మనోధైర్యమే మా అమ్మకు తరగని ధనం.:- త్రిపురారి పద్మ జనగామ.

 బడికి వెళ్ళి పెద్ద చదువులేమీ చదువక పోయినా, ప్రపంచాన్ని చదువగలిగే సహజసిద్ధమైన తెలివితేటలు కలిగిన మా అమ్మ లక్ష్మి, జీవితంలో ఎదురైన ఎన్నో సవాళ్ళను తన మనోధైర్యంతో ఎదుర్కో గలిగింది. అడుగడుగున ఎదురైన అవరోధాలను అంతులేని ఆత్మనిబ్బరంతో జయించి, మా కుటుంబానికి ప్రేమానురాగ దీప్తిగా నిలిచింది.
      రెక్కలు ముక్కలు చేసుకొని కుటుంబ బరువు బాధ్యతలను మోస్తున్న మా నాన్నకు, సరైన సమయంలో తగిన నిర్ణయాలను ఎట్లా తీసుకోవాలో తెలియజెప్పే ఒక మంత్రిగా పనిచేస్తూనే, విడి విడి పూలగా ఉన్న కుటుంబ సభ్యులను కలుపుతూ అల్లిన దండలోని దారంలా అందరినీ ఒడిసి పడుతున్నది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నది? అనే ఆలోచన మీ అందరికీ వస్తున్నది కదా. ఇక్కడే. మీకు సమధానం దొరికే సమయమూ వచ్చినది.
      అందరి కుటుంబాల్లోనూ అమ్మ ఇలాగే ఉంటుంది. కానీ మా అమ్మలోని ప్రత్యేకత ఏంటంటే భయంకరమైన కాన్సర్ వ్యాధిని, ఆ తరువాత వచ్చిన ఊపిరితిత్తుల వ్యాధిని, ఒక నెల రోజుల క్రితం వచ్చిన కరోనా వ్యాధిని తన మనోధైర్యంతోనే ఎదురించింది. వాటిని జయించడమే కాదు. అన్నిటికీ మన మనసే మూలమనే మాటను నొక్కి వక్కాణించి చెబుతున్నది. ఎప్పుడు ఎలాంటి బాధాకరమైన సంఘటనలు వచ్చినా, ఆ నిముషం బాధ కలుగుతుంది. కన్నీళ్ళూ వస్తాయి. కానీ ఆ కన్నీళ్ళను మన మనసే తుడిచి వేయాలి. కన్నీళ్ళ స్థానంలో కలల సౌధాలను నిర్మించగలిగేలా మనసును మలచుకోగలగాలని చెబుతున్నది. బాధ స్థానంలో బంధాల విలువను గుర్తుచేసుకొంటూ, మన చుట్టూ సంతోషకరమైన వాతావరణమే ఎప్పుడూ ఉండేటట్లుగా చూసుకోవాలని అనుభవపూర్వకంగా చెబుతున్నది. మనసులో ఏ మాత్రం దిగులు. మేఘాలు కమ్మినా, వెంటనే నలుగురితో మాట్లాడడమో, లేక ఒక మంచి పుస్తకం చదువడమో లేదా ఏదైనా మంచి సినిమా చూడడమో లేదా నచ్చిన పాటలు వినడమో చేయాలే తప్ప, మనకున్న వ్యాధి గురించో లేక పడుతున్న బాధల గురించో పదే పదే గుర్తు చేసుకోవద్దని చెబుతున్నది. ప్రతిరోజూ పదిమందితో సంతోషంగా మాట్లాడతాను కాబట్టే, నాకున్న రుగ్మతలన్నింటినీ తరిమి వేయగలుగు తున్నానని చెబుతూనే, ప్రస్తుతం కరోనా వ్యాధితో బాధపడుతున్న వారెవరూ తమకు ఆ వ్యాధి వచ్చిందన్న విషయాన్నే మనసు మీదికి రానీయవద్దని చెబుతున్నది. అందరికీ ధైర్యవచనం తానవ్వాలని కోరుకుంటున్నది
      తాను కరోనా వ్యాధితో బాధపడుతున్న సమయంలో రోజూ హనుమాన్ చాలీసా చేస్తూనే, ఇతర పారాయణాలు చేసానని, చాగంటి సోమయాజులవారి సందేశాలను విన్నానని చెబుతుంది. ఒక్కదాన్నే గదిలో ఉన్నాననే భావన మనసులోకి రానీయకుండా ప్రతి రోజూ కొడుకులు కోడళ్ళు, బిడ్డలు, మనుమలు మనుమరాండ్లు, స్నేహితులతో మాట్లాడానని చెబుతూనే, సమయాన్ని ఆధ్యాత్మిక చింతనతో పుస్తక పఠనంతో  గడిపేసానని చెబుతున్నది. ఇంతకీ మా అమ్మ చదివిన పుస్తకం ఏంటో తెలుసా?