కోవిడ్ వేళ పిల్లల సంరక్షణకు ప్రత్యేక చర్యలు::---- అంతర్జాల సమావేశంలో కృతికాశుక్లా వెల్లడి

 కోవిడ్ రెండో దశ అధికమవుతున్న వేళ రాష్ట్రంలోని పిల్లల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఏపి మహిళా శిశుసంక్షేమ శాఖ డైరెక్టర్  కృతికాశుక్లా వెల్లడించారు. 
సోమవారం మధ్యాహ్నం పిల్లల సంరక్షణ భాగస్వాములతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి  అంతర్జాల సమావేశంలో ఆమె మాట్లాడారు. బాలల సంక్షేమం,  సంస్కరణ సేవలు, వీధిబాలల సంక్షేమశాఖ రాష్ట్ర సంయుక్త సంచాలకులు ప్రసాదమూర్తి సమన్వయకర్తగా వ్యవహరించారు. అనంతపురం నుంచి బాలల సంక్షేమ సమితి (సిడబ్ల్యూసి) అధ్యక్షురాలు నల్లాని రాజేశ్వరి, జిల్లా బాలల పరిరక్షణాధికారి (డిసిపిఓ) డా. దాసరి సుబ్రమణ్యం మాట్లాడారు. 
పిల్లలకు కరోనా సోకకుండా బాలల సంరక్షణ కేంద్రాలు (సిసిఐ) అన్ని జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా కృతికాశుక్లా సూచించారు. పిల్లలకు, సిబ్బందికి అవసరమైన మాస్కులు, శానిటైజర్లు, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. తల్లిదండ్రులు కోవిడ్ బారిన పడితే వారి పిల్లలను సంరక్షించేందుకు సైతం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వివరించారు. తక్షణమే 1098, 181 వంటి హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలన్నారు. జిల్లా యంత్రాంగం సహకారంతో బాల బాలికలకు వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. క్షేత్రస్థాయి నుంచీ ప్రతిరోజూ తాజా సమాచారం తెప్పిస్తున్నామని తెలిపారు. లక్ష్య సాధనకు గ్రామ సచివాలయ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు.
ఆన్ లైన్ ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షించుకుని కరోనా రాకుండా పిల్లలను కాపాడాలని సూచించారు. 
అనంతపురం జిల్లాలో ప్రభుత్వ అధికారులు, సామాజిక కార్యకర్తల సమన్వయంతో,  ఆర్డీటి సంస్థ సహకారం తీసుకుని ముందుకు సాగుతున్నామని నల్లాని రాజేశ్వరి అన్నారు. 
సిసిఐ లకు సుప్రీంకోర్టు, ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను కూడా అందజేశామన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శీల సేవలను సద్వినియోగం చేసుకునేలా ఆదేశాలివ్వాలని డిసిపిఓ సుబ్రమణ్యం సూచించారు. 
ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసి సభ్యులు, ఐసిపిఎస్ అధికారులు, సిబ్బంది, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
కామెంట్‌లు