" అంతరంగం " (జీవితానుభవాలు-చదువు , బాల్యం)--కందర్ప మూర్తి , హైదరాబాదు.

  వయసు పెరుగుతున్న కొద్ది పిల్లల్లో లోకజ్ఞానం పెరుగు
 తుంటుంది.మంచి చెడ్డల అవగాహన వస్తుంది.
       నా చదువు ప్రాధమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలకు
మారింది. అప్పట్లో జిల్లా బోర్డు స్కూలుగా పిలవ బడేది.
 కొత్త ప్రదేశం కొత్త స్నేహితులు  కొత్త ఉపాధ్యాయులు.
పాకబడి నుంచి పైన ఎర్ర పెంకుల గోడల గదికి తరగతి మారింది.
     ఇప్పటినుంచి తెలుగు సబ్జ్యక్టులతో పాటు ఆంగ్లం , హిందీ
భాషల ప్రథమతరగతి పుస్తకాలు మొదలయాయి.అలాగే క్రాఫ్టు
 డ్రాయింగ్ క్లాసులు ప్రారంభమయాయి.
    మేము పాక బడి నుంచి పెంకుల గదికి చదువు మారినా
 రోజూ వేసుకునే నిక్కరు కమీజులే ఉండేవి. పుస్తకాల సంఖ్య
పెరిగింది. ఆడా మగా పిల్లలం కలిసే చదివే వాళ్లం.అప్పట్లో
టీచర్లు ఎక్కువ మగవారే ఉండేవారు.
     ఆటల మైదానంలో కర్ర పోల్సుకి  నెట్ కట్టి  రింగ్ టెన్నీస్, ఉన్నిబాల్  బ్యాట్ మింటన్ , కబడ్డీ, పైతరగతుల వారికి క్రికెట్
ఆటలు సాగేవి. మా చిన్నప్పుడు యువకుల్లో క్రికెట్ కి క్రేజ్
 ఉండేది. క్రికెట్ కామెంటరీలు రేడియో ట్రాన్సిస్టర్లో వినేవారు.
     స్కూల్ బయట పెద్ద మర్రి చెట్ల కింద పుల్ల ఇస్ ఫ్రూట్స్,
వేయించిన శనగకాయలు, బెల్లం జీళ్లు , పాకం పట్టిన పేలాల
చక్కీలు వంటివి అమ్మకం జరిగేవి. క్లాసుల విశ్రాంతి సమయంలో
 కొని తినేవాళ్లం. రాగి పైసలు కానీలు అర్థణావంటి నాణేలు వాడుకలో ఉండేవి.కానీకి మూడు పైసలు.ఒక పైస ఖర్చు పెడితే
వస్తువు దొరికేది.రోడ్డు మీద వస్తువులు కొని తినడం శుచి
శుభ్రత గురించి అంతగా తెలిసేది కాదు.
     క్లాసులో డెస్కు బెంచీలు ఉండేవి. టీచర్లకు ఎత్తైన వేదిక
గోడకి నల్ల బోర్డు వెంట డస్టర్ ఉండేవి. క్లాస్ రూములో పంకాలు
లేనందున విశాలమైన కిటికీలు వెంటిలేటర్లు అమర్చి ఉండేవి.
 క్లాసులో పాఠాలైన తర్వాత ఇంటి కొచ్చి ఏవో చిరు తిళ్లు తిని
  సాయంకాలం బయట వయసును బట్టి ఆడ మగ పిల్లలు ఆటలతో గడిపి చీకటి పడేసరికి ఇంటికి చేరేవాళ్లం.
 కాళ్లూ చేతులు కడుక్కుని అన్నం తిని కిరోసిన్ దీపాల వద్ద చదువుకుని
 నిద్ర పోయేవాళ్లం. మేము కింద చాపల మీదే నిద్ర పోయేవారిమి
 ముసలివాళ్లు పెద్దవాళ్లు మాత్రమే మంచాలు బల్లల మీద
నిద్రించేవారు.మా తాతయ్య ఊరు , పల్లెటూళ్లలో  రాత్రిళ్లు వెంట బేటరీ టార్చిలైట్లు , తేళ్లు పాముల భయం కొద్దీ వెంట చపాటి
కర్ర లాంటిది అందుబాటులో ఉంచుకునే వారు. రాత్రప్పుడు
పొలాల గట్లంట నడవాల్సి వస్తే చప్పుడు చేసే కిర్రు చెప్పులు
కాళ్లకు తొడిగేవారు. నాలుగు పక్కల అద్దాలుండే బుడ్డీ
 దీపం వెంట ఉంచుకునేవారు.
