధం ముగిసింది. రాముని కష్టాలన్నీ తీరాయి. ఇక రాజుగా అభిషక్తుడు కావడమే తరువాయి. ఆ సమయంలో అయోధ్య నగరానికి తిరిగి వస్తూ భరద్వాజ ముని ఆశ్రమానికి వెళ్ళాడు. మునుపటి లాగానే వారిని సాదరంగా లోపలికి తీసుకువెళ్లాడు. ఇదివరకులా కాకుండా ఈ సారి అనేకమంది సేవకులతో, రాచ మర్యాదలతో షడ్రుచులతో కూడిన భోజనాన్ని వడ్డించాడు. రామలక్షమణులు తృప్తితీరా తిన్నారు.
కష్టకాలంలో పేదరికంతో నారబట్టలతో ఉన్న సమయంలో భరద్వాజుడు అందుకు తగ్గ మాములు ఫలహార విందు ఏర్పాటు చేశాడు. ఇక రాజుగా సింహాసనం ఎక్కబోయే సమయంలో రాజభోజనం వడ్డించాడు. స్థాయినిబట్టి, వారి విలువను బట్టి భరద్వాజుడు తగిన విందును పెట్టాడు కాబట్టి అలాంటి విందును భరద్వాజ విందు అనటం పరిపాటి అయ్యింది. అదే "భరద్వాజ విందు"నానుడిగా స్థిరపడిపోయింది. ఇలా వ్యత్యాలు చూపుతూ అతిధి స్థితిగతులకు తగినట్టు పెట్టే విందును 'భరద్వాజ విందు' అని ఇప్పటికి అంటూ ఉంటారు.
భరద్వాజ విందు ( నానుడి కథ) ౼ దార్ల బుజ్జిబాబు
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి