విలువైన దోస్తీ (బాల గేయం ):-మమత ఐల--హైదరాబాద్-9247593432


 అనగననగ అడవిలోన కోయిలున్నది

అక్కడున్న పక్షులతో ఆడుచున్నది

పాటలోన మేటియైన కోయిలమ్మను

చూసి ఈర్ష్య పడుచుండె పక్షులందరు


పాడనీయకుందుమని చూచుచుండిరి

వాయిమూసి వహ్ వా యని మురియుచుండిరి

పాటలేని కోయిలమ్మ చింతనొందుచూ

మెదడుకేమొ ఆలోచన పదును పెట్టెను


అంతలోనె అవకాశం ముందుకొచ్చెను

ఆట విడిచి పాటలకై పారిపోయెను

కొత్త కొత్త చిగురుటాకు లేయుచుండగా

కొమ్మలలో చేరి తాను కూర్చొనుండెను


అందమైన ప్రకృతిలో చింత తీరెను

ఆహ్లాదముతోడ పాట పాడుచుండెను

పాటపాడి మెప్పులెన్నొ పొందుచుండగా

ఈర్ష్య పడిన పక్షులంత కుమిలిపోయెను


వజ్రమంటి దోస్తీని వదులుకుంటిమి

మంచి దారి వెంట మనం నడవకుంటిమి

మనవారిని మెచ్చుకున్న మనకుకొంచము

విలువైనా దక్కునని చింతనొందిరి


కామెంట్‌లు