మహా బలిపురం. (పాట)౼ దార్ల బుజ్జిబాబు
 మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం
భారతీయ కళా జగతికిది గొప్ప గోపురం
కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు
ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు.     ౹౹ మహా ౹౹
కంచి రాజధానిగా పాలించాడు ౼ ఇది
మంచి రేవు పట్నంగా కట్టించాడు.  
తెలుగు సీమ శిల్పులను రప్పించాడు.
పెద్ద శిలలన్నీ శిల్పాలుగా మార్పించాడు ౹౹ మహా ౹౹
పాండవులా రథాలనీ పేరు బడ్డవి
ఏకాండీ శిలలనుండి మలచబడ్డవి 
వీటి మీది బొమ్మలన్నీ వాటమైనవి ౼ తాము 
సాటిలేని వాటిమంటూ చాటుతున్నవి.  ౹౹ మహా ౹౹
మహిషాసుర మర్ధనం ౼ గోవర్ధనమెత్తడం
మహా విష్ణు వరాహంగా అవతారం దాల్చడం
పురాణాల ఘట్టాలు పొందుపర్చిరి
ముచ్చటగా కన్నులకు విందునిచ్చిరి.     ౹౹ మహా ౹౹
పాసుపతం కోరెను పార్ధుని మనసు
పరమశివుని కోసము చేసెను తపసు
సృష్టంతా కదలివచ్చి చూడసాగెను
ప్రతిసృష్టికి ఈ శిల్పమని పేరు వచ్చెను.  ౹౹ మహా ౹౹
సంద్రంలో కలిసినవి కలిసిపోయెను
ఒంటరిగా ఈ కోవెల మిగిలిపోయెను
దేవుని పాదాలను కెరటాలు కడుగును నిత్యం
మనుజుల పాపాలు ఇవి చూడ
తొలుగును సత్యం సత్యం.                   ౹౹ మహా ౹౹