మంచు_గొడుగు// లిఖిత్ కుమార్ గోదా. కవిత్వం

 పరిమళం లేని చలి అత్తరు
ఒళ్లంతా నమిలేస్తున్నది..
కాలేజీలో నేను
స్టడీ అవర్లలో విపరీతంగా వణుకుతూ
అక్షరాలను ఏరుకుంటుంటే
తాతయ్యకి నా అవస్థ తెలిసినట్లు ఉంది...
నన్ను చదివించి,సంరక్షించాలని 
ఆయన ఈ స్వెటర్ 
సైకిల్ మీద బట్టలమ్మే 
రంగారావు తాత దగ్గర కొని
వచ్చి నా ఒంటి పైన కప్పిండు.
తాత మట్టి చేతుల పరిమళం తాగి
నా ఒంటి పైకి వచ్చి వాలిన
"తాటి చెట్టు" రంగు "కవచం" ఇది.
తాతయ్య ఎన్ని తాటిచెట్లెక్కితేనో 
ఇది నా పైన వాలిందో..
నేలను కప్పేసిన పచ్చని పైరులా 
ఒళ్ళంతా కప్పి
పరీక్షలకు సన్నద్ధం అవుతుంటే
నాతోపాటు ఈ స్వెటరు  చదివేసేది.
న్యూ ఇయర్ కి పక్షం రోజులు ముందు
అమ్మోరు తల్లి నా పై దాడి చేస్తే
ఇది నాకు బుల్లెట్ ప్రూఫ్ అయింది,
అమ్మలా తోడుండి,
అమ్మోరుని శాంతింపజేసి పంపించేసింది..
ఒక రాత్రి స్టడీ అవర్లో
శ్రీకాంత్ గాడికి చలిచీమ కరిచినపుడు
నాలో కలిగిన దుఃఖ స్పర్శ తగిలిందనుకుంటానూ ..
రెక్కలు తొడిగిన చద్దరులా మారి,
వాడి చలి పిశాచాన్ని పటాపంచలు చేసింది..
మన స్నేహానికి నిండు సాక్ష్యం
నువ్విచ్చిన వెచ్చని గొడుగేరా అంటే
నాలా ఎంత మురిసిపోయిందో..!
నిశ్శబ్దంగా మీదకి వస్తూ
ఒళ్ళు కొరికేస్తానన్న చలి పులిని
తరిమికొట్టే స్వెటర్ వజ్రాయుధం
మా తాత ఇచ్చిన ప్రేమజ్ఞాపకం..
ఇది వాన చినుకులను తెంపేసే
వైపర్ కూడా.!
ఎప్పుడూ మాకై తహతహలాడే
తాతయ్య గుర్తొచ్చినపుపుడు
ఈ మంచు గొడుగును కప్పుకొని
అలా గ్రౌండ్ లో పది నిమిషాలు నడిస్తే చాలు
తాతయ్యవేలుపట్టుకుని
చిరునవ్వుతో తిరిగిన క్షణాలు
కన్నుల్లో కవితలా కురుస్తుంటాయి
**             **            **
లిఖిత్ కుమార్ గోదా,
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.