సంకురాతిరి_ముచ్చట(సంక్రాంతి): - సరోజన పోచమల్లు

 సట్టి వోయి సంకురాతిరి అచ్చింది అంటే సాలు బతుకమ్మ పండుగ వోలె అప్పాల సప్పుడు జోరుగుంటది.
గిది ఆంధ్రోళ్లు ,మనం కలిపి సేసుకునే పండుగ.
ఇగ పండుగ అప్పాల సప్పుడులో ముందుగాల నువ్వుల ముచ్చటే సెప్పాలి.
గి పండుగ తొలిత, తొలిత సేసే అప్పాలు సకినాలు.
మన తెలంగాణ ఆడ బిడ్డలు ఏ పండుగ సురువ్ సేసిన ముందుగాల పసువ్ గౌరమ్మ తోనే సేత్తరు.
అగో గందుకే ముందుగాల సకినాలు తోని సురువ్ జెత్తరు.ముందుగాల  సకినం సుట్టి  గౌరమ్మ ను వెట్టి ముత్తైదువులకు పసువ్,కుంకుమ పెట్టి ఇగ మొదలు పెడతరు
ఇగ సకినాలలో ఎసిటియ్ నువ్వులు,ఉప్పు ,ఓమ గింతే కానీ.
కానీ కాల్సే టప్పుడు పొయ్యి కాడ పైలంగా ఉండాలే అంటరు.నువ్వులు సిట్లీ నూనె పెయ్యంత వడుతది అని.
అగో గందుకే నువ్వులు మంచిగ గాలిచ్చి తడిపొడి గాకుండ  గాలిచ్చి మెత్తటి బట్టల కడుతరు.నువ్వులు ఆరకుండ.
ఇగ పోతే నువ్వుల ఉషికె ఉంటే సిట్టుతయ్ అంటరు.
కానీ నాకు తెలిసి నువ్వుల మీద తప్ప నువ్వులు మంచిగ కడిగి మీది అంపుతే సిట్లయ్.
నువ్వులు పురాతిగా ఆరనన్న ఆరాలే, లేకుంటే పదన నన్న  ఉండాలే గిట్ల ఉన్న సిట్లయ్.
ఇగ సకినాలతోని గారెలు,పూస,ఇంకా ఈ పండుగకు అరిసెలు సాన మంది సేసుకుంటరు.
గి అరిసెలు కూడ నువ్వులు,బెల్లం,సెక్కర తోని సేత్తరు.
కుడక పొడి ,యాలకులు ఎవరి ఇట్టం ఆళ్ళు.
 ఇగ గారెలు పచ్చి మిరం గారెలు గిప్పుడు మంచి గుంటయ్ ఉల్లాకు,కొత్తిమీర ఆకు,ఏసీ సెత్తే మస్థుగుంటయ్
#పండుగ
గి పండుగను మూడు దినాలు సేసుకుంటరు..
ముందుగాల రోజుభోగి ,రెండో దినం సంకురాత్రి,ఇగ మూడో నాడు కనుమ..
గి పండుగను పీడ పండుగ అని గూడ అంటరు ఎనకటి పెద్దమనుషులు.
ఇగ భోగి నాడు,సంకురాత్రి నాడుముగ్గులు ఏసుడు.
ఇగ  పీడ పండుగ ఆకిట్ల గాడిది బొర్రె సందు లేకుండ ముగ్గు పెట్టాలె అంటరు.
ఇగ భోగి నాడు గోటి ముగ్గు ఏయద్దు అంటరు..అంటే సుక్కలు ముగ్గు..
గిరకతోని అన్న, ఎనకటోళ్లు సెయ్యి తోని పెద్ద,పెద్ద ముగ్గులు పెడుతరు..
ఇగ గి ముగ్గులల్ల ఆవు పెండ తోని సేసిన పెండ గౌరమ్మ (గొబ్బెమ్మ) లు పెడుతరు..
గి గొబ్బెమ్మ మీద పిండి పోసలు, గరక పోసలు,పెట్టి..పసువ్,కుంకుమ ఏసీ..
గా గౌరమ్మ సుట్టు నవధాన్యలు పొత్తరు..
నువ్వులు,అరి గింజలు,రెగ్గాయలు, సిక్కుడు కాయలు,ఇంక ఏమన్న దినుసులు ఉంటే అయ్యి..
ఇగ గొబ్బెమ్మ సుట్టు బంతి పూలు పెడుతరు..
ఇగ సంకురాత్రి నాడు పెద్ద,పెద్ద సుక్కల ముగ్గులు వెట్టి..గండ్ల రంగులు నింపి మస్తుగెత్తరు..
ఇగ గంగిరెడ్ల ఆటలు..
కొంత మందికి సంకురాత్రి నోము ఉంటది..ఏదన్న మొక్కు కున్నది వెట్టి..ఇగ నోమును ఇంటికి తిరుకుంట పసువ్,కుంకుమ గా నోమును పంచుతరు ( ఎయ్యన్న బొమ్మలు,అత్తువలు వెట్టి నోముకుంటరు)
ఇగ మాకాడ సంకురాత్రికి కూడా ఆటల కోసుకుని నీసు తింటరు..గా దినం నాడు కూడా దసర లెక్క సేసుకుంటరు..( నోములు ఉన్నోళ్లు కాక)
ఇగ గియ్యన్ని పెద్ద పండుగలు...
~~SN~~