కోయిలమ్మ (పిల్లల పాట):-మమత ఐల--హైదరాబాద్--9247593432


 కోయిలమ్మ కోయిలమ్మ కొత్త కొత్తగున్నది

కొత్త కొత్త పాటలేవొ పాడుచున్నది

పాటలోని పరమార్ధం ఏమి ఉన్నది

పాటంతా వింటెగాని తెలియకున్నది


సంపదంటె ఏమిటని అడుగుచున్నది

ధన కనకము కాదుఅని చెప్పుచున్నది

నేర్చుకునుట ఒక్కటే సంపదన్నది

మొదటి గురువు యింటియందు ఉన్నదన్నది

జన్మతోని నేర్పునది అమ్మయన్నది 


  // కోయిలమ్మ//


పెరిగి పెద్దగైనాక మిత్రులందరు

ఆటల్లో నేర్చుకునుట మేటియన్నది

బడిబాట పట్టినాక బాలలందరు

గురువు ద్వార నేర్చుకునుట ఘనత అన్నది


//కోయిలమ్మ//


ఎంత ఎదిగినాగాని చెంతనున్నది

నేర్చుకోని నడవడమే సంపదన్నది

మంచి దారికెపుడూ తల వంచమన్నది

మంచి చెడులు యేవో గుర్తించమన్నది


//కోయిలమ్మ//