నా బాల్యం:-సత్యవాణి

 అమ్మ చీరచెంగుతో 
దోబూచులాడిన నా బాల్యం
నాన్న భుజాలపై మేకపిల్లనైన
నా బాల్యం
తాత చెప్పుల్లో కాళ్ళుంచి నడచి
పడిలేచిన నా బాల్యం
పుస్తకం పట్టని వయసులోనే
అన్నపాత పుస్తకాలు సంచిలో కుక్కి
బడికెళ్ళిన నా బాల్యం
మీచెల్లిని నాకిస్తావా అని అడిగినవారిని
కండలూడివచ్చేలా కరచిన నా బాల్యం
అమ్మనాదీ అన్న తమ్మడిని
పడదోసి పారిపోయిన నా బాల్యం
దొంగతనంగా తోటకెళ్ళి 
దోరజామకాయలను
దోస్తులతో పంచుకుతిన్న నా బాల్యం
పక్కింటి సీతను పళ్ళికిలిస్తూ 
వెక్కిరించి తొడపిక్కలుతిన్న
నా బాల్యం
చెడుగుడాటలూ-చెరువులో ఈతలూ జరిపిన నా బంగారు బాల్యం
కుస్తీపట్టులూ-గస్తీ తిరుగుళ్ళూ
తిరిగి అలసిసొలసిన నా బాల్యం
తప్పిపోయింది నానుండి
తప్పించుకొని ఎటో వెళ్ళిపోయింది
వేయికళ్ళతో వెతికినా
కనపడుతుందనుకోనునేను