సోమరిపోతు కొడుకు - సంయుక్త అక్షరాలు లేని బాలల కథ - డా.ఎం.హరికిషన్ - కర్నూలు - 94410 32212

  ఒక రైతుకు ఒక కొడుకు వుండేవాడు. వాడు చాలా సోమరిపోతు. ఏ పనీ తొందరగా చేసేవాడు కాదు. ఏదో ఒక వంక పెట్టి తప్పించుకోవాలని చూసేవాడు. కానీ రైతు వెంటబడి పదేపదే పనులు చెప్పేవాడు. కోప్పడేవాడు. తిట్టేవాడు. బతిమాలేవాడు. బుజ్జగించేవాడు. కానీ వాడు ఎంత చెప్పినా వినకుండా మొండికే సేవాడు. వీనికి చెప్పినా, ఆ గోడకు చెప్పినా ఒకటే అని ఆయన బాధపడతా తానే ఆ పని చేసుకునేవాడు..
ఒకసారి చలికాలం వచ్చింది. ఆ ఏడాది చలి చాలా ఎక్కువగా వుంది. రైతు పొద్దున్నే కొడుకుని లేపి “రేయ్... ఇది మంచి పంటల కాలం. మొక్కలు మోకాలంత ఎత్తుకు ఎదిగాయి. పోయి నీళ్ళు పెట్టు" అన్నాడు. ఆ మాటలకు వాడు “అబ్బ... ఈ చలిలో కుక్కలు గూడా బైట తిరగవు. నేను రాను. అంతగా కావాలంటే బాగా పొద్దెక్కి ఎండబడ్డాక అన్నం తిని పొలంలోకి అడుగు పెడతాలే" అని అడ్డం తిరిగాడు. రైతు ఏమీ చేయలేక ఆ చల్లని చలిలోనే వణుక్కుంటా, వణుక్కుంటా అన్ని పనులూ ఆయన ఒక్కడే చేసుకోసాగాడు.
ఒకరోజు ఆ సోమరిపోతుకి పొద్దున్నే మెలకువ వచ్చింది. చలిమంట వేసుకోని, గొంగడి కప్పుకోని చేతులు కాపుకోసాగాడు. అంతలో పక్కింటి సిద్దయ్య ఆ చలిలో వాని కళ్ళ ముందే అంగీ గూడా వేసుకోకుండా పొలానికి పోతూ కనబడ్డాడు. వయసు అరవై పైన్నే వుంటాయి.
అది చూసి వాడు “ఏం తాతా... ఇంత చలిలో అంగీకూడా లేకుండా పొలానికి పోతావున్నావు. దా... కాసేపు వచ్చి ఈ మంట పక్క వెచ్చగా కూచో. లేకుంటే ఈ చలికి తట్టుకోలేక పైకి పోయినా పోతావు" అన్నాడు నవ్వుతా.
ఆ మాటలకు అతను నవ్వి “ఒరేయ్... నేను పెళ్ళాం పిల్లలు లేని ఒంటిగాన్ని. తప్పదు. అయినా రైతుకు ఎండా, చలీ, వాన అంటా ఏదీ వుండదురా. అవన్నీ పనీపాటా లేని నీలాంటి పోరంబోకు గాళ్ళకే. పనిలోకి దిగితే అన్నీ ఎగిరిపోతాయి. ఐనా ఏం బతుకురా నీది. ఇంత చలిలో ఇంత వయసులో మీ నాయన పొలానికి పోయి ఒక్కడే కిందామీదా పడతావుంటే వూకె తిని కూచోడానికి సిగ్గుగా లేదు. నీలాంటి కొడుకులు బతికినా ఒకటే చచ్చినా ఒకటే.. ఛీ... ఛీ..." అన్నాడు.
రైతు కొడుక్కి నోట మాట రాలేదు.
వయసులో వున్న నాకే ఇంత చలిగా వుంటే, ముసలోడయిన మా నాయనకు ఎంత చలిగా వుండాలి అని తలచుకోగానే సిగ్గుతో వాని ఒళ్ళు జలదరించింది. గబగబా వాళ్ళ నాయన కోసం ఒక గొంగడి తీసుకోని తాత వెంట పొలానికి బైలుదేరాడు.