పావురాయి స్నేహం (బుజ్జిపిల్లలకు బుజ్జికథ)౼ దార్ల బుజ్జిబాబు

       ఒక అడవిలో పావురాయి, ఏనుగు  స్నేహంగా ఉండేవి. 
       ఒక రోజు ఏనుగుఏమరుపాటుగా ఉంది.
       అప్పుడే ఒక సింహం చూసి “ఆహా! ఈ రోజు బలే మంచిరోజు.  గజరాజ ఆహారంగా దొరికింది" అనుకుంది. 
       వచ్చి మీద పడింది. 
        రెండింటి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. 
       ఇదంతా పావురాయి చూసింది. 
       మిత్రుడిని కాపాడాలి అనుకుంది. 
       అటుగా వెళుతున్న తేలును పిలిచి “మిత్రమా! నీవు వెళ్లి ఆ దుష్ట సింహాన్ని కుట్టు. 
       లేకుంటే మన కళ్ల ఎదుటే ఏనుగు చనిపోతుంది” అన్నది పావురం. 
       తేలు గబగబా పోయి సింహాన్ని కుట్టింది.
       అది బాధతో మూలుగుతూ పరుగెత్తింది.
       ఏనుగు అలసిసొలసి పడిపోయింది.
       పావురాయి రెక్కలతో విసిరింది. 
       ఆకులు తెచ్చి గాయాలకు రాసింది. 
       కాసేపటికి ఏనుగు తేరుకుంది.
       కొన్నాళ్లు గడిచాయి.
       ఒక రోజు సింహం బోనులో పడింది.
       దానిని తేలు చూసింది. 
       పావురాయి వద్దకు వచ్చి "మిత్రమా! ఆ దుష్టసింహం బోనులో పడి పోయింది. 
       ఈ రోజుతో దాని పీడ వీడిపోయింది. 
       ఇక మనమంతా సుఖంగా ఉండవచ్చు" అంది 
       పావురాయికి జాలి వేసింది.
       సింహాన్ని రక్షించాలి అనుకుంది. 
       వెళ్లి ఏనుగుతో చెప్పి తీసుకువచ్చింది. 
       ఏనుగు తొండంతో బోను తలుపును పైకి లేపింది. 
       సింహం బయటకు వచ్చి కృతజ్ఞతగా చూసింది.
        ఇలా అన్నది. “గజరాజా! బలవంతుడనని విర్రవీగాను.
        అమాయకమైన జీవులను చంపాను. 
       ఎన్నో పాపాలు చేశాను.
       నిన్ను కూడా చంపబోయాను. 
       నన్ను మన్నించు. 
       నా కళ్లు తెరిపించావు. 
       ఇంక ఎప్పుడూ ఇతరులను హింసించను" అని రెండు చేతులు జోడించి దండం పెట్టింది సింహం.
     “మృగరాజా! ఇదంతా ఆ పావురాయి మంచితనం.
       అదే లేకుంటే ఆ రోజు నేను బ్రతికేవాడినే కాదు. 
       నేడు మీరు జీవించి ఉండేవారే కారు.
        ఈ శాంతమూర్తికి ఇద్దరంఋణపడి ఉన్నాము” అన్నది ఏనుగు.
        ఆ రోజు నుంచి అవి మూడు మంచి స్నేహితులయ్యాయి.
        అంతేకాదు అడవిలోని జంతువులన్నీ కలిసిమెలసి జీవించాయి.
       నీతి : అపకారికి ఉపకారం చేస్తే ఎంతో మేలు.
కామెంట్‌లు