వానలో జింకపిల్ల (బాలల సరదా నీతి కథ )-డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212


  ఒక అడవిలో ఒక జింకపిల్ల ఉండేది. అది అడవిలో చెంగు చెంగున ఎగురుతా గెంతుతా ఉండేది.

ఒక రోజు అలా తిరుగుతా వుంటే ఒక్కసారిగా ఆకాశంలో దట్టంగా మేఘాలు ముసురుకోసాగాయి.

'అయ్యబాబోయ్ కాసేపటిలో వాన వచ్చేలా ఉంది. అంతలోపల ఇంటికి చేరుకోవాలి' అనుకొని ఇంటి వైపుకు ఉరకసాగింది.


నెమ్మదిగా ఆకాశం నుండి ఒకొక్క చినుకు నేలపై పడసాగింది.


దారిలో ఒక కుందేలు కనబడి “ఓ చిన్నారి జింకా! పెద్ద వాన వచ్చేలా ఉంది. వెంటనే నా గుబురు పొదలోకి రా. హాయిగా కాసేపు కమ్మని కథలు చెప్పుకుందాం. వాన తగ్గిపోయాక పోదువు గానీ' అని పిలిచింది.

ఆ మాటలకు ఆ జింకపిల్ల

'నేను నీ కంటే చాలా పెద్ద దాన్ని. నీ చిన్న పొద నాకేం సరిపోతుంది? కావాలంటే ఉడుతలని, తొండలని పిలుచుకో. నేను మా ఇంటికి పోయి హాయిగా పడుకుంటా' అని ముందుకు ఉరికింది.

అది అలా పోతావుంటే

దారిలో ఒక మామిడి చెట్టు మీద కోతి కనబడింది. 

'ఓ బంగారు జింకా! కాసేపటిలో పెద్ద వాన వచ్చేలా ఉంది. దా వచ్చి ఈ మామిడి చెట్టు కింద తలదాచుకో. నీకు తీయతీయని మాగిన మామిడి పల్లు తెంచి పెడతా. అవి తింటూ వాన తగ్గిపోయాక పోదువు గాని' అనింది.

అప్పుడా జింకపిల్ల 'ఓ కోతిమామా... ఈ చెట్టుకు అసలు కొమ్మలే లేవు. దీని కింద నిలబడితే కొంచమన్నా తడిసిపోతాను. నువ్వే హాయిగా పళ్ళు తిను. నేను మా ఇంటికి పోతా' అంటూ గెంతుతా ముందుకు పోయింది.

ఆ జింకపిల్ల అలా పోతా పోతా ఉంటే వాన ఇంకొంచం పెరిగింది. ఎక్కడైనా ఆగుదామా అని చుట్టూ చూసింది. దానికి ఒక గుహ కనబడింది.

'ఆహా! ఇదేదో చాలా బాగుంది. ఇందులోకి పోతే ఒక్క వాన చినుకు కూడా నా మీద పడదు' అనుకుంటా గుహలోకి పోబోయింది.

గుహ పక్కనే ఎగురుతూ పోతున్న ఒక పిచ్చుక దీనిని చూసింది. వెంటనే 'ఓ జింకపిల్లా! కొంచెం ఆగు. ఆ గుహలోకి పోయావంటే మళ్ళా తిరిగి వచ్చేది ఉండదు. సక్కగా పైకి పోవడమే. లోపల ఒక సింహం గురకలు పెట్టి నిదురపోతా ఉంది' అనింది.

ఆ మాటలకు జింకపిల్ల అదిరిపడి ఆగిపోయింది.

అంతలోనే వాన పెద్దగయింది. చుట్టూ ఒక చిన్న పొదగానీ ,  చెట్టుగానీ కనబడలేదు. వాన మరింత పెద్దగయ్యింది. చినుకులు టపటపటప లావు లావువి పడసాగాయి. 

'అయ్యో నేను ఎంత తెలివి తక్కువ దాన్ని. కుందేలు, కోతి మంచిమనసుతో నన్ను రమ్మని పిలిచినా కాదని ఇంత దూరం వచ్చేసాను. ఇక ఈ వానలో తడవకుండా తప్పించుకోవడం ఎలా అనుకుంటూ వుండగానే గుహ లోపలి నుండి గట్టిగా సింహం అరుపు వినబడింది.

అంతే... అయ్యబాబోయ్... ఇంకొక్క నిమిషం ఇక్కడ నిలబడితే దానికి ఆహారం కావడం ఖాయం అనుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా ఆ వానలోనే మొత్తం తడిసిపోతూ ఇంటివైపు పరుగు తీసింది. దాంతో బాగా జలుబు చేసి వారం రోజులపాటు ఒకటే తుమ్ములే తుమ్ములు


కామెంట్‌లు