ఉచితం సరికాదు:-- యామిజాల జగదీశ్
 నసీరుద్దీన్ ముల్లా మన తెనాలి రామకృష్ణుడులాంటివాడు. ఆయన చిన్న చిన్న సంఘటనలతో చెప్పే విషయంలో ఎంతో అర్థముంటుంది.
ముల్లా ఓసారి పొరుగుంటికి వెళ్ళి "అయ్యా! అనుకోకుండా అతిథులు వచ్చారు. ఓ గ్లాసు తక్కువపడింది. మీరొక గ్లాసు ఇస్తే మళ్ళీ ఇచ్చెస్తాను" అంటాడు.
పక్కింటాయన సరేనని ఓ గ్లాసిచ్చాడు. 
పనైన తర్వాత ముల్లా పక్కింటాయనకు అతనిచ్చిన గ్లాసుతోపాటు మరొక చిన్న గ్లాసుకూడా ఇస్తాడు. 
పక్కింటాయన "నేనిచ్చిన గ్లాసు ఒకటే కదా? ఈ రెండో గ్లాసేమిటీ?" అని అడిగాడు. 
"అదా. నువ్విచ్చిన గ్లాసుకి పిల్ల పుట్టింది. అది నాకెందుకు? మీ గ్లాసూ దాని పిల్ల మీ సొంతం...." అన్నాడు ముల్లా. 
పొరుగింటితను "బలే ఉందే" అని ఆ రెండు గ్లాసులూ తీసుకున్నాడు. 
రెండు మూడు రోజుల తర్వాత ముల్లా పొరుగింటికి వెళ్ళి బిందె కావాలి. పనవడంతోనే తిరిగిచ్చెస్తాను" అన్నాడు. 
పొరుగింటాయన "గ్లాసిస్తే మరో గ్లాస్ ఇచ్చాడు. బిందెకింకో బిందె ఇస్తాడేమో కదా" అని మనసులో అనుకుని లోపలికెళ్ళి బిందె పట్టుకొచ్చి ముల్లాకిచ్చాడు.
ముల్లా మరుసటిరోజు బిందెతోపాటు మరో చిన్న బిందె తీసుకెళ్ళి పక్కింటాయనకు ఇచ్చాడు. 
"ఇదేంటీ చిన్న బిందె" అని పక్కింటాయన అడగ్గా ముల్లా "మీరిచ్చిన బిందెకు పిల్ల పుట్టింది. అది మీకు సొంతం" అని అంటాడు. 
పొరిగింటాయన "ముల్లా! మా ఇంట ఉన్నప్పుడు పిల్లలను ఇవ్వని గ్లాసు, బిందె మీ ఇంట పిల్లలను పెట్టాయి. విచిత్రంగా ఉంది?" అన్నాడు. 
ఔనంటూ ముల్లా ఇంటికొచ్చెస్తాడు. 
ఓ రెండు నెలలు గడిచాయి. 
ముల్లా పక్కింటికి వెళ్ళి "మా ఆవిడ పెళ్ళికి వెళ్తోంది. తనకు నగలేవీ లేవు వేసుకుని వెళ్దామంటే. మీ ఆవిడకున్న రవ్వల నెక్లస్ అడిగి తీసుకురమ్మంది. పెళ్ళి నించి తిరిగిరాగానే ఇచ్చెస్తానంది" అన్నాడు ముల్లా. 
పక్కింటాయనకు మనసులో ఖుషీ ఖుషీ. గ్లాసు, బిందె ముల్లా ఇంట పిల్లలు పెట్టగా నెక్లస్ మాత్రం పిల్లనివ్వదా అని మనసులో ఏవేవో ఊహించుకుని నెక్లస్ ఇస్తాడు ముల్లాకి. 
ఓ వారమైంది. ముల్లా నెక్లస్ ఇవ్వకపోవడంతో పక్కింటాయన నెక్లస్ ఏదీ అని అడుగుతాడు. ఊరుకెళ్ళిన తన భార్య ఇంకా రాలేదు అంటాడు. రెండు వారాలైంది. మూడు వారాలైంది. నెలైంది. పక్కింటాయన మనసులో గుబులు పట్టుకుంది. 
ఉండలేక ముల్లాను కలిసి నెక్లస్ ఏదీ అని అడుగుతాడు. 
అప్పుడు ముల్లా "అరెరె....చెప్పడం మరిచాను. ప్రసవంలో నెక్లస్ చచ్చిపోయింది. ఇప్పుడే పూడ్చిపెట్టి వస్తున్నాను" అని బాధ పడతాడు. 
గ్లాసుకి గ్లాసు, బిందెకి బిందె తీసుకున్న పక్కింటాయన ఇప్పుడేం ప్రశ్నించగలడు. పిల్లలు పెట్టాయన్న మాటలు నమ్మి మహదానందంగా గ్లాసూ బిందే తీసుకున్న పక్కింటాయన ఇప్పుడు నెక్లస్ ప్రసవంలో చచ్చిపోయిందనే ముల్లా మాటను కాదని ఎలా వాదించగలడు.
ఈ కథ ద్వారా తెలుసుకోవలసిందేమిటంటే ఉచితంగా ఏదొచ్చినా తీసుకోకూడదు అని. ఏవీ శ్రమపడక ఉచితంగా వచ్చినా అవి త్వరలోనే ఏదో ఒకటి తిరిగీ తీసుకుపోవటానికే వస్తుందని అప్రమత్తంగా ఉండాలి.