నిద్రయొక వరము కద నిధులవియె కలలుగా
నిదర దేవత మనకు నిత్య వరముల నిచ్చు !
భువినేలు విభుడైన భుక్తిలేని వాడును
నిద్రసుఖమును యెరుగు నిదురను విశ్రమించు
నీలాల కన్నులకు నిండైన విశ్రాంతి
మెల్లగా చల్లగా మేలైన లోకమిది
ఎరుకయే లేనట్టి వేవేవొ ఘటనలూ
మునుపు చూడనట్టివి ముగ్ధులగు విషయాలు
మనకు తెలియని వ్యక్తి మనసార మాటాడు
దారి తెలియని దేశ దరిదాపు లందుకొను
మేల్కొనిన పిదపయును మెల్లగా గుర్తగును
కొన్ని కలలవేమో కోల్పోవు మన మనసు
దివినున్న వారొచ్చి దివ్యముగ నినుజేరి
ఆశీస్సులందించు ఆప్యాయతను జూపు
తలదిండు తడిసేను తనకొరకు కన్నీట
మెలుకువను ఋజువగును మేటి కల హృదిచెమ్మ
పరిష్కారము లేని పలు సమస్యలకును
చిక్కులే విడిపోవు చింతలేనిది నిద్ర
పట్టుపాన్పులు లేవు పనిచేసి యలసేవు
క్షణములో నిదురమ్మ క్షాo తముగ దరిజేరు
దుష్టులకు దురితలకు దూరమే నిదురమ్మ
ప్రతిరేయి పగబూని ప్రయాసను కలిగించు
సాత్వికాహారమును సరియైన పరిశ్రమ
మంచి పుస్తకపఠన మంతయును నిద్రసిరి!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి