సామెత కథ : ఎం. బిందు మాధవి

 ఒక పూట విందు, ఒక పూట మందు!
మాధవి వాళ్ళ బామ్మ గారు ఎనభయ్యేళ్ళ వయసు వచ్చినా మంచి చలాకీగా చురుకుగా ఉండే వారు. ఆవిడ గొప్ప ప్రేమైక మూర్తి. ఎప్పుడు నవ్వుతూ, తుళ్ళుతూ పిల్లల్లో పిల్ల లాగా కలిసిపోయి మనవలకి అత్యంత ఆప్తురాలుగా ఉండే వారు. ‘పిల్లలకి పిల్ల’, ‘పెద్దలకి పెద్ద’ అన్నమాట.
ఆవిడ బాగా చిన్నతనం లోనే భర్తని పోగొట్టుకున్నారు. కానీ తన ఇద్దరు పిల్లలని, తల్లిని పోగొట్టుకున్న మరిదిగారి పిల్లలనీ సమానమైన ప్రేమాభిమానాలతో పెంచారు. బాగా పెద్దయ్యే వరకు ఆ పిల్లలకి అసలు తమ తల్లెవరో, తండ్రెవరో తెలియదు. అంత అప్యాయతతో పెంచారన్నమాట.
ఈ పెంచిన పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసింది. అందరూ తృప్తిగా జీవితాల్లో స్థిరపడ్డారు. అందరు పక్క పక్క ఊళ్ళల్లోనే నివాసాలు. ఈవిడ తరుచు వీరందరి ఇళ్ళ మధ్యన మనవల కోసం, తిరుగుతూ ఉండేది.
ఇద్దరు తల్లులు కన్న పిల్లలని ఎంత మర్మం లేకుండా పెంచిందో, వారి పిల్లలని కూడా అంత నిష్కల్మషంగా చేరదీస్తుంది. సాధారణంగా పిల్లలు స్కూల్ నించి వచ్చే టైం కి ఆవిడ వారి ఇళ్ళకివెళ్ళేది. వాళ్ళు కూడా ‘మామ్మ వచ్చింది’, ‘అమ్ముమ్మ వచ్చింది’ అని బ్యాగులు అక్కడ పడేసి మెడకి చుట్టేసుకుని కబుర్లు చెప్పే వాళ్ళు.
కాలక్రమేణా పెద్ద వయసు రావటం వల్ల ఆవిడ ఆరోగ్యం క్షీణిస్తున్నది. అయినా పిల్లలని చూడటానికి ఆవిడే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేది. అలా వచ్చి ఒక సారి మాధవి వాళ్ళ ఇంట్లో జబ్బు చేసి ఒళ్ళు తెలియని స్థితిలో పడకేసింది. మాధవి బాగా కంగారు పడి డాక్టర్ ని పిలిపించి ఏవో ఇంజక్షన్స్ ఇప్పించింది.
రెండు రోజులు ప్రపంచం ఎటు పోయిందో తెలియని స్థితిలో మంచం కరుచుకుని పడుకుని, ఆహారం కూడా తీసుకోలేదు. మూడో రోజు తెల్లవారు ఝామునే లేచి అందరు లేచే లోపు శుభ్రంగా స్నానం చేసి బామ్మ గారు విష్ణు సహస్ర నామ పారాయణ మొదలు పెట్టింది.
అది వినిపించి మాధవి నిద్ర లేచి, ‘బామ్మా ఒంట్లో ఎలా ఉన్నది’ అని అడిగింది. ‘అప్పుడే లేచి తల స్నానం ఎందుకు చేశావు’ అని కంగారు పడిపోయింది. బామ్మ చిరునవ్వుతో ‘నాకిది మామూలే, మీ చిన్నప్పుడు చూసే వాళ్ళు కద’ "ఒక రోజు మందు, ఒక రోజు విందన్న మాట" అన్నది.
‘పిచ్చి కుంక కంగారు పడ్డావా, నాకేమీ కాదు, మిమ్మల్నందరినీ చూసి ఆనందించమని దేవుడు నాకు చాలా ఆయుషు ఇచ్చాడు’ అని ‘ఈ పూట వంట నేను మడితో చేసుకుంటానమ్మా’ అన్నది.
‘రెండు రోజుల నించీ పస్తు పెట్టా కదా, పాపం వాడికి పెట్టి నేను తింటానని’ దేవుడి గది వంక చూపించి చేతులు జోడించింది.