దేవుడెక్కడుంటాడో:-- యామిజాల జగదీశ్

 గురుశిష్యులిద్దరు ఓ అడవి మార్గంలో కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ పోతున్నారు. కొంతదూరం వచ్చేసరికి ఓ సింహం కనిపించింది. దాన్ని చూసిన శిష్యుడు మరో మాట లేకుండా పక్కనే ఉన్న చెట్టు ఎక్కాడు. 
కానీ గురువు ఏమాత్రం భయపడక ఉన్న చోటనే కూర్చుండిపోయి కళ్ళు మూసుకుని ప్రార్థించాడు. గురువు దగ్గరకొచ్చిన సింహం ఏమీ చేయకుండా వచ్చిన దారినే వెళ్ళిపోయింది. 
ఓ అయిదు నిముషాలకు చెట్టెక్కిన శిష్యుడు కిందకు దిగాడు. 
గురు శిష్యులిద్దరూ అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం చేపట్టి నగరం చేరారు. ఇంతలో ఎదురుగుండా ఓ ఎద్దు రావడం చూసిన గురువు అక్కడి నుంచి పరుగుతీసాడు. 
శిష్యుడికి గురువు తీరు అర్థం కాలేదు. 
అడవిలో సింహం ఎదురొస్తేనే ఏ మాత్రం భయపడని గురువు నగరంలో ఎదురొచ్చిన ఎద్దుకు భయపడి పరుగెత్తారేమిటి అని అనుకున్నాడు. ఎందుకలా చేసారని గురువుని ప్రశ్నించాడు. 
అప్పుడు గురువు "సింహం ఎదురొచ్చినప్పుడు మనం అడవిలో ఉన్నాం. అక్కడ అది అందమైన ప్రకృతి. కల్మషం లేని ప్రకృతి. కనుక దేవుడు అంతటా ఉన్నాడు. నా ప్రార్థనకు తక్షణమే స్పందించిన దేవుడు మనకేమీ జరక్కుండా చూసాడు. కానీ ఎద్దు ఎదురొచ్చినప్పుడు మనం నగరంలో ఉన్నాం. నగరంలో ఎటు చూసిన వంచనా పగలూ ప్రతీకారాలూ. ఇటువంటి నగరంలో దేవుడెక్కడుంటాడో తెలీదు. కనుక నన్ను కాపాడుకోవడానికి పరుగులు తీశాను. అందుకు దేవుడు రెండు కాళ్ళిచ్చాడుగా" అన్నాడు.
శిష్యుడికి విషయం బోధపడింది.

కామెంట్‌లు