శార్దూలము:
*చావంగాలము చేరువౌటెరగియుం | చాలింపగా లేక, త*
*న్నే వైద్యుండు చికిత్సబ్రోగలడో, | ఏమంచు రక్షించునో,*
*ఏ వేల్పుల్ కృపజూతురోయనుచు, ని | న్నింతైన చింతింపడా*
*జీవశ్రాద్ధము చేసికొన్న యతియున్ | శ్రీకాళహస్తీశ్వరా!*
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
బ్రతికి వున్నప్పుడే తనకు తాను, చనిపోయిన వారికి చేసే శ్రాద్ధ కర్మలు అన్నీ చేసుకుని, నేను అన్నీ తెలుసుకున్న మునిని అని చెప్పుకునేవారు కూడా, తనకు చావు కాలము దగ్గరకు వచ్చినప్పుడు, ఇక నేను ప్రశాంతంగా చనిపోతాను అనుకోకుండా, ఏ డాక్టర్ అయినా మంచి మందులు ఇచ్చి బ్రతికించ పోతాడా, ఏ దేవుడైనా కాపాడ పోతాడా అని ఆరాట పడతాడు కానీ, అన్ని ఆరాటాలు తీర్చి, ఒడ్డుకు చేర్చే వాడివి నీవే అని తెలిసుకుని, నిన్ను ప్రార్ధించడం మరచి పోతాడు కదా! ....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*తనకు తాను ఆజీవశ్రాద్ధ కర్మలు చేసుకున్న వాడు కూడా, నీ మాయను తెలుసుకోలేక, మరణకాలం సంభవించినప్పుడు, నీవే "వైద్యనాధుడివి" అని గుర్తెరుగక, తన చుట్టూ వున్న మనుషులలో వైద్యుని వెతుక్కుంటూ, మంచి ఔషధము ఇచ్చి కాపాడబోతాడా అని చూస్తూ వుంటాడు. మరి సామాన్యులము, నిన్నెలా గుర్తించగలము, దేవ దేవా! మా మీద నీకు వున్న కరుణతో, నిన్ను నీవే పరిచయం చేసుకుని, మా చేయి పట్టి , మమ్మల్ని వైతరణి దాటించి నీ సన్నిధికి చేర్చుకో వయ్యా, భోళా శంకరా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి