కళలకాణాచి. :--వసుధారాణి.

 మా నరసరావుపేట లలితకళలకి ముఖ్యంగా పౌరాణిక నాటకాలకి ప్రసిద్ధి.ఐతే మా చిన్నప్పటికే అవి అంతరించి పోయాయి.కానీ కొంతమంది వాటిమీద ఇంకా ప్రేమ ,వ్యామోహం తగ్గని కళాకారులు,ప్రేక్షకులు కొందరు బలవంతంగా నడిపిస్తుండేవాళ్ళు.
పౌరాణిక నాటకం మొదలవ్వటమే రాత్రి 9 తరవాత అది ఏ తెల్లవారు ఝామున మూడు, నాలుగు వరకో కొనసాగేది.ఈనాటకాలకి రాజపోషకులు పల్లెటూరి వారే ఎక్కువకనుక ,వారికి వ్యవసాయ పనులు అట్టే ఉండని జనవరి,ఫిబ్రవరి నెలల్లో సాధారణంగా ఈ ప్రదర్శనలు మా మునిసిపల్ హై స్కూల్ గ్రౌండ్స్ లో జరుగుతుందేవి.రాత్రి పూట నిశ్శబ్దంగా ఉన్న టైంలో ఈ పద్యాలు ఒక్కోసారి గాలి వాలున మా ఇంటి దాకా కూడా వినపడుతుందడేవి.
ఇలా విని విని ఒకసారి  ఆనాటకం ఏందో చూద్దామని మా పెదనాన్న కొడుకు నాగభూషణం అన్నయ్యని  తీసుకెళ్లమని విసిగిచ్చి ,విసిగిచ్చి వెళితే వుంది కదా నాటకం.
మేము వెళ్ళేసరికి  నేలమీద పరిచిన జంపాకానలు వాటిమీద తలల చుట్టూ తలగుడ్డలు చుట్టుకుని కూర్చున్న ప్రేక్షకమహాశయులు,కనీసం ఒక్కళ్ళని వదిలితే ఒక్కళ్ళ చేతులో పొడవైన లంక పొగాకు చుట్టలు,కొంచెం క్లాస్ తక్కువ వారి చేతులో బీడీలు. కృష్ణరాయబారం నాటకం,నేను,స్టేజిమీద కళ్ళకి గంతలు కట్టుకున్న గాంధారి ఇద్దరమే ఆడలేడీస్ మొత్తం గ్రౌండ్లో.
కర్టెన్ రైజ్ అయి నాటకం నడవటం మొదలయ్యాక స్టేజ్ మీద పాడే ప్రతి పద్యం మా ప్రేక్షక మహాశయులకు వచ్చు వీళ్లంతా కోరస్సులు. బాగా ఓ పదినిమిషాలు ఆ ....... రాగం తీసిన తరవాత బావా,అనగానే అమ్మయ్య రాగం ఆగింది అని మనం అనుకోవటం  ఆలస్యం ఒన్స్ మోర్ అని విజిల్స్ .సదరు కళాకారుడు మళ్ళా ఆ....ఆ.. బావా ,అనటం.కొన్ని పద్యాలు మూడు నాలుగు ఒన్స్ మోర్లు కూడా పడ్డవి ఉన్నాయి.
వాళ్లకేమి ఒకటవ కృష్ణుడు, రెండవ కృష్ణుడు ఉంటారు.మనం ఒక్కళ్ళమే కదా వినాలి. మొత్తం మీద ఒక పౌరాణిక నాటకం చూసిన మంచి అనుభూతి మాత్రం మిగిలింది.
అలాగే చింతామణి నాటకంలో ముఖ్య భూమికలు ఐన సుబ్బిశెట్టి,చింతామణి పాత్రలు వేసే కళాకారులు మా ఊరిలో ఒక జంట రాష్ట్రవ్యాప్తంగా బాగా పేరుపొందిన వాళ్ళు.ఆ నాటకం చూడలేదు కానీ వాళ్ళు తెలుసు నాకు.ఆవిడ ఎంత చక్కని భాష మాట్లాడేదో.ఆయన నల్లటి మనిషి ఎపుడు పసుపు పచ్చనివి,గులాబీ రంగువి బాగా మిలమిలా మెరిసే పెద్దాపురం సిల్కులాల్చీలు తొడుక్కుని తిరుగుతుండే వాడు.కళాకారులంటే ఇలాగే ఉండాలి కామోసు అనుకునేదాన్ని చిన్నప్పుడు.