ఆశా కిరణాలు: -వురిమళ్ల సునంద ఖమ్మం
 పల్లవించే తరానికి
పసినవ్వులే ఆశా కిరణాలు..
ఇంటింటా కాంతులు వెదజల్లే
కల్మష రహిత హృదయాలు!
మలి పొద్దు జీవితానికవి
మమతల పరిమళాలు
తూరుపు ఎదపై పారాడే
బాల భానుడి వారసులు!
పశుపక్షి మనుష్యుల కవే
అమ్మతనపు ఆనవాళ్లు!
పవిత్రతను సంతరించుకున్న
హృదయ దేవాలయాలు!
 
కల్లలు ఎల్లలు ఎరుగని
సమతా మమతల దివ్వెలు
స్వచ్చమైన మనసున్న
చల్లని వెన్నెల  నిలయాలు!
విశ్వ జనీన ప్రేమకు చిహ్నాలు
విరితోటలో గుబాళిఃచే పువ్వులు
మదిలో చిరాకులను తొలగించే
మంచి గంధపు లేపనాలు...