ధర్మపురి రాజు మంచివాడు. ప్రజల కష్ట నష్టాలు పట్టించుకునేవాడు.దైవభక్తి ఉన్నవాడు. రోజుకో ఆలయంకి వెళ్లి బీదబిక్కీ పురోహితుల సాధక బాధలు అడిగి తెలుసుకునేవాడు.రాజుతో పాటు మంత్రి విదూషకుడు ఉండేవారు. విదూషకుడు చతురత హాస్యంతో అప్రస్తుత మాటలతో తన సందేహం తీర్చుకునేవాడు. ఆరోజు ముగ్గురు తోటలో తిరుగుతున్నారు. "ప్రభూ!ఈలోకం అంతా దేవుని సృష్టి. ఆలయాలు మనం కట్టుకుంటున్నవి.రోజుకో దేవాలయంకి ఎందుకు వెళ్ళాలి?దేవుడు ఒక్కడేగదా?"విదూషకుని ప్రశ్న కు మంత్రి అడిగాడు..."నీవు నెత్తికి చుట్టుకొన్నదాన్ని ఏమంటారు?" "తలపాగా!"
'సరే దాన్ని తీసి విప్పి నీభుజంపై వేసుకో.దీనిని ఏమంటారు?" 'ఉత్తరీయం'
'దీన్ని నీ నడుంకి చుట్టుకో.దీన్ని ఏమంటారు?
"లుంగీ!" మంత్రి వెంటనే అడిగాడు "వస్త్రం ఒకేఒక్కటి. కానీ దాని స్థానం మారినప్పుడు పేరు మారుతుంది. అలాగే దేవుడు ఒక్కడే. వారి వారి ఇష్టం అనుకూలం ప్రకారం వివిధరూపాల్లో పూజిస్తారు. నీవు ధరించిన శరీర భాగాన్ని బట్టి బట్ట పేరు మారుతుంది. బట్ట రంగు సైజు మారటంలేదు.అలాగే దేవుడి కి అన్ని పేర్లు రూపాలు."
రాజు ప్రశంసాపూర్వకంగా మంత్రి వైపు చూస్తే విదూషకుడు అర్థం అయింది అన్నట్లుగా తల ఊపాడు.
పరిష్కారం.:--.అచ్యుతుని రాజ్యశ్రీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి