అనాజీపురం గ్రామంలో బాలేష్ అనే యువ వ్యాపారి ఉండేవాడు. వ్యాపారంలో కొత్త కొత్త టెక్నిక్స్ పాటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అవసరానికి సరుకులు అరువు ఇవ్వడమే కాకుండా వసూలు చేయడంలో కూడా నేర్పరి. మాటల్లో చలాకీతనం, చేతల్లో చురుకుదనంతో గిరాకీ బాగానే పెరిగింది.
ఊర్లో పొద్దు పోనీ వాళ్లు అతని కిరాణా కొట్టుకు సూర్యుడు నడి నెత్తి మీద ఉన్నప్పుడు వెళ్తే, పశ్చిమ దేశాలకు పయనించినా అక్కడే బొడ్రాయిలా పాతుకు పోయేవారు. అతనికి మిత్రులు అంటే అభిమానం, ఆప్యాయత ఎంతటి వారినైనా మాటలతో ఇట్టే బుట్టలో వేసుకుంటాడు. తను సంతోషంగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొందరికీ ఉచితంగానే వస్తువులను ఇచ్చేవాడు. ఒక్కోసారి ఎవరైనా ఏదైనా వస్తువు కావాలనంటే లేదనేవాడు. అదిగో అక్కడుంది కదా అంటే ఉన్నా ఇవ్వను అనేవాడు తమాషాకి. అంతేకాక తన షాపు ముందు నుంచి వెళ్లే వారిని పిలిచి మరీ ఆ వస్తువును అడక్కుండానే ఉచితంగా ఇచ్చేవాడు! దాంతో సదరు వ్యక్తి సంతోషిస్తే, అక్కడున్న వారంతా అవాక్కయ్యేవారు! ఎందుకిలా అంటే నా ఇష్టం అనేవాడు నవ్వుతూ. గంట సేపు నిలబెట్టి అడగ్గా అడగ్గా అప్పుడే ఇవ్వొచ్చు కదా అంటే, టైం పాస్ అయితలేదు అందుకే ఇంతసేపాపిన అనేవాడు.
ఎవరైనా ఏదో ఒక వస్తువు కోసం వచ్చినప్పుడు తన దగ్గర లేకుంటే మహ్మద్ అబ్దుల్ దగ్గరికో, వంజరి దుబ్బమ్మ దగ్గరికో, మేర జనమ్మ దగ్గరికో పంపేవాడు. వాళ్ళు వారెవరికీ కిరాణా కొట్టు లేదంటే కొత్తగ పెట్టిండ్రు అనేవాడు! వాళ్లు చివరికి వారి దగ్గరికి వెళ్లొచ్చి ఇతణ్ణి తిట్టేవారు నవ్వుకుంటూ. పై వారిలో కొణ్ణాళ్ళకు అబ్దుల్ కిరాణా కొట్టు పెట్టడం కొసమెరుపు.
ఒక్కోసారి ఊరికే కాగితంతో గాలి పొట్లం కట్టి అవతల వేసేవాడు! వెళ్లే వాళ్ళు ఎవరో పొట్లం పారేసుకున్నారనుకుంటూ, తనకు దొరికిందన్న ఆనందంలో అటు ఇటు ఎవరూ లేనిది చూసి ఆ పొట్లం తీసుకుని, కొంచెం దూరం వెళ్లాక విప్పి చూసి పడేసేవారు నిట్టూర్పుతో!
బాలేష్ ఎన్ని తమాషాలు చేసినా పేద విద్యార్థులకు కాపీలు, పెన్నులు మొదలగునవి ఉచితంగానే ఇచ్చేవాడు. నేను సరిగ్గా చదువుకోలేదు మీరన్నా బాగా చదువుకోండ్రి అని వాళ్ళని అన్నలా ప్రోత్సహించేవాడు.
...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి