"మాఊరు-గంగాధర" గ్రామ సంక్షిప్త చరిత్ర:-కూకట్ల తిరుపతి, కరీంనగర్.


 సంస్కృత తెలుగు పండితులు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సముద్రాల వేణుగోపాలాచార్య రచన ఇది. పద్యకవి సముద్రాల పదికి పైగా పద్య కృతులను వెలువరించారు. పద్య కవితా సదస్సులో కీలకమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించిన అనుభవం ఆయనది. "మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశం సర్వదా వందనీయాలు." అని పెద్దల మాట. ఆ పెద్దల మాటను పెరుగన్నం మూటగా భావించిన వేణుగోపాలాచార్య తన పుట్టినూరైన గంగాధర గ్రామ చరిత్ర రచనకు ఉపక్రమించి ఉంటారు.  "గంగాధరుడు" అనే పర్యాటకుడు జన జీవనానికి అనువైన ప్రాంతంగా భావించుకొని, ఈ గ్రామ నిర్మాణానికి పునాది రాయి వేయడం వల్ల దీనికి "గంగాధర" అనే పేరు వచ్చిందని రచయిత అభిప్రాయపడ్డారు. కాకతీయుల కాలంలో గంగాధరుడు "గంగాధర"ను రాజధానిగా చేసుకొని, రాజ్య పాలన చేశాడు. ఈ విషయాన్ని పి. వి. పరబ్రహ్మశాస్త్రి పరిశోధన గ్రంథంలో పేర్కొన్న విషయాన్ని వేణుగోపాలాచార్య ఊటంకించారు. 

ఇరవై శీర్షికలలో రచయిత గ్రామ చరిత్రను సమగ్రంగా పొందుపరచారు. ఆయన పరిశీలనా, పరిశోధనా దృక్పథానికి అభినందనలు. తెలుగు పద్య కవితా సదస్సు కరీంనగర్ జిల్లా శాఖ దీనిని చక్కగా ప్రచురించింది. ఈ పుస్తకం రచయిత పుట్టిన ఊరుపై ఉన్న మమకారాన్ని తెలియ జేస్తున్నది. "జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి". కాబట్టి కన్న తల్లి పుట్టిన ఊరు స్వర్గం కంటే మిక్కిలి గొప్పవి. మిగతా రచయితలకు ఈ పొత్తం ఒక ఆదర్శంగా నిలుస్తుందని నా భావన.