స్టేటస్ ...!!*:- --డా.కె .ఎల్వీ
నిన్న -మొన్నటి వరకూ 
నడి వయస్సులో 
ఉన్నట్టే ఉంది నాకు !

వయసు మరచిపోయి 
వ్యధలకు మనసులో 
చోటివ్వక ..చొర నివ్వక 
చలాకీగానే నడిచిపోయింది 
బ్రతుకు బండి !

చీకు ..చింతలను 
దరిచేరనివ్వక  .....
కష్ట సుఖాలను సమానంగానే 
స్వీకరించి ముందుకు నడిచాను !

నా కళ్ళముందు 
ఎదుగుతున్న 
నా పిల్లలకు 
వయసును బట్టి 
జరగాల్సినవన్ని 
జరిపిస్తూనే ఉన్నాను .
కానీ .......
నా వయసు గురించి 
నేనెప్పుడూ ఆలోచించ లేదు !

ఉద్యోగపర్వానికి ,
చివరి సంవత్సరం 
చివరి మాసం 
చిట్ట చివరి దినం 
సమీపించినప్పుడు ,
'ఓహో ..!అప్పుడే నాకు -
యాభై ఎనిమిదా '
అనుకున్నాను ! అయినా ,
నాలో ముదిమి ఆలొచనలు 
మచ్చుకు కూడా 
చోటు చేసు కోలేదు !

కానీ .....
నడి రోడ్డు మీద 
ఓ ..ఆగంతకుడు ..
'ఓ ..ముసలాయనా ..! '
అని ,పిలిచినప్పుడు ,
నాలొ తెలీకుండానే 
వృద్దాప్యపు ఛాయలు 
వంటినిండా ఆల్లుకుని 
నా స్టేటస్ నాకు 
గుర్తు తెచ్చాయి !!