చెట్టుమీద దెయ్యం: -బ్యూలా.8వతరగతి.కొత్తపేటప్రొద్దుటూరు

 రామాపురం గ్రామం ప్రజలు ఊరుదాటాక
చెరువుగట్టునున్న చెట్లవైపు వెళ్ళాలంటే భయపడేవారు.కారణం చెట్టు మీద నుండి
విచిత్రమైన దెయ్యం అరుపులు వినిపించేవి.
ఆ ఏడ్పులకు అరుపులకు అదిరిపోయి
అటువైపు వెళ్ళటం మానుకున్నారు.
ఒకసారి సెలవుల్లో రాజు అనే అబ్బాయి
ఆ ఊరిలోని తాతగారింటికి వచ్చాడు.
దెయ్యం గురించి విన్నాడు.రాజు ఇలాంటివి నమ్మడు.దెయ్యం సంగతి ఏందో తేల్చాలని
అటువైపు వెళ్ళాడు.చెరువు గట్టున చెట్లకు
దగ్గరలో వున్న సత్రంలో ఒక బిక్షగాడు కనిపించాడు.వాడు యువకుడయినా సోమరితనంవల్ల ముసలివాడిలా వేషం వేసుకుని అడుక్కునేవాడు.దెయ్యం భయంతో అటువైపు ఎవ్వరూ రారని వాడి వేషాన్ని తీసేసి రకరకాల పండ్లు తింటూ కూర్చుని ఉన్నాడు.సత్రంలో ఓ గూటిలో ఉన్న వేషం వస్తువులను చూసి గుర్తించాడు రాజు.వాడు రాజును చూసి
చెట్టు మీద దెయ్యముందని  భయపెట్టే ప్రయత్నం చేశాడు. నీకులేని భయం నాకెందుకన్నాడు రాజు. చెట్లమీద పండ్లను రాళ్ళతో కొట్టుకుని తీసుకెళ్ళాడు రాజు. మరునాడు అదే సమయానికి అక్కడికొచ్చాడు రాజు.సత్రంలో బిక్షగాడు లేడు.చెట్టవైపు వెళ్ళాడు వింత అరుపులు పై నుండి వినిపించాయి.
"నువ్వు దెయ్యం కాదు.బిక్షగాడివి. సత్రం వైపు ఎవరైనా వస్తే నీ వేషం బయటపడుతుంది.చెట్లమీదున్న పండ్లను తీసుకుపోతారు.దెయ్యంలా నటించి ఇటువైపు ఎవరూ రాకుండా భయపెట్టావు.పండ్లన్నీ తినటం,ముదుసలి బిక్షగాడి వేషం వేసుకుని ధనం అడువక్కోవటం చేస్తున్నావు. చెట్టు గుబురులో దాక్కున్నది చాలు.కిందికిరా" అన్నాడు రాజు.
ఊరిలో కెళ్ళి తాను కనుక్కున్న విషయం అందరికీ చెప్పాడు. అందరూ రాజును అభినందించారు.బిక్షగాడిని దండించారు.వాడు సోమరితనం వదిలి కష్టపడి సంపాదించటం అలవాటు చేసుకున్నాడు.
,(డి.కె.చదువులబాబు సంపాదకత్వంలో విద్యార్థులు వ్రాసిన కొత్తపేటకలాలు సంకలనం నుండి)