 మా చోడవరంలో
 రోడ్డు మీద రద్దీ ఎక్కువ కనిపించేది కాదు.ప్రైవేట్ బస్సు
సర్వీసులు దూర ప్రాంతాలకు నడిచేవి. రోడ్లు కంకర మట్టితో
 సింగిల్ రోడ్లే ఉండేవి. గాలికి దుమ్ము ఎగిరేది.
  ప్రభుత్వ ఆఫీసర్ ఉధ్యోగుల కేంపుల కోసం జీపులు   అందుబాటులో ఉండేవి. కొందరు వ్యాపారస్తులు అంబాసిడర్
 కార్లు హోదా కోసం వాడేవారు.
  అప్పటి రోజుల్లో కాలినడకే ముఖ్య ప్రయాణ సాధనం.
      ఎక్కువగా రెండు చక్రాల సైకిల్ వాడులో ఉండేవి. సైకిళ్లు
గంటల చొప్పున అద్దెకు ఇచ్చే వారు. సైకిల్ రిపేరు టైర్ పంక్చర్
  వేసే షాపులు కనబడేవి. అప్పట్లో మూడు చక్రాల సైకిల్ రిక్షాలు
   కొత్తగా రోడ్ల మీద తిరిగేవి. సైకిలుంటే పంచాయతీ లేక మున్సిపాలిటీకి లైసెన్స్ కట్టి సీలు బిళ్ల హేండిల్ కి తగిలించాలి.
 రాత్రయితే సైకిళ్లకు డైనమోతో నడిచే లైట్లు లేదంటే బేటరీ
 లైట్లు లేకపోతే పోలీసులు జప్తు చేసేవారు.
 కొన్ని చోట్ల గుర్రం లాగే జట్కాబళ్లు కూడళ్లలో ఉండి
  ప్రయాణికుల్ని దగ్గర ప్రాంతాలకు చేరవేసేవి.
బరువులు మట్టి ఇసక వంటి రవాణా కోసం రెండు ఎడ్ల బళ్ళు
ఉపయోగించేవారు.పల్లె ప్రాంతాల నుంచి పట్నాలకు సినేమా
చూసే ప్రజలు ఎక్కువగా ఎడ్లబళ్ల మీద వచ్చేవారు.కొన్ని చోట్ల
 రేకుల షెడ్డులో నడిచే టూరింగ్ టాకీసులు అందుబాటులో
 ఉండేవి. సినేమా కేన్వాసింగ్ కోసం సైకిల్ రిక్షాలకు వాల్ పోస్టర్లు
 కట్టి వీధులంట గ్రామాలలో మైకులలో తిరిగేవారు.
     అప్పటి ప్రజలలో కళాభిమానం ఎక్కువ ఉండేది. పౌరాణిక
సాంఘిక జానపద స్టేజి నాటకాలు , బుర్ర కథలు , హరికథలు
 తోలు బొమ్మలాట వంటివి దైవ కార్యాలు గ్రామ దేవతల
ఉత్సవాల సమయాల్లో పెట్టేవారు.నా చిన్న నాటి 
 నాటకాలు శ్రీ కృష్ణ రాయభారం, పాండవ ఉధ్యోగ విజయాలు,
 కురుక్షేత్రం, గయోపాఖ్యానం, రామాంజనేయ యుద్ధం పౌరాణిక
నాటకాలే కాకుండా చింతామణి రంగూన్ రౌడి లాంటి సామాజిక
నాటకాలు కూడా వేస్తుండేవారు. రాత్రి పది గంటలకు మొదలైతే
తెల్లారే వరకు నాటకం జరిగేది.తర్వాత రోజుల్లోకుర్రకారు కోసం వేస్యల సినీ రికార్డింగు డ్యాన్సులు వచ్చాయి.
