ఒంటికాలుసింహాసనం:-డి.కె.చదువులబాబు.ప్రొద్దుటూరు.కడపజిల్లా 9440703716


 సమీరరాజ్యాన్ని సమీరవర్మ పరిపాలించేవాడు.ఆయన రాజ్యంలో వసంతుడనే చిత్రకారుడు ఉండేవాడు. సమీరవర్మకు అమరసేనుడు, విజయుడనే కుమారులు ఉండేవారు. అమరసేనుడు చిత్రలేఖనంలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. 

ఒకరోజు పాముకాటుతో అమరసేనుడు మరణించాడు.కుమారుని మరణం రాజును తీవ్రంగా కలిచివేసింది. ఆదిగులుతో రాజకార్యాలు పట్టించుకోక, నిరంతరం దిగులుతో కుమిలిపోతుండేవాడు. రాజు పర్యవేక్షణ లేక రాజ్యంలో అన్యాయాలు ఎక్కువయ్యాయి.పైఅధికారులనుండి కిందిఉద్యోగులవరకూ లంచాలకు అలవాటుపడ్డారు.లంచంలేనిదే ఏపనీ జరిగేదికాదు.అభివృద్దికార్యక్రమాలు కుంటుపడ్డాయి.ప్రజలు చాలా ఇబ్బందులు పడసాగారు.

కొంతకాలానికి రాజు దిగులునుండి కోలుకున్నాడు.రాజ్యంలోని అన్యాయాలు, లంచగొండితనం రాజుదృష్టికి రాకుండా అధికారులు జాగ్రత్తపడ్డారు. 

సమీరవర్మ కుమారుని జ్ఞాపకార్థం పుట్టినరోజునాడు చిత్రకళపోటీ నిర్వహించాలని నిర్ణయించాడు. దండోరావేయించాడు.వసంతుడు ఈఅవకాశాన్ని ఉపయోగించుకొని రాజ్యపరిస్థితిని రాజుదృష్టికి తేవాలనుకున్నాడు.పోటీలో పేరు నమోదు చేయించుకోవడానికి కూడా లంచం ఇచ్చుకోవలసి వచ్చింది. విశాలమైన భవంతిలో పోటీలు ఏర్పాటుచేశారు. న్యాయనిర్ణేతగా మహిర్వేదుడిని పిలిపించారు.ఆయన వసంతుడు గీసిన చిత్రానికి ప్రథమబహుమతి ప్రకటించాడు. ఆచిత్రంలో సమీరవర్మ ఒంటికాలి సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. సమీరవర్మ కళ్ళకు గంతలు కట్టబడి ఉన్నాయి. ఆచిత్రాన్ని చూసి రాజుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. "ప్రథమ బహుమతి ప్రకటించబడిన ఆచిత్రం భావం ఏమిటో వివరించండి?" అని అడిగాడు  రాజు. 

మహిర్వేదుడు నవ్వి "మహారాజా!ఈచిత్రాన్ని ఏఉద్దేశ్యంతో చిత్రించాడో వసంతుడే చెబితే బాగుంటుంది" అన్నాడు. వసంతుడు రాజుకు నమస్కరించి "మహారాజా!ఈఒంటికాలు సింహాసనం మన రాజ్యంలో ధర్మం ఒంటికాలు మీద నడుస్తోందని తెల్పటానికి చిత్రీకరించాను. అధికారులు మీకళ్ళకు గంతలు కట్టి రాజ్యంలో అవినీతి మీదాకా రాకుండా చేస్తున్నారు.మీరు మన రాజ్యంలోని లంచగొండితనాన్ని,అవినీతిని చూడలేకున్నారు.అందుకే మీకళ్ళకు గంతలు ఉన్నాయి" అని చెప్పి రాజ్యపరిస్థితిని వివరించాడు. ఈపోటీలో పాల్గొనడానికి కూడా తాను ధనం ఇవ్వాల్సివచ్చిందని వివరించాడు. రాజు విచారణలో వాస్తవపరిస్థితులు వెలుగులోకి వచ్చాయి.రాజు అవినీతిపరులను కఠినంగా శిక్షించాడు.ఆపై తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు.సమయస్ఫూర్తితో,ధైర్యంగాపరిస్థితిని తనకు తెలియజెప్పిన వసంతుడిని కానుకలతో సత్కరించి, ఆస్థానచిత్రకారుడిగా నియమించుకున్నాడు.