:"చక్కెర గోళీలు" (పిల్లల కోసం తియ్యని గేయాలు):--యాడవరం చంద్రకాంత్ గౌడ్-తెలుగు పండిట్.-సిద్దిపేట9441762105


 బాలసాహిత్యం అంటేనే గేయాలు ,కథలు ,లాలి పాటలు, జోల పాటలు. అంతేకాకుండా ఒక్కో ఆటకు కు ఒక పాట ఉంది .నిజానికి పిల్లలు నోరు తెరిస్తే చెరువు అలుగు దుoకినట్లు  పాటలు పాడేవారు ఒకప్పుడు. టెక్నాలజీ అభివృద్ధి చెందాక టీవీ, సెల్ ఫోన్ ,కంప్యూటర్ ప్రపంచంలో బాలగేయాలు ప్రస్తుతం మాయమైపోయాయి.

శ్రీ పెందోట వెంకటేశ్వర్లు గారు రాసిన "చక్కెర గోళీలు" బాల గేయాల శీర్షిక చూడగానే నాకైతే పాతికేళ్ల క్రితం బాల్య స్మృతులు ముసురుకున్నాయి. మూడు ,నాలుగు తరగతుల లో బడికి వెళ్లేటప్పుడు  నేను  ఐదు పైసల కు ఒకటి చొప్పున రూపాయికి వచ్చే  చక్కెర గోళీలు కొనుక్కునే వాడిని. ఆ చక్కెర గోలీలు నీటిడబ్బాలో వేసుకొని అవి కరిగిన తర్వాత విరామ సమయంలో తాగేవాళ్ళం. ఆ అనుభూతి వర్ణించలేనిది.
అలాంటి అనుభూతి ఇప్పుడు వెంకటేశ్వర్లు గారి "చక్కరి గోళీలు "అలాంటి అనుభూతిని తెచ్చింది .తీయనైన మధురమైన గేయాలను అందించారు  పెందోటవారు.
విద్యార్థులు చెడు వైపు మళ్లకుండా భావి పౌరులుగా మలచడానికి కవి మాతృభాష, ఉత్సాహం, అభినందనలు, రోడ్డు ,చదువు ,గాంధీజీ లాంటి అనేక అంశాలను చక్కటి, చిక్కటి తీయని గేయాలుగా మలిచాడు.
చదవాలి చదవాలి 
పాఠాలు ఇష్టంగా 
ఆడాలి ఆడాలి మంచి ఆట ఎప్పుడు 
ఈ చదువులు ఈ ఆటలు
భవిత లోన వెలుగులు
అంటూ విద్యార్థులు చదువులు చదవాలని భవిష్యత్తులో వెలుగులు నింపుకోవాలని ఆకాంక్షించాడు కవి.
వందేమాతరం అన్నాడు తెల్లదొరలను తరిమాడు
 స్వాతంత్రం మాకన్నాడు సత్యాగ్రహం పట్టాడు
 దేశ గౌరవం చాటాడు 
జాతీయ జెండా పట్టాడు.
గాంధీజీ గొప్పదనాన్ని చాటుతూ విద్యార్థు ల్లో స్వాతంత్ర్య భావాలు కలిగిoచేలా ఈ గేయాన్ని కూర్చాడు.
కరచాలనం మానండి నమస్కారమేలండి గుంపులుగా ఉండదండి ముక్కుకు మాస్క్ కట్టండి దూరం దూరం జరగండి 
కరోనానే తరమండి.
మాయదారి మహమ్మారి కరోనా నివారణకు జాగ్రత్తలు ఈ గేయంలో అంత్యప్రాసల తో చక్కగా వర్ణించాడు వెంకటేశ్వర్లు గారు
జయం జయం సైనిక 
సాగు ముందు నీవిక 
దేశ రక్షణ ఊపిరిగా
 కర్తవ్యమే ప్రాణంగా
అనే గేయంలో విద్యార్థుల్లో సైనికుల పట్ల దేశ రక్షణ పట్ల అభిమానాన్ని నింపాడు.
మాతృభాషపై పట్టుని కోల్పోకుండా పిల్లలకు బాల్యం నుండి ఇలాంటి గేయాలను అందించడం అభినందనీయం వారు రాసిన ఈ" చక్కెర  గోళీలు" వారి కలం నుండి జాలువారిన ముప్పై మూడవ పుస్తకం.కవి గొప్పతనం ఏమిటంటే పిల్లల కోసమే రచనలు చేస్తూ వారి చేత కమ్మటి రచనలు చేయించడంలో వారికి వారే సాటి.
రాయాలండి రాయాలి వచ్చేదాకా రాయాలి
 రాతలు చక్కగా ఉండాలి ముత్యాల మెరవాలి
 అక్షర దోషం రావద్దు 
వంకర టింకర అసలేవద్దు అందంగా రాయటం ముద్దు 
అంటూ విద్యార్థుల చేతిరాత ముత్యాల్ల,గు గుండ్రంగా ఉండాలని రాతలు గేయంలో వివరించాడు.
వెంకటేశ్వర్లు బాల సాహితీవేత్తగా ,పద్య గేయ కవితలతో పాటు బాలగేయాలు కథలు రాస్తూ ఎన్నో పురస్కారాలు బిరుదులు పొందిన సాహితీవేత్త.కవి గారు రాసిన చక్కెర గోళీలు బాలగేయాల పుస్తకానికి బొమ్మలు ఎంతగానో అందాన్ని తెచ్చిపెట్టాయి .పిల్లల కోసం తీయని గేయాలు అందించిన వెంకటేశ్వర్లు గారికి 
శతథాసహస్ర వందనాలు


కామెంట్‌లు