    మాకు  ఉదయం దంతదావనం కోసం ఎర్ర గరుకు పళ్ల పొడి , 
 పేడ పిడకల కచిక  ఉప్పు వంటివి అందుబాటులో ఉండేవి.
 పెద్ద వాళ్లు వేప మర్రి తుమ్మ కాగు వంటి చెట్ల కొమ్మలు ముక్కలు చేసి పళ్లతో నమిలి కుంచెలా చేసి పళ్లు తోమి చివర
 ముక్క రెండు బద్దలు చేసి నాలుక శుభ్రం చేసేవారు.మా ఊళ్లో
 సాయంకాలం రోడ్డు కూడలిలో వివిధ చెట్ల కొమ్మలు పది ఇరవై 
ముక్కలుగా చేసి కట్టలు  చేసి అమ్మేవారు.
     మా ఇంటి  బార్బరు వారానికి రెండుసార్లు ఇంటికి వచ్చి
అవుసరమైన వారికి తల క్షవరం చేసేవారు. అలాగే ఇంటి
చాకలి సమయానుకూలంగా వచ్చి మురికి బట్టలు తీసుకెళ్లి
 చాకిరేవులో ఉతికి తెచ్చేవారు.
      పండగలప్పుడు ఇంట్లో వారికి కావల్సిన బట్టలు ఊరు
షావుకారు వయసుకు తగ్గట్టు రకరకాల రంగుల చీరెలు లంగా
 జాకెట్ గుడ్డలు , పెద్ద వారికి కావల్సిన పంచలు ధోతీలు అలాగే
మా పిల్లల కోసం  గళ్ల చెక్కుల కమీజు ,ఒకే ముదర రంగునిక్కరు
గుడ్డల తానుల నుంచి కావల్సిన గుడ్డ కత్తిరించి ఇస్తే టైలర్ మా కొలతల ప్రకారం కత్తిరించి కుట్టి ఇచ్చేవారు. అప్పుడు అన్నీ
 నేత బట్టలే వాడేవారు.
గజాలు అడుగు అంగుళాలలో కొలతలు జరిగేవి.ద్రవ ఘన పదార్థాలు వీశ పౌను తవ్వ గిద్దె సోల కొలతలు
 ధాన్యం వంటి చిరు ధాన్యాలు కుంచం మానిక వంటి కొలమానాలు వాడేవారు. వ్యవసాయ భూములు
 ఇంటి  స్థలాలు ఎకరాలు గజాలు అడుగులు అంగుళాలలో
 కొలుచుకునేవారు. బ్రిటిష్ మానం మెట్రిక్ మానం గా
 లెక్కలు  జరిగేవి.
    ఇంక ఇంట్లో వంట విషయానికొస్తే, పెరటివైపు వంట గదిలో
మట్టి పొయ్యలు కట్టెలతో ఇత్తడి కంచు పాత్రల్లో వంట జరిగేది.
 సాయంకాలం కర్ర బొగ్గుల ఇనప పొయ్యలు ,రంపం కర్ర పొట్టు
పొయ్యల మీద వంటలు చేసుకునే వారు. 
, ఇంక భోజనాల దగ్గర కొస్తే ఉదయం పిల్లలకు రాత్రి కుండలో
దబ్బాకులు వేసి పులియబెట్టిన చద్దన్నం సిల్వర్ పళ్లెంలో పెట్టి
నంచుకోడానికి ఆవకాయ వేసేవారు. చద్దన్నం చల్లదనమే కాదు
తిన్న తర్వాత మత్తుగా అనిపించేది. అందువల్ల పచ్చి ఉల్లిపాయ ముక్కలు చేసి అన్నంలో వేసేవారు.
ఎవరికీ కాఫీ టీ లు ఉండేవి కావు. కొంతమంది పెద్దవాళ్లు ఫిల్టర్
 కాఫీ  తాగేవారు.
