గుర్తుకొస్తున్నాయి:- సత్యవాణి కుంటముక్కుల
ఆకాశంలో మేఘాలు చూసి
పేదరాశి పెద్దమ్మ పసుపు కుంకుమలు 
ఎండబెట్టిందనుకోవడం     

కొండ పైన దిగిన మేఘాలను చూసి
మేఘాలు మేత మేస్తున్నాయనుకోవడం

బాపనారి వేపచెట్టు మీద దెయ్యం
వుందనుకొని భయపడడం

ముక్కు పుండడేలా గోక్కుంటే 
దేవుడు కనిపిస్తాడనుకోవడం

ఏడు పంచల తాటాకుముక్కలు
వేస్తే గోరింటాకు బాగా పండుతుందనుకొవడం

తాటాకు బుాజు నెమలికన్నుకు
పుస్తకంలో ఆహారంగా పెడితే
పిల్లలను పెడుతుందనుకోవడం

నా కూతకే కోకీలమ్మ కుహు కుహు 
అని బదులిస్తోందనుకోవడం

కాకి అరిస్తే చుట్టాలొస్తారని సంబరపడడం

ఇంటికొచ్చిన చుట్టాల పెట్టె ,చెప్పులు దాచేస్తే వుండిపోతారని బ్రమపడడం

అద్దానికి ఎండ చూపించి ఆకాంతిని గోడపైకి పంపి చెల్లినీ
తమ్ముడ్నీ పట్టుకొమ్మని కాంతి
అందకుండా చేసి ఏడిపించడం

కంచంలోవేవీ పారెయ్యకుండా
వూడ్చుకొని తింటే ఉద్యోగం వస్తుందనని 
అమ్మచెప్పింది నమ్మేయడం

ఎవరేదిచెప్పినా నోరుతెరచుకొని విని నమ్మేయడం

ఇలా ఎన్నెన్ని జ్ఞాపకాలో
గుర్తుకొస్తున్నాయి
అనుక్షణం గుర్తుకొస్తూనే వున్నాయి

          

కామెంట్‌లు