సాలెపురుగు సాహసం ( బుజ్జిపిల్లలకు బుజ్జికథ): ౼ దార్ల బుజ్జిబాబు


         అడవిలో  ఓ  సింహం ఉండేది. 

        అది జంతువులను విచ్చలవిడిగా వేటాడేది.

        దీనితో అడవిలో ఆందోళన కలిగింది. 

        ఎలాగైనా సింహాన్ని  చంపాలనుకున్నాయి. 

        ఆ బాధ్యతను గజరాజు ఏనుగుకు అప్పగించాయి.

        సింహం పేరు ఎత్తగానే గజరాజు గజగజ వణికింది. 

        వాళ్లంతా చెమటలు పట్టి చలి జ్వరం వచ్చింది. 

        "ఆ బాధ్యత నా కొద్దు బాబోయ్" అంది ఏనుగు.

        "ఇప్పుడెలా? మహా బలవంతుడైన ఏనుగే మూలనపడి మూలుగుతుంది. అల్ప ప్రాణులం మనమెంత? ఆ ప్రయత్నం మానుకుందాం" అంది కుందేలు.

        "కుందేలు బావా! నువ్వే అలా అంటే ఎలా? గతంలో అనేక సార్లు సింహం బారి నుండి మమ్ముల్ని కాపాడావు. నీ తెలివితేటలతో ఎలాగైనా ఆ సింహాన్ని సంహరించు" అని వేడుకుంది నక్క.

        ఇంతలో ఓ సాలె పురుగు వచ్చింది. 

        "ఇలా అందరం చేతులు కట్టుకు కూర్చుంటే కార్యం ఎలా నెరవేరుతుంది? ఏదో ఒక సాహసం చేయాలి. ఆత్మ త్యాగానికైనా సిద్ధపడాలి" అన్నది.

        "ఔనవును. అదేదో నీవే చేయరాదు" అంది గుర్రం.

         నేనే చేస్తాను. చూస్తూ ఉండండి" అంది సాలె పురుగు.

        జంతువులన్నీ నవ్వాయి. 

       "వీడా సింహాన్ని చంపేది. వీడెంత వీడి ఆకార మెంత?  వేలు మీద గోరంత లేడు. వీడు సాహసం చేస్తాడట, సింహాన్ని చంపుతాడటా" అని జంతువులన్నీ ఎగతాళి చేశాయి.

        సింహం వేటకు వచ్చింది. 

        సాలె పురుగు ఎగురుతూ వెళ్ళింది. 

        ముఖంపై వాలింది. 

        సింహం జూలు విదిలించింది. 

        సాలె పురుగు ఒక్క ఉదుటున సింహం చెవిలో దూరింది. 

        అక్కడ నుండి మెదడులోకి వెళ్ళింది.

        సింహానికి తల తిరిగి పిచ్చిపట్టినట్టు అయింది. 

        వెర్రి వెర్రిగా ఎగిరింది. 

        తల నొప్పి తట్టుకోలేక బండపైన తలను బాదుకుంది. 

        బాదుకుని బాదుకుని సింహం చనిపోయింది. 

        సాలె పురుగు కూడా మరణించింది. 

        అది చేసిన సాహసానికి జంతువులు కన్నీరు పెట్టుకున్నాయి.

        నీతి: చిన్న వారినైనా చిన్నచూపు చూడ కూడదు.