రామడుగు రాధాకృష్ణగారిని ఈమధ్య కలిసినప్పుడు ఒక పుస్తకం ఇచ్చారు. ఇప్పుడేకాదు, ఆయనను ఎప్పుడు కలిసినా ఏదో ఒకటో రెండో పుస్తకాలు ఇచ్చిపంపుతారు. నాకు మాత్రమే ఇలా ఇస్తున్నారనుకుంటే పొరపాటు. పెద్ద పెద్ద రచయితలకూ వారి పాత పాత పుస్తకాలు కావలసివచ్చి ఆ విషయం ఈయన చెవిన పడేస్తే ఆ పుస్తకం సంపాదించిపెట్టివ్వడంలో ఆయనకున్న ఆసక్తి ఆశ్చర్యపరిచేది. ఒక ప్రముఖ రచయిత, పాత్రికేయుడు చనిపోయిన తర్వాత ఆయన వ్యాసాలు ఓ సంస్థకు ఇచ్చి పుస్తకం వేయించి తమవంతు సహకారమందించారు. ఎక్కడో ఓ పాత కథ చదివానండి అదిప్పుడు దొరకడంలేదండి అంటే ఆ కథ ఆచూకీ కనుక్కుని ఇచ్చేసేవారు. నేను కనీసం ఏడెనిమిది పుస్తకాలు కావాలని చెప్తే అవన్నీ సంపాదించి పెట్టడం ఆశ్చర్యమే. పైగా ఒక్క పుస్తకానికీ ఆయన డబ్బులు ఇస్తానన్నా తీసుకోలేదు. అటువంటి రామడుగు రాధాకృష్ణగారు వయస్సు ఇప్పుడు ఎనబై దాటింది. ఓపిక లేక ఇల్లు కదలడం లేదు. పుస్తకాలు చదివే శక్తీ సన్నగిల్లినట్టుంది.
ఆయన కూర్చున్న బల్లపైనున్న "కథారామంలో పూలతావులు" అనే పుస్తకం నాకిచ్చి చదవమన్నారు. సరేనని స్వీకరించాను. ఓ ముప్పావు గంటపైనే ఆయనతో మాట్లాడి వీడ్కోలు పొందాను.
ఇంటికొచ్చాక ఆయనిచ్చిన పుస్తకం తిరగేశాను. ఈ కథారామంలో పూలతావులు పుస్తక రచయిత్రి శీలా సుభద్రాదేవి.
ఒక ఛానల్ కోసం వందేళ్ళ కథకు వందనాలు పేరిట 118 మంది కథకుల కథలను పరిచయం చేసిన గొల్లపూడి మారుతీరావుగారు కేవలం పన్నెండు మంది రచయిత్రుల కథలనే స్వీకరించడం కూడా గమనించాల్సిన విషయమే అనుకున్న సుభద్రా దేవిగారు1910 - 1980కి మధ్య కథారచయిత్రులు లేరా అనే ఆశ్చర్య కలిగి
వరి వివరాలు రఛనలు సేకరించి రాసిన వ్యాసాల సంపుటే ఈ పుస్తకం. ఈ వ్యాసాలు రాయటంలో కె.పి. అశోక్ కుమార్, ఇంద్రగంటి జానకీబాల, కాత్యాయనీ విద్మహేగార్లకు ఆమె ధన్యవాదాలు చెప్పుకున్నారు. ఈ వ్యాసాలన్నీ భూమిక, చినుకు, పాలపిట్ట, ప్రజాసాహితి, విశాలాక్షి వంటి పత్రికలలోనూ మరికొన్న వెబ్ పత్రికలలోనూ వెలువడ్డాయి.
ఇల్లిందల సరస్వతీ దేవి, కళ్యాణ సుందరీ జగన్నాథ్, ఆచంట శారదాదేవి, కె. రామలక్ష్మి, డా. పి. శ్రీదేవి, పి. యశోదారెడ్డి, ద్వివేదుల విశాలాక్షి, నిడదవోలు మాలతి, వాసిరెడ్డి సీతాదేవి, మాదిరెడ్డి సులోచన, ఆర్. వసుంధరా దేవి, డి. కామేశ్వరి, డి. సుజాతా దేవి, ఇంద్రగంటి జానకీబాల, తురగా జానకీరాణి, వేదుల మీనాక్షి దేవి, పరిమళా సోమేశ్వర్, నల్లూరి రుక్మిణి, ఐ.వి.ఎస్. అచ్యుతవల్లి, జె. భాగ్యలక్ష్మి, మందరపు పద్మ, లలిత తదితరుల గురించి ఈ పుస్తకంలో వివారాలున్నాయి.
తెలుగు సాహిత్యంలో తొలి రోజులలో వేంకట రామకృష్ణ కవులు, పింగళి కాటూరి కవులు, తిరుపతి వేంకట కవులు, కొప్పరపు కవులు మొదలైన వారు మనకు తెలిసిందే. ఆధునిక కథాసాహిత్యంలో విహారి శాలివాహన, రాంబాబు, శాయి అని జంట రచయితలు కథలు రాసేవారు. కానీ రచయిత్రులలో 1956 - 59 మధ్య కాలంలో విరివిగా కథలు రాసిన మందరపు పద్మ - లలిత తొలి తెలుగు జంట రచయిత్రులంటూ సుభద్రాదేవి గారి విశ్లేషణ నాకొక కొత్త సమాచారమే. ఈ జంట రచయిత్రుల విషయంలోనే కాదు, ప్రతి వ్యాసంద్వారా ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.
ఈ పుస్తకం చదవడం పూర్తి చేసాక రాధాకృష్ణగారు మంచి పుస్తకమే కానుకగా ఇచ్చారనుకున్నాను. ఆయనకు ధన్యవాదాలు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి