పెద్ద (మనసు) ర్వాజ!:- దోర్బల బాల శేఖర శర్మ

 ఇది రామాయంపేటలోని ఒకప్పటి మా ఇంటి పెద్దర్వాజ. అంటే, ప్రధాన తూర్పు ద్వారం. శుభాశుభ కార్యక్రమాల వేళ శాస్త్రోక్తంగా ఇంట్లోకి రావడం, బయటికి వెళ్లడం దీని గుండానే  జరిగేది. దీనినే 'సందుల దర్వాజ' అనే వాళ్ళం. ఎందుకంటే, దాని ముందు రోడ్డు మరీ పెద్దగా కాక, చిన్న సందులా ఉండేది కనుక. చిన్నదంటే మరీ చిన్నదేమీ కాదు. ఈజీగా ఒకదాని వెనుక ఒకటిగా రెండు కార్లు పార్క్ చేయవచ్చు. ఉత్తరం వైపు గడీగోడను ఆనుకొని ఉన్న కొత్త దర్వాజ ముందు వీధిలో ఇది దాదాపు సగం ఉంటుంది. 
రెండు రోడ్ల ఇండ్లకు రాకపోకలు సాగించడానికి ఇలా రెండు దర్వాజలు ఉండటం సహజమే. మా ఇంటితో ఈ పెద్దర్వాజకు ఉన్న అనుబంధం ఎలాంటిదో నాకిప్పటికీ గుర్తు. చిన్నతనంలో ఈ దర్వాజనే నాకెన్నో విషయాలను నేర్పించింది. మా ఇంటి గౌరవ మర్యాదలు, ముఖ్యంగా మా అమ్మ పెద్ద మనసు ఈ తలుపుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు.
నా చిన్నతనంలో అంటే యాభై ఏండ్ల కిందట ఇప్పుడు కనిపిస్తున్న ఈ తలుపుల స్థానంలో వేరే పాత తలుపులు ఉండేవి. లోపలి వైపు తలుపులకు అడ్డంగా 'బేడం' కూడా ఉండేది. లోపలి నుంచి తలుపు తీయాలంటే ముందు ఈ 'బేడం' తీయాలి. 'బేడం' అంటే తలుపు గొళ్ళెం తీసిన వెంటనే వాటిని తెరువ రాకుండా అడ్డంగా రెండు గోడలకు చేసిన పెద్ద రంధ్రాలలోకి దూరి వుండే పెద్ద లావైన రోకలి వంటి కర్ర. దీనిని మొత్తంగా ఏదో ఒకవైపు రంధ్రంలోకి తోసేస్తే.. దర్వాజ తీయడానికి వీలవుతుంది. రెండు పెద్ద రంధ్రాల మధ్య అడ్డంగా ఉన్న బేడంను చిన్నతనంలో ఒక్క చేత్తో జరపడం నా వల్ల అయ్యేది కాదు. అది అంత బరువుగా ఉండేది. నా రెండు చేతులూ ఉపయోగించి ఒకవైపు జరిపి, తలుపు తీసేవాణ్ణి.
ఈ పెద్దర్వాజలోంచి ఇంట్లోకి వెళితే ఎదురుగా పెద్ద చతుషాల గచ్చు, పక్కనే ఎడమ వైపు వంటిల్లు, కుడి వైపు దివాన్ ఖానా. గచ్చు ఆవల ఎదురుగా వేపచెట్టు వున్న గడీగోడ తాలూకు పెరటి హాలు. ఈ హాలులోంచి పెద్దర్వాజ అవతలి వీధి కనిపించేది. ఇక్కడే గోడకు 'పెద్దగూడు' ఉండేది. సాయంత్రం చీకటి పడగానే అమ్మ ఎక్కా దీపం వెలిగించి ఈ గూట్లోనే ఎడమవైపు పెట్టేది. తర్వాత పూర్తిగా చీకటి పడ్డాక కందిలి వెలిగించేది. వెంటనే నాన్న చేతులెత్తి దీపానికి దండం పెట్టి వెలుగును కళ్ళకు అద్దుకొనేవారు. అమ్మ పెద్దర్వాజ పక్కన రెండు వైపులా ఉన్న గూళ్లలో దీపాల ప్రమిదలు వెలిగించి పెట్టేది.
పండగలు, శుభకార్యాల సందర్భాల్లో అమ్మ దానధర్మాలన్నీ పెద్దర్వాజ గుండానే చేసేది. కట్టెల మోపులు అమ్మొస్తే కొత్త దర్వాజ దగ్గర బేరం చేసి పెద్దర్వాజ వైపు ఉన్న పెరట్లో వేయించేది. అప్పటికి, వేడినీళ్లు కాచుకోవడానికేకాక వంటకు కూడా ఈ కలపే ఇంధనం. ఈ కట్టెలపొయ్యి పొగే తర్వాత దీర్ఘకాలంలో అమ్మ ఆయువు అర్ధాంతరంగా తీరిపోవడానికి కారణం అవడం పెద్ద విషాదం. వంటింట్లో ఒక బొగ్గుల పొయ్యి కూడా ఉండేది. దానిపై అమ్మ కేవలం పాలు కాచి, టీ చేసేది. దీపావళి పటాకులను కూడా పెద్దర్వాజ ముందే తొలుత కాల్చమనేవారు నాన్న. ఈ పెద్దర్వాజ గుండానే కావలసిన వాళ్ళు అందరూ వచ్చేవారు. వంటగది కూడా పక్కనే ఉండేది కనుక అమ్మకు పెద్దర్వాజే ఎంతో సౌలభ్యంగా ఉండేది. 'నీకేమమ్మా.. నలుగురు మగపిల్లలు.. రామలక్ష్మణ భరత శత్రుగ్నులోలే...' అని మా ఇంటికి పసుపు కుంకాలకు వచ్చే ముత్తయిదువలు అనడం నాకు బాగా జ్ఞాపకం. 
ఏ ఇంటికైనా పెద్దర్వాజ తప్పనిసరి. పెద్దల మనసులు ఎప్పుడూ ఆ తలుపుల గుండానే వచ్చి పోతుంటాయి. ఈ తరం పిల్లలు దీనిని గుర్తెరగాలనే ఈ నాలుగు మాటలు రాస్తున్నాను.

కామెంట్‌లు