సూర్య, చంద్రుల కథ:- టి. లలితా ప్రసాద్

 చాలా కాలం క్రితం, సూర్యుడు, నీరు మంచి స్నేహితులు. ఇద్దరూ భూమి మీద కలిసే జీవించేరు. సూర్యుడు ఎప్పుడూ నీటి దగ్గరికి వెళుతూండేవాడు, నీరు మాత్రం వచ్చేది కాదు.
   ఎందుకు రావడంలేదని ఒకరోజు సూర్యుడు అడిగేడు. నీ ఇల్లు పెద్దదిగాదు, నేను, నా పరివారం వస్తే మీ ఇంట్లో అంతా బయటకి వెళ్లాల్సివస్తుంది అన్నది.
   మరొకసారి అడిగితే, ''నేను రావడానికి నీ ఇల్లు సరిపడదు. పెద్ద ఇల్లు అవసరమవుతుంది. చాలా పెద్ద ఇల్లు కట్టాల్సి వస్తుంది సుమా. మావాళ్లు చాలామంది వస్తే, నీ యింట గదులు సరిపడవు'' అన్నది నీరు.
    సూర్యుడు పెద్ద ఇల్లు కడతానని అప్పుడు ఆహ్వానిస్తానని అన్నాడు. వెంటనే ఇంటికి వెళ్లి భార్య చంద్రతో చెప్పేడు. తాను నీటిని తమ ఇంటికి ఆహ్వానించేనని, అందుకు నీరు అడిగినదీ చెప్పేడు.
   మర్నాడు వాళ్లు నిజంగానే పెద్ద ఇల్లు కట్టడంలో నిమగ్నమయ్యారు. ఇల్లు పూర్తయింది. దంపతులు నీటిని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించేరు.
   నీరు వచ్చింది. అంతలో సూర్యుడి స్నేహితుడు ఒకడు ''నీ స్నేహితుడు ఇంట్లోకి రావడం సురక్షితమేనా'' అని అడిగేడు. ఫరవాలేదు, లోపలికి రమ్మని పిలవమన్నాడు.
   అంతే నీరు అమాంతం లోపలికి తోసుకుంటూ వచ్చింది, దాంతోపాటు చేపలు, నీటి జంతువులూ వచ్చేయి.చూస్తుండగానే నీరు పెరిగి మనుషుల తలల మీదకి వచ్చేసింది. ''మిత్రమా, మావాళ్లని ఇంకా రమ్మంటావా?'' అని అడిగింది.
    అసలు సంగతి గ్రహించుకోలేక సూర్యుడు, చంద్ర ''రండి'' అన్నారు. వెంటనే నీటి స్నేహితులు లోపలికి చొరబడ్డారు. క్షణంలో దంపతులు ఇంటి కప్పుమీదకి చేరుకున్నారు.
    అప్పుడు మళ్లీ నీరు అడగింది మావాళ్లు ఇంకా రావచ్చా అని. దంపతులు ఫరవాలేదు రమ్మనండి అన్నారు.
    మరుక్షణం నీరు ఆ ఇంటిని ముంచెత్తింది. ఇక లాభం లేదని సూర్యుడు, చంద్రుడు తప్పనిస్థితిలో ఆకాశాన్ని చేరేరు.
    అదుగో అప్పటినుంచీ వాళ్లు అలా అక్కడే ఉండిపోయేరు.
                                                                                                                                  (ఆఫ్రికా జానపద కథ)