ఇది దేని గుడ్డు (బాలల సరదా కథ - పునఃకథనం:డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒక  ఊరి పక్కనే ఒక అడవి వుంది. ఆ అడవిలో ఒక కుందేలు వుంది. ఆ కుందేలు ఎప్పుడూ అడవంతా తిరుగుతా వుండేది. కనబడిన జంతువునల్లా పలకరిస్తా, దాని మంచిచెడులు కనుక్కుంటా ఎగురుతా దుంకుతా వుండేది.
ఒకరోజు కుందేలు అలా తిరుగుతా వుంటే దానికి ఒకచోట పిల్లలు ఆడుకునే పెద్ద బంతి కనబడింది. ఆ బంతి ఒక బస్సులోంచి కిందపడి గాలికి దొర్లుకుంటూ అక్కడకు వచ్చింది. కుందేలు బంతిని అంతకు ముందు ఎన్నడూ చూడలేదు. అదే మొదటి సారి. దాంతో అది ఆ బంతిని పెద్ద గుడ్డు అనుకొంది. కానీ అది దేని   గుడ్డో అర్థం కాలేదు. ఎవరిదబ్బా అని ఆలోచిస్తావుంటే ఆ కుందేలుకు ఒక ఉడుత కనబడింది. వెంటనే దానిని పిలిచి “ఉడుత బావా... ఉడుత బావా... ఈ గుడ్డు చూడు ఎంత బాగుందో. ఇంతకీ ఈ గుడ్డు పులిదేనా" అని అడిగింది.
ఉడుతకు గూడా ఏమీ తెలీదు. కానీ తెలీదంటే మర్యాద పోతాది గదా. అందుకని “ఓసీ పిచ్చి మొగమా.. పులి గుహలో గుడ్డు పెడుతుంది గానీ.. ఇలా ఆరు బైట పెడతాదా. దానికేమైనా తిక్కా" అనింది.
అది నిజమే అనుకున్న కుందేలు ఒక తాబేలును పిలుచుకొచ్చింది. దానికి ఆ బంతిని చూపించింది.
“తాబేలు మామా... తాబేలు మామా... నువ్వు చాలా సంవత్సరాల నుండి ఈ అడవిలో బతుకుతా వున్నావు గదా. ఈ గుడ్డు చూడు ఎంత లావుందో. ఇది ఒంటెదేనా" అని అడిగింది.
తాబేలుకు గూడా ఏమీ తెలీదు. కానీ తెలీదంటే మర్యాద పోతాది గదా... అందుకని “ఓసీ పిచ్చి మొగమా... ఒంటె ఎక్కడయినా ఇలా గుండ్రంగా గుడ్డు పెడుతుందా. దాని గుడ్డు కోడి గుడ్డు మాదిరి కోలగా, పెద్దగా వుంటుంది గానీ" అని చెప్పింది.
అది నిజమే అనుకున్న కుందేలు ఎవరిని అడగాలబ్బా అని ఆలోచిస్తూ వుంటే ఒక కోతి కనబడింది. దానిని పిలుచుకొచ్చి ఆ బంతిని చూపించి
"కోతి మామా... కోతి మామా... ఈ అడవిలో నీవు తిరగని చోటు లేదు. ఎక్కని చెట్టు లేదు. ఇదిగో ఈ గుడ్డు చూడు. ఎంత లావుగా ఉందొ. ఇది సింహందేనా" అని అడిగింది.
కోతికి గూడా ఏమీ తెలీదు. కానీ తెలీదంటే మర్యాద పోతాది గదా... అందుకని అది “ఓసీ పిచ్చి మొగమా...  సింహం గుడ్డు ఎక్కడయినా తెల్ల రంగులో వుంటాదా. ఎర్రగా సూర్యునిలెక్క లెక్క ధగధగా మెరుస్తా వుంటాది గానీ" అనింది. 
అది నిజమే అనుకున్న కుందేలు ఇంకెవరిని అడగాలబ్బా అని వెదుక్కుంటూ పోయి ఒక కప్పను పిలుచుకొచ్చింది. దానికి ఆ బంతిని చూపిచ్చి
“కప్ప మామా... కప్ప మామా... నువ్వు నీటిలోనూ, నేల మీదా తిరుగుతా వుంటావు గదా. ఇదిగో ఈ గుడ్డు చూడు. ఎంత పెద్దగా వుందో.  ఇది ఏనుగుదేనా"అని అడిగింది.
కప్పకు గూడా ఏమీ తెలియదు. కానీ తెలీదంటే మర్యాద పోతాది గదా. అందుకని “ఓసీ పిచ్చి మొగమా... ఈ గుడ్డు చూడు ఎంత తేలికగా వుందో ఏనుగు ఎక్కడైనా ఇంత తేలికయిన గుడ్డు పెడుతుందా. దాని గుడ్డు చాలా బరువుగా ఉంటుందిగానీ” అనింది.
కుందేలుకు ఏమీ అర్థం కాలేదు. "గుహలో పెట్టలేదు కాబట్టి పులిగుడ్డు కాదు. కోలగా లేదు కాబట్టి ఒంటె గుడ్డు కాదు. ఎర్రగా లేదు కాబట్టి సింహం గుడ్డు కాదు. బరువుగా లేదు కాబట్టి ఏనుగు గుడ్డు కాదు. మరి ఇది దేని గుడ్డు" అని ఆలోచించసాగింది. 
అంతలో దానికి ఒక కొంగ కనపడింది.
వెంటనే ఉరుక్కుంటా పోయి  ఆ కొంగను పిలుచుకొచ్చి... ఆ బంతిని చూపిస్తూ కొంగమామా... కొంగమామా... నువ్వు దేశదేశాలు తిరుగుతావుంటావు గదా. ఇంతకూ ఇది ఏ జంతువు గుడ్డు" అని అడిగింది.
కొంగ పకపకపక నవ్వుతూ “ఓసీ పిచ్చి మొగమా... ఈ లోకంలో జంతువులు ఎక్కడైనా గుడ్లు పెడతాయా. నీ తెలివి తెల్లారినట్టే ఉంది" అనింది.
“ఔను గదా' అని నాలిక కరచుకొంది కుందేలు.
ఐతే ఇది ఏ పక్షిది అని అడిగింది. 
కొంగ ఆ బంతి చుట్టూ తిరిగింది. దానిని కిందికీ, మీదికీ చూసింది. దాని పొడవాటి ముక్కుతో దాన్ని అలా ఒక్క పోటు పొడిచింది. అంతే... దానికి రంద్రం పడి “బుస్” మంటూ గాలి బైటకు వచ్చింది. అదిచూసి కొంగ సంబరంగా “ఓరినీ... ఇది జంతువు గుడ్డు కాదు. పక్షి గుడ్డు కాదు. చూడండి లోపలి నుండి గాలి ఎలా వస్తావుందో. ఇది గాలి గుడ్డు" అని అరిచింది గట్టిగా.
కుందేలు గూడా “అవును. ఇది గాలి గుడ్డే.. గాలి గుడ్డే" అంటూ సంబరంగా ఎగిరింది.
మిగతా జంతువులు గూడా “అవునవును...ఇది గాలిగుడ్డే... మాకు కూడా ముందే తెలుసు. కానీ నువ్వు కనుక్కుంటావో లేదో చూద్దామని చెప్పలేదు. ఆఖరికి కనుక్కున్నావు"
అంటూ చప్పట్లు కొట్టాయి.