మనఊరు:-సత్యవాణి

 బంగారయ్యపేటదాటి
ఏలేరు పెద్దకాల్వలు రెండూదాటి
కరణంగారి మకాందగ్గర
పెదవేపచెట్టుదాటి
అడుగు ముందుకేశామా
అలనాటి శబరిలా
బక్కచిక్కిపోయి
తియ్యటి నీటిచలమల గుర్తుల్ని మింగేసిన
మాపాంపా సెలఏరు దాటేమా
మరింక మాఊరిలోకొచ్చిపడ్డట్టే
అదిగో అక్కడే 
గుళ్ళోవున్న రామలింగడు
వాళ్ళావిడ ఉమాదేవి
చెవిలో ఊదేస్తాడు
ఊరిలోకెవరెవరొచ్చేరో
మరాయనకదేపని
ఊరిమొగదల కూర్చొని
ఊళ్ళోకెవరొచ్చేరో
ఎవరెళ్ళారో
పెళ్ళాంతో 
ఊసులాడుతువుంటాడు
మాతల్లి ఉమాదేవి
 ఎదురువీధి బ్రామ్మలమాట
ఎత్తబోతుంది
ఖస్సునలేస్తాడు రామలింగడు
ఊరిచిపోయినవాళ్ళ 
ఊసెత్తవద్దని చెప్పేనా అంటుా అమ్మని కసురుకొంటాడు
చిన్నబుచ్చుకొన్నఅమ్మది
చింతతీరుస్తూ 
ఊరిడవని నలుగురైదుగురినీ
ఉద్ధరిస్తూనే వున్నానుకదా
అటూ ఓదారుస్తాడు అమ్మని
మరి  ఊరికి ఉత్తరం దిక్కుకెళితే
పాష్టర్ గారి బంగళాప్రక్కనుంచి
నాలుగంటే నాలుగడుగులేశామా
చల్లని మనసులుగల మాతల్లులు
మా ఊరి గ్రామ దేవతలు
పెద వేములమ్మ
చిన వేములమ్మలు
కనపడ్డవారిని
పలకరించకుండా
కుశల ప్రశ్నలు వేయకుండా
ఊరిలోకొదిలిపెట్టరు
 ప్రక్కన కొత్తగా కట్టిన మసీదులో ముల్లాల ప్రార్థనలూ ఆలకింస్తారు వారు
ఏమాత్రం అర్థంకాకపోయినా
ఆతర్వాత 
రవణగారి పెద్ద మిల్లుదాటి
 కొత్తగా పెట్టిన పెట్రోల్ బంకూదాటి
భయమెందుకు మీకు నేనున్నా మీకు
అంటూ అభయహస్తం చూపిస్తూన్న
ఆంజనేయుడిగుడి దాటామా
తూర్పుగోదావరిజిల్లాకే
ప్రఖ్యాతి తెచ్చిపెట్టే వారానికి
కొట్లరూపాయల వ్యాపారంచేసే కూరగాయల మార్కెట్ 
మనలో మనటగా ఇక్కడోమాటచెప్పుకోవాలి
జిల్లాలోని రైతుబజార్లన్నింటిలో గొంతుచించుకొని అరస్తూ
రైతులపూడి మెట్టొంకాయలు
రైతులపుడి చిక్కుడుకాయలు  రైతులపూడిదబ్బకాయలు
 పచ్చిమిర్చని 
మనఊరి పేరుకు మనరైతులపేరు తగిలించి
మనఊరి రైతులకు
మహాగౌరవం సంపాదించి పెడుతున్నారు రైతుబజారు వర్తకులు
కూరగాయలమార్కెట్ దాటేమా
ఉందా లేదాన్నట్టుండే గొల్లపేట 
సాయిబుల ఇళ్ళూదాటితే
ఆజానుబాహుడు
అమృత హస్తుడూ
ఇంటింటి వైద్యుడూ అయిన
ఒకప్పటి అన్నారం డాక్టారి ఇల్లుదాటి
కుడి ఎడమలగా వెలసి
వేలాది రూపాయల వ్యాపారాలు  మాటల నేర్పరితనంతో చేసేసే ఆకర్షణీయమైన అనేకానేక వ్యాపార సముదాయాలుదాటుతూవుండగా
డాక్టర్ రాంబాబు డిస్పెన్సరీ
మందుల షాపులతోపాటుగా
ఆ ......మందులుషాపులూ దాటేస్తే
సినీమా రీలీజునాడే కొత్తబొమ్మేసే
సినీమాహాలు దాటి
మాఊరి మాలచ్చమ్మ
దుర్గమ్మ గుడిదాటి
పక్కదారికి మళ్ళితే
ప్రభుత్వ హైస్కూల్ దాటి
మల్లంపేట మాణిక్యం
మాఊరి రిక్షావాడు కాని
రిక్షావాడు 
నిగర్వి నిరాడంబరుడు
చెప్పేదొకటి చేసేదొకటీ చేయని
సినీ సిగం R.నారాయణమూర్తి
కట్టించిన ప్రజా వైద్యశాలదాటి
కుర్రకారు కారుల్లోనూ
బండిలపైనా తుర్రు బుర్రుమని తిరగడానికి
ఇంధనం అందించేదుకు
మరో పెట్రోల్ బంకు దాటితే
దశాబ్దాల క్రితం మండలమైన
శంఖవరం మండలాన్ని
బీట్ అవుట్ చేస్తూ వెలసిన
M.R.O  మరియుM.D.O
ఆఫీసులు
ఇంతేకాదు
గిడజాం వరకూ గబగబా
ఎదిగేస్తోంది మాఊరు
అంతా బాగుందికానీ
కోటదిబ్బ నందిసెంటర్ 
అన్నమాటలు నాలుకలు
మరచిపోయాయి ఇప్పుడు
మన భాష మనయాస
మనకట్టూ బొట్టూ
మన పని సంస్కృతి 
మారిపోయి
మరుగునపడిపోయింది
ఊరు విశాలంగా, అదునాతనంగా మారుతోంది
ఊళ్ళోవారి మనసులుమల్లెనే