మా చిన్న మేనల్లుడి పదవతరగతి తెలుగు పుస్తకం. అమ్మకు కరోనా అని తెలువగానే గదిని శుభ్రం చేసి, అన్ని వస్తువులు తీసి వేసాము. కానీ అనుకోకుండా పదవతరగతి తెలుగు పుస్తకం ఆ గదిలోనే ఉండిపోయింది. ఆ పుస్తకమే మా అమ్మకు ప్రాణస్నేహమయింది. అరవై ఎనిమిదేళ్ళ వయసులో కూడా కళ్ళద్దాలు లేకుండానే పుస్తకాలు చదువగలిగే మా అమ్మ, తనకు కనపడిన పదవతరగతి పుస్తకంలోని పాఠాలతో పాటు, రామాయణాన్ని చదివి, ఎంతో సంతోషపడింది. ప్రతి రోజూ ఆ పుస్తకంలోని ఏదో ఒక అంశం గురించి చెప్పేది. అట్లా చెబుతున్నప్పుడు, మా చిన్ననాడు పొయ్యి వెలగడానికి ఉపయోగించే కాగితం ముక్కను ఒకసారి చదివి మరీ దాన్ని ఉపయోగించిన అమ్మే గుర్తుకువస్తున్నది ఇప్పటికీ అంతే. కనపడిన ప్రతి కాగితాన్ని చదువుతుంది. విషయాలన్ని తెలుసు కోవాలనే ఆరాటాన్ని కనబరుస్తుంది. పదుల సంఖ్యలో పద్యాలను అలవోకగా చదువుతుంది. సందర్భోచితంగా ఆ పద్యాలను వినిపిస్తుంది. ఆ అలవాటే అమ్మను కరోనా సమయంలో ఆనందంగా కాలం గడిపేలా చేసింది.
      ఇంతేనా? హైదరాబాద్ లో ఏ చోటికైనా ఒక్కతే వెళ్ళ గలుగుతుంది. ఒక్కసారి చిరునామా చూసిందంటే చాలు. మేమెవ్వరమూ గుర్తు చెప్పలేకపోయినా తాను మాత్రం చెప్పగలుగుతుంది.
    ఒకసారి యాత్రలకు వెళ్ళినప్పుడు శ్రీలంకలో మా అమ్మ బస్ ఎక్కక ముందే బస్ వెళ్ళిపోయిందట. అదంతా అడవి ప్రాంతం. అక్కడ ఆ పూజారి కుటుంబం తప్ప, మరెవరూ లేరట. ఎలాంటి వాహన సౌకర్యమూ లేదు. అయినా ధైర్యంగా అక్కడే ఉండిపోయిందట. వెళ్ళిన వాళ్ళు నేను లేనని తెలువగానే మళ్ళీ ఇక్కడికే వస్తారు. మళ్ళీ నేనెక్కడికో వెళితే వాళ్ళు మరెక్కడో వెతకడం ఇదంతా ఎందుకని అక్కడే కూర్చున్నదట. అమ్మ అనుకున్నట్టుగానే బస్ తిరిగి అక్కడికే వచ్చి, అమ్మను తీసుకొని వెళ్ళిందట. మరొకసారి పాకిస్థాన్ బార్డర్ లో అక్కడ సైనికులను పరిచయం చేసుకొని మరీ భారత దేశ జండా పట్టుకొని బార్డర్లో అటూ ఇటు పరుగెడుతుంటే తానెంత గొప్పగా అనుభూతి చెందినదో గొప్పగా వర్ణించి చెబుతుంటే ఆశ్చర్య పోవడం మా వంతవుతుంది. ఆ సైనికుడి ఫోన్ నంబర్ తీసుకువచ్చి, చాలా రోజులు అతనితో మధ్య మధ్యలో మాట్లాడేది. అమ్మ హిందీ కూడా మాట్లాడుతుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఎందరెందరినో పరిచయం చేసుకుంటుంది. అందరితో ఆత్మీయ బామ్మగా ఆనందం పంచుకుంటుంది.
      కష్టాలు కడగళ్ళు ఎన్ని వచ్చినా, తన ఆత్మ స్థైర్యంతో కుటుంబానికి బాసటగా నిలిచిన మా అమ్మ, ఇవాళ కరోనాకు భయపడే చాలా మంది చనిపోతున్నారని తెలుసుకొని, నా గురించి రాయి బిడ్డా. వాళ్ళందరికీ ధైర్యాన్ని చెప్పు. మన ధైర్యమే మనకు రక్ష అని నన్నే ఉదాహరణగా చూయించ మని మొన్న రాత్రి మరీ మరీ కోరింది. పనులల్లో పడి నేనే కొంత ఆలస్యం చేసాను.
      మనోధైర్యమే తరగని ధనమైన మా అమ్మ కథనం, మరెందరికో స్ఫూర్తి దాయకం కావాలని కోరుకుంటూ, మా అమ్మ ఆరోగ్యంగా కోలుకోవడంలో తన కష్టార్జితాన్ని, చిందించిన స్వేదాన్ని ఊపిరిగా చేసిన మా నాన్న శ్రమకు శిరసాభి వందనం అర్పిస్తూ,
        
కామెంట్‌లు