గజపతి నగరాన్ని ఆనందగజపతి పరిపాలించేవాడు. అతని వద్ద
మహీపాలుడు అనే మంత్రి ఉండేవాడు. ఆనందగజపతి పాలనలో ఏవైనా సమస్యలు
వస్తే మహీపాలుడు చాకచక్యంగా సలహాలిచ్చి పరిష్కరించేవాడు.
ఓ సారి గజపతి నగరంలో రైతుల పొలాల్లో ఏనుగుల గుంపు దాడి
చేసి పంటకు నష్టం కలిగించింది. తీవ్రంగా నష్టపోయిన రైతులు తమను
ఆదుకోవాలని తమగోడును విన్నవించుకున్నారు.
ఆనందగజపతి రైతుల సమస్యను అడిగి తెలుసుకున్నాడు. వారిని ఎలా
ఆదుకోవాలని అడిగాడు.
రైతులు తమకు పన్నులు తగ్గించాలని, ఏనుగుల దాడిలో నష్ట
పోయిన పంటకు పరిహారం చెల్లించాలని కోరారు.
ఆనందగజపతి మంత్రి మహీపాలుడిని పిలిచి రైతుల పొలాల వద్దకు
వెళ్లి నష్ట పరిహారం అంచనాను పరిశీలించి పంట నష్టంఫై నివేదిక
ఇవ్వాలని ఆదేశించాడు.
మంత్రి తన సిబ్బందితో వెళ్లి పంటలను పరిశీలించాడు. పది
ఎకరాల్లో నష్టం వాటిల్లిందని అంచనావేసి రాజుకు నివేదిక అందించాడు.
ఆనందగజపతి వెంటనే రైతులను పిలిచి తగిన పరిహారం అందించాడు.
వారు చెల్లించాల్సిన పంట శిస్తును కూడా రద్దు చేయించాడు. దీంతో
రైతులు ఆనందంతో ఇంటి దారి పట్టారు.
పది రోజులు గడిచాయి. మళ్లీ రైతులు వందల సంఖ్యలో రాజు
వద్దకు వచ్చి తమ పంటలపై ఏనుగులు దాడి చేసి నష్టం కలిగించాయని
పరిహారం చెల్లించాలని మొరపెట్టుకున్నారు. రాజు ఆలోచనలో
ఆనందగజపతిపడ్డాడు. " పోయిన సారి అయిదు , ఆరుగురు రైతులు మాత్రమే
వచ్చారు. ఈ సారి వందల సంఖ్యలో వచ్చారు. ఇదేమిటో అర్ధం కావడం లేదు..
వెళ్లి ఏనుగులు దాడి చేశాయా .. లేదా? చూసి రావాలి.. " అని మంత్రిని
ఆదేశించాడు .
మంత్రి మహీపాలుడు తన సిబ్బందితో వెళ్లి పంటలను పరిశీలించాడు.
వారిలో కొందరి పంటలను మాత్రమే ఏనుగులు నష్ట పరిచిన ఆనవాళ్లు
మాత్రమే ఉన్నాయని నిర్దారింఛి రాజుకు నివేదిక అందించారు.
ఆనందగజపతి మంత్రి అంచనా ప్రకారం కొందరి రైతులకు మాత్రమే
పరిహారం అందించాడు. ఇది మింగుడు పడని మరి కొంత మంది రైతులు రాజ
భవనం ఎదుట పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు.
ఆనందగజపతి దీన్ని భరించలేక రైతులందరికీ పంట నష్ట పరిహారం
చెల్లించాడు. సమస్య పరిష్కారమయిందని రాజు ఆనందంతో ఊపిరి
పీల్చుకున్నాడు. అంతలోనే సమస్య మళ్లీ మొదలయింది.
ఈ సారి వేల సంఖ్యలో రైతులు తమ పొలాల్లో ఏనుగులు పడ్డాయని ,
పరిహారం చెల్లించాలని రాజును ఆశ్రయించారు. ఈ సారి రాజుకు ఏమి
చేయాలో దిక్కు తోచలేదు. మంత్రిని పిలిచి " ఈ సారి ఏనుగులు నిజంగా
దాడి చేస్తున్నాయా..?లేదా? పరిశీలించు.. " అని ఆదేశించాడు.
మంత్రి రైతుల పొలాలు వద్దకు వెళ్లి చూశాడు. ఈ సారి
ఆశ్యర్యంగా అందరి పొలాల్లో ఏనుగుల అడుగుల గుర్తులు కనిపించాయి. ఈ
సమాచారం తీసుకెళ్లి రాజుకు చేరవేశాడు. ఆనందగజపతి కాసేపు ఆలోచించాడు . "
అసలు ఇంత మంది రైతుల పొలాల్లో ఏనుగులు ఎప్పుడు వచ్చాయో తెలుసుకుని
రా.. " అని ఆజ్ఞాపించాడు రాజు. మంత్రి వెళ్లి రైతులను
ప్రశ్నించాడు.
రైతులందరూ నిన్నటి రాత్రి ఏనుగులు వచ్చాయి.. " అని సమాధానం
ఇచ్చారు. దీన్ని రాజుకు చేరవేశాడు.
ఆనందగజపతి మంత్రిని దగ్గరగా రమ్మని " ఏనుగులన్నీ ఒకే రోజు
పంటలపై పడ్డాయంటే నమ్మశక్యంగా లేదు.. " అన్నాడు.
" అయితే రాజ్యంలో ఎన్ని ఏనుగులు వున్నాయో అడవులన్నీ
గాలించి లెక్క పెడదాం.. " అన్నాడు మంత్రి.
రాజు " అవసరం లేదు.. ఎన్ని ఏనుగులున్నా ఒకే రోజు అవి అందరి
పంటపై పడవు కదా? ఇందులో ఏదో అనుమానం వుంది.. " అన్నాడు రాజు.
" అయితే ఓ వారం రోజులు రైతుల పొలాల్లో నిఘా వేద్దాం.. "
అన్నాడు మంత్రి.
రాజు అనుమతించాడు.
మంత్రే స్వయంగా మారు వేషంలో తన సిబ్బందితో ఓ రైతు పంట
పొలాల వద్ద నిఘా వేశాడు.
సరిగ్గా అమావాస్య రోజు అర్ధ రాత్రి వేళ ఓ పది మంది
పాదాలకు ఏనుగుల అడుగులు పోలిన చెక్కల అచ్చులు ధరించి పొలాలను
ధ్వంసం చేయడం చూచాడు. ఈ సమాచారం రాజుకు అందించాడు.
ఆనందగజపతి స్పందించి " నా ఊహ నిజమయింది. ఇది ఏనుగుల
పనికాదు.. " అన్నాడు.
ఆ తరువాత పంటలకు నష్టం కలిగిస్తున్న వారిని చాకశక్యంగా
పట్టుకుని బంధించారు. ఇదంతా ఓ భూస్వామి ఆధిపత్యం చెలాయించాలని
చిన్నా చితకా రైతులను అణగ దొక్కాలని ఆడిన పన్నాగమని తేలింది. ఆ
తరువాత అడవులన్నింటిని జల్లెడ పట్టి ఒక్క ఏనుగు కూడా లేదని
తేల్చాడు మంత్రి.
రాజ్యంలో మళ్లీ రైతులకు ఎలాంటి ఎలాంటి అన్యాయం జరగకుండా
పొలాలకు రాజు ఆనందగజపతి సైనిక రక్షణ కల్పించాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి