ఘంటసాల సంగీతం (బాలల సరదా కథ) - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒక అడవిలో ఒక గుడ్లగూబ వుండేది. అది ఒక రోజు ఒక పాప రేడియోలో ఘంటసాల పాట వింటుంటే వినింది.
అబ్బ... ఎంత అద్భుతంగా వుంది ఈ ముచ్చటైన ఘంటసాల గొంతు. ఇంత తీయగా మా అడవిలో ఏ జంతువయినా, పక్షయినా పాడగలదేమో కనుక్కోవాలి" అనుకొంది.
గుడ్లగూబ పోతూవుంటే దారిలో ఒక కాకి కనబడింది. “కాకి బావా... కాకి బావా... నీకు పాట పాడడం వచ్చా" అనడిగింది.
“పాటనా... వచ్చు... వింటావా. నేను పాడితే ఎంత కమ్మగా ఉంటాదో తెలుసా. మొన్న కోతి మామ , గాడిద మామ నా పాట విని తెగ మెచ్చుకున్నారు” అంటూ కాకి కళ్లు మూసుకొని సంబరంగా “కావ్... కావ్... కావ్...” మంటూ అరవసాగింది. అంతే... ఆ అరుపులు విన్న గుడ్లగూబ “అమ్మ బాబోయ్. ఈ పాటవింటే అంతే. బతికేటోడు గూడా ఛస్తాడు” అనుకుంటూ అక్కడినుంచి పారిపోయింది.
గుడ్లగూబ పోతూవుంటే దారిలో ఒక చిలకమ్మ మామిడిపళ్ళ గంపతో పోతూ కనబడింది.
“చిలకమ్మా... చిలకమ్మా... నీకు పాట పాడడం వచ్చా" అనడిగింది.
చిలకమ్మ చిన్నగా చిరునవ్వు నవ్వి “నాకు ముద్దు ముద్దుగా మాటలాడడం వచ్చు గానీ... రాగాలు తీసి పాటలు పాడడం రాదు” అనింది. అలాగా “సరేలే" అంటూ గుడ్లగూబ మరలా వెదుక్కుంటా బైలు దేరింది.
గుడ్లగూబ అలా  పోతూవుంటే దారిలో ఒక అందమైన నెమలి కనబడింది.
“నెమలి మామా... నెమలి మామా... నీకు ఏవయినా పాటలు పాడడం వచ్చా" అనడిగింది.
దానికి నెమలి సిగ్గుపడుతూ “నేను అందరికంటే అందంగా చూడ ముచ్చటగా వుంటాను గానీ నా గొంతు ఏ మాత్రం బాగుండదు. నోరు విప్పితే అదిరి ఆరు మైళ్ళు పారిపోతావు” అనింది. 
అలాగా అని గుడ్లగూబ మరలా ఎగురుకుంటా పోతావుంటే ఈ సారి ఒక గుర్రం కనిపించింది. ఎప్పుడూ పక్షులనేనా, ఈ సారి జంతువులను అడుగుదాం అనుకొంది.
“గుర్రం మామా... గుర్రం మామా... నీకు పాటలు పాడడం వచ్చా" అనడిగింది. “పాటలా... నాకా... పాడమంటావా” అంటూ గుర్రం గట్టిగా నవ్వుతూ ఒక్కసారి సకిలించింది.
అంతే... “అయ్య బాబోయ్" అంటూ గుడ్లగూబ అదిరిపోయి రయ్యిన అక్కన్నుంచి ఎగిరిపోయింది.
గుడ్లగూబ అలా వెదుక్కుంటా పోతావుంటే ఒక గాడిద కనిపించింది. వెంటనే గాడిద దగ్గరికి చేరి “గాడిద మామా... గాడిద మామా... నీకేమైనా పాటలు పాడటం వచ్చా" అనడిగింది.
“పాటలా... నాకా... నేను పాడితే ఈ ఆంధ్రదేశంలో ప్రతిఒక్కరూ ఆనందంతో తలలూపుతూ చిందులు తొక్కాల్సిందే... అంత అద్భుతంగా పాడతా. వింటావా" అంటూ నోరు తెరిచి గట్టిగా చెవులు బద్దలయ్యేలా ఓండ్ర పెట్టసాగింది.
అంతే... గుడ్లగూబ అదిరిపడి చెవులు గట్టిగా మూసుకొని “తల ఊపడం సంగతి దేవుని కెరుక... ముందు తల తిరిగి వాంతికి అయ్యేటట్లుంది” అంటూ వేగంగా అక్కడినుంచి పారిపోయింది.
ఈ అడవిలో ఇంకెవరూ దొరికేటట్లు లేరే అని విచారంగా పోతావుంటే ఒక చోట కోకిల మామిడి చిగుర్లు తింటూ కనబడింది. సరే చివరగా దీన్ని అడుగుదాంలే అనుకుంది.
“కోకిల మామా... కోకిల మామా... నీకు పాటలు పాడడం వచ్చా" అనడిగింది. కోకిల సిగ్గుపడుతూ “అంతగా రాదు అల్లుడూ... ఏదో కొంచం కొంచం అంతే" అంది.
“ఏదీ ఒక్కసారి పాడు... వింటా" అంది గుడ్లగూబ. 
కోకిల గొంతు సవరించుకొని "కుహూ... కుహూ..." అంటూ  వంద వేణువులు ఒక్కసారి మోగినట్లుగా కమ్మగా , కమణీయంగా, మనసు ఉయలలు ఊగేలా  పాడసాగింది. ఆ మధురమైన తీయని గొంతు విని గుడ్లగూబ నోట మాట రాలేదు. ఆనందంతో పరవశించి పోయింది.
“ఆహా... పాటంటే కోకిలదే... మనుషుల్లో ఘంటసాల... పక్షుల్లో కోకిల" అంటూ సంబరంగా చప్పట్లు కొట్టింది.
కామెంట్‌లు