   మధ్యాహ్నం రాత్రి  భోజనాలప్పుడు ముందు పిల్లలకు పెట్టిన
తర్వాత పెద్దలు తినేవారు. నేల మీద కర్ర పీట వేసుకుని కూర్చుని పక్కన ఇత్తడి చెంబుతో మంచినీళ్లు ఉంచుకునే
వారు.అన్నం అరటిఆకులు , విస్తరాకులు బాదం ఆకుల విస్తరిలో
  పెట్టేవారు.మగవారి భోజనాలయాక ఆడవారు భోంచేసేవారు.
 తర్వాత అన్నం తిన్న ప్రాంతాన్ని నీళ్లతో శుద్ధి చేసేవారు.
  రాత్రి పది గంటలలోపు భోజనాలై పక్క బట్టలు సర్దేసేవారు.
   అడవి కర్రల   ై 
 మోపులు చిన్న కట్టెలుగా ఎడ్ల బళ్ల మీద అమ్మేవారు. అలాగే
అడవి కర్ర కాల్చిన బొగ్గు బస్తాల్లో ఉంచి అమ్మకం చేసేవారు.
  సముద్రపు ఉప్పు  ఎడ్ల బళ్ల మీద చుట్టూ దడి కట్టి కర్ర
కుంచాలతో అమ్మకం చేసేవారు. మాది ఎర్ర నేల ప్రాంతమై
నందున ఉప్పు గడ్డలు ఎర్రని రంగులో కనబడేవి.ఉప్పు
 బయట నీరు పడుతుంది కనక మట్టికుండలు లేక రాతి
చిప్పల్లో భద్రపరుచుకునే వారు.
   ప్రతి ఇంటి పెరడులో మంచి నీటి బావులు ఉండేవి.వేసవిలో
తప్ప ఎప్పుడూ బావిలో నీరు ఉండేది. చేదలు, ఇనప బకెట్లకు
 చేంతాడు లేక నైలాన్ తాడు కట్టి నూతిలోంచి నీళ్లు తోడుకునే
వారు. సిమ్మెంటు గోలేలు కుండలు ఇత్తడి గాబుల్లో నీళ్లు 
 నింపుకుని చెంబులతో పైకి తీసి వాడుకునే వారు .
      మగవారు పెద్దలు, పిల్లలు నూతి దగ్గరే స్నానాలు చేసేవారు.
 చలికాలంలో ఐతే రాగి డైసాలు నీటితో మూడు రాళ్ల మీద పెట్టి
కింద కట్టెలు కమ్మలు మంటతో వేడిచేసి ఇనప బకెట్ల లో చన్నీళ్లు
కలుపుకుని వంటి మీద పోసుకునే వారు. కొన్ని చోట్ల నిలువుగా
ఉండే రాగి బాయిలర్లలో నీళ్లు నింపి మధ్య గొట్టంలో కట్టెలతో
వేడి చేసేవారు. బాయిలర్ పైన చల్లనీళ్లు నింపడానికి మూత
ఉండి కింద వేడినీళ్లు పట్టుకోడానికి నల్లా ఉండేది.
స్నానాలకు సబ్బు ఉండేది కాదు. షీకాకాయ్ పౌడరు లేక
కుంకుడుకాయ నురగతో ఒళ్లు రుద్దేవారిమి.అప్పట్లో లైఫ్ బాయ్
 సబ్బు ఎర్రటి రంగు  కార్బోలిక్ వాసనతో మందంగా ఉండేది.
   గ్రామాల్లో ఐతే ఊరి రచ్చబండ మీద ఊరి పెద్దలు కూర్చుని
మంచి చెడ్డలు మాట్లాడు కోవడం , ఏదైన సమస్య వస్తే
  పరిష్కరించుకునే వారు.
     అప్పటి బాల్యం చీకు చింతలేని ఒత్తిడికి దూరంగా అమాయ
కంగా గడిచిపోయేది.
     "భలే భలే మంచి రోజులులే, మళ్ళీ మళ్లీ ఇక రావులే, బాల్యం
 అంటే ఆనందం -- స్టూడెంట్ లైఫే హాయిలే..."
                         *                    *                   *