చిన్నపాప పెద్దపాప (జానపద నీతి కథ) - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212


 ఒకూర్లో ఒక రాజు, రాణి వుండేటోళ్ళు. వాళ్ళ దగ్గర ఒక ఆడకుక్క వుండేది. అది చానా మంచిది. ఇంటికి బాగా కాపలా కాసేది. ఒకరోజు రాణి కడుపు పండింది. అదే సమయానికి కుక్కకు కూడా కడుపు పండింది. కడుపుతో వున్నోళ్ళకి ఏమేమో తినాలని వుంటాది గదా... రాణేమో లడ్లూ, జాంగిరీలు, కరిజి కాయలు, జిలేబీలు, మైసూరుపాకులు... అట్లా ఒక్కటని కాదులే ఏది కావాలనుకుంటే అది బాగా నెయ్యేపిచ్చుకోని కమ్మకమ్మగా చేపిచ్చుకోని తినేది. అట్లాగే పుల్లపుల్లని చింతకాయలు, మామిడికాయలు బాగా తినేది.

కుక్క గూడా ఆమె మాదిరే కడుపుతో వుంది గదా... దానికి గూడా ఏమేమో తినాలని వుంటాది గదా... కానీ పాపం... దానికి మాత్రం పాచిపోయిన అన్నం, పాచిపోయిన కూరలు పెట్టేది. వూకూకెనే చీటికి మాటికి దాన్ని తిట్టేది. కొట్టేది. సరిగా తిండి లేకపోవడంతో అది సన్నగా బక్కచిక్కిపోయింది. ఒకరోజు పొద్దున్నించి రాత్రి వరకూ ఎంత ఎదురుచూసినా చిన్నరొట్టెముక్క గూడా ఎయ్యలేదు. దాంతో కుక్కకు బాగా కోపమొచ్చి రాణికి ఒక శాపం పెట్టింది.

ఆ శాపం వల్ల రాణికేమో కుక్కపిల్లలు పుట్టినాయి. కుక్కకేమో ఇద్దరు అందమైన ఆడపిల్లలు పుట్టినారు. కుక్క తన పిల్లలిద్దరినీ నోట కరచుకోని అడవిలోకి తీసుకోనిపోయింది. రంగురంగుల పక్షుల ఈకలతో మెత్తని పరుపు చేసి పన్నబెట్టింది. అడవిలో దొరికే తియ్యతియ్యని పండ్లు ఏరుకోనొచ్చి తినిపించింది. పచ్చని తీగలతో ఉయ్యాల చేసి వూపింది. రోజూ శుభ్రంగా స్నానం చేపిచ్చి, చక్కగా జడేసి, రంగురంగుల పూలు పెట్టింది. అట్లా అల్లారుముద్దుగా, ప్రేమతో పెంచసాగింది. పిల్లలిద్దరూ ఆడతా... పాడతా... నెమ్మదిగా పెరిగి పెద్దగయినారు.

ఆ అడవికి దగ్గరలోనే ఒక రాజ్యముంది. దాన్ని పరిపాలిస్తావున్న రాజు మంత్రితో కలసి ఒకసారి వేటకొచ్చినాడు. వాళ్ళు అడవిలో ఈ అమ్మాయిలిద్దరినీ చూసి ఆశ్చర్యపోయినారు. ఇద్దరూ చానా అందంగా... చూడముచ్చటగా... అచ్చం బంగారు బొమ్మలెక్క వుంటారు గదా... దాంతో రాజు చిన్నపిల్లని "నాతో వస్తావా... నిన్ను పెండ్లి చేసుకుంటా" అని బతిమలాడినాడు. దాంతో చిన్నపిల్ల సరేనని ఒప్పుకోని రాజు వెంబడి సంబరంగా వెళ్ళిపోయింది.

మంత్రి పెద్దపిల్లను తనతో రమ్మన్నాడు. పెద్దపిల్ల చానాచానా మంచిది. అందుకే ఆమె 'మా అమ్మకు చెప్పకుండా నేనెక్కడికీ రాను. అమ్మ అడవిలోకి పోయింది. రాగానే చెప్పి పోదాం' అనింది. కానీ మంత్రి 'లేదు... ఇప్పుడే ఎట్లున్న దానివి అట్లే రావాలి' అంటా ఆమె ఏడుస్తున్నా వినకుండా బలవంతంగా గుంజుకు పోసాగినాడు.

ఈ విషయం అమ్మకు ఎట్లా తెలపాల్నా అని ఆలోచిస్తా వున్న పెద్దపిల్లకు టక్కున తన మెడలోని పూసల దండ గుర్తుకొచ్చింది. వెంటనే ఆ దండ తెంచి దారిలో ఒకొక్క పూసా వేసుకుంటా... వేసుకుంటా వెళ్ళింది.

కాసేపటికి కుక్క ఇంటికొచ్చింది. వచ్చి చూస్తే ఇంగేముంది... పిల్లలిద్దరూ లేరు. యాడైనా ఆడుకుంటున్నారేమో అని గట్టిగా పిలిచింది. చుట్టుపక్కలంతా వెదికింది. అసలుంటే గదా కనబడ్డానికి. పాపం... అది ఏడ్చుకుంటా... ఏడ్చుకుంటా అడవంతా బాధగా తిరగసాగింది. అట్లా వెదుకుతా వుంటే దానికి ఒకచోట పూసలు కనబన్నాయి. ఆ పూసల్ని చూస్తానే అవి తన పెద్దపిల్లవని గుర్తుపట్టింది. ఒక్కొక్క పూసా ఏరుకుంటా... ఏరుకుంటా పోయి ఆఖరికి పెద్దపిల్ల ఇంటికి చేరుకోనింది.

తల్లిని చూస్తానే పెద్దపాప “అమా" అని వురుక్కుంటా పోయి సంబరంగా కౌగిలించుకోనింది. ఇంట్లోకి తీసుకోనిపోయి రకరకాల పిండివంటలు చేసి పెట్టింది. మెత్తని పరుపేసి పన్నబెట్టి కాళ్ళు ఒత్తింది. విసనకర్రతో

ప్రేమగా గాలి వూపింది. ఆ కుక్క పెద్దపిల్ల దగ్గర ఒక నాలుగు రోజులుండి చిన్నపిల్ల ఎట్లా వుందో చూసొస్తానని వాళ్ళింటికి పోయింది.

చిన్నపిల్లకు చానా పొగరెక్కువ. కన్నతల్లి ఇంటికొస్తే సంతోషించక... కుక్క మా అమ్మని తెలిస్తే ఇంగేమన్నా వుందా... నా మర్యాద పోదూ అనుకోని “చీ... చీ... ఫో... ఈన్నించి... ఇంకోసారి నా యింటి గడప తొక్కినావంటే చూడు" అంటూ రోకలిబండతో దాని నడుమ్మీద కొట్టి, వేడివేడి గంజి మీద పోసింది. రోకలి దెబ్బకు పాపం దాని నడుం విరిగింది. వేడివేడి గంజి మీద పోసింది గదా... దాంతో దాని ఒళ్ళంతా బొబ్బలెక్కినాయి. పాపం... అది బాధతో ఏడుస్తా కుంటుకుంటా... కుంటుకుంటా... పెద్దపాప ఇంటికి చేరుకోనింది.

తల్లినట్లా చూసి పెద్దపాప కండ్లనీళ్ళు పెట్టుకోనింది.  బొబ్బలకు వెన్న రాసింది. విసనకర్రతో చల్లని గాలి వీచింది. తల్లి పెద్దపాపను దగ్గరికి తీసుకోని "ఇంక నేను బతకను. నేను చచ్చిపోగానే నన్ను ఇంట్లోనే ఒక మూల పాతి పెట్టి... సరిగ్గా ఒక నెలకు అక్కడ తవ్వి చూడు” అని చెప్పి చచ్చిపోయింది. పెద్దపాప తల్లి చెప్పినట్లే ఇంట్లో ఒక మూల పూడ్చి పెట్టి నెల తరువాత ఆడ తవ్వి చూసింది. చూస్తే ఇంగేముంది... కండ్లు జిగేలుమన్నాయి. మణులూ, మాణిక్యాలూ, రత్నాలూ, వజ్రాలూ, నగలూ, హారాలూ ధగధగా మెరిసిపోతా కనబన్నాయి. పెద్దపాప అవన్నీ ఒంటి మీద వేసుకోని వూరంతా సంబరంగా తిరగసాగింది.

చిన్నపాప "అక్కకు ఈ నగలన్నీ ఎట్లా వచ్చినాయబ్బా" అని ఆశ్చర్యపోయి ఒకరోజు ఇంటికొచ్చి అడిగింది. అక్క అమాయకంగా జరిగిందంతా చెప్పింది. చిన్నది సామాన్యురాలు కాదు గదా... పెద్ద గయ్యాలిది. దాంతో “అమ్మ ఆస్తిలో నాకూ సగభాగం వస్తాది. మర్యాదగా ఇస్తావా... ఇయ్యవా" అంటూ కొట్లాడి సగం గుంజుకోని పోయింది. అద్దం ముందు కూచోని సంబరంగా ఆ నగలూ హారాలూ అన్నీ మెడలో వేసుకోనింది.

అంతే....

వెంటనే ఆమె ఒళ్ళంతా బొబ్బలు బొబ్బలు గాదు. మంటతో విలవిలలాడిపోయింది. ఎక్కడెక్కడి వైద్యులంతా వచ్చినారు. రకరకాల మందులేసినారు. ఐనా కొంచం గూడా తగ్గకపోగా రోజురోజుకీ ఇంకా ఎక్కువ కాసాగినాయి.

దాంతో చిన్నపిల్లకు చేసిన తప్పు అర్థమై వురుక్కుంటా, అక్క దగ్గరికి పోయి ఆమె నగలన్నీ తిరిగిచ్చేసింది. ఐనా బొబ్బలు కొంచం గూడా తగ్గలేదు. అప్పుడు తల్లి సమాధి దగ్గర కూచోని “అమా... అమా... పొరపాటయిపోయింది. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు" అని కండ్లనీళ్ళు పెట్టుకోనింది. ఎంతయినా అమ్మ అమ్మే గదా... బిడ్డ తప్పు చేసినపుడు కోప్పన్నా మళ్ళా దగ్గరకు తీసుకుంటుంది గదా... దాంతో ఆమె ఒంటి మీది బొబ్బలన్నీ క్షణంలో మాయమైపోయినాయి. ఆమె తిరిగి మామూలు మనిషై పోయింది.