మరచిపోలేని తేదీ!27.7.2021 :-- యామిజాల జగదీశ్



 అందుకు కారకులు సౌభాగ్యగారు. " వర్ణన రత్నాకరము " అనే ఇరవై మూడు సంపుటాలూ నా దగ్గర సమకూరిన రోజది. నిజానికి నేను ఇరవైమూడులో మొదటి పది సంపుటాలు, చివరి మూడు సంపుటాలు (అంటే 21, 22, 23) నేను డబ్బులు కూడబెట్టి కూడబెట్టి కొనుక్కోగలిగాను. అయితే 11 నుంచి 20 వరకు ఉన్న పది సంపుటాలు నేను కొనుక్కునే పరిస్థితులు లేకుండాపోయాయి. ఈ విషయాన్ని నేను అక్షరబద్దం చేశాను. అది చదివిన సౌభాగ్యగారి నుంచి ఇటీవల ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ సారాంశం మీక్కావలసిన ఆ పది సంపుటాలు నేనిస్తానని. ఆ మాట వింటుంటే నన్ను నేను గిల్లి చూసుకున్నాను. నేను విన్న మాటలు నిజమేనా అని. నేను విన్నది నిజమేనని సౌభాగ్యగారు నొక్కి వక్కాణించడంతో పట్టరాని ఆనందం కలిగింది. 
నూట ముప్పై పుస్తకాల రచయిత సౌభాగ్యగారి నించీ నేను పుస్తకాలు పొందడం ఆశ్చర్యమే. తల్లావజ్ఞల లలితాప్రసాద్ సాక్షిగా పొందానా పుస్తకాలను సౌభాగ్యగారింట. ఈ పుస్తకాలతోపాటు ఆయన రాసిన మరికొన్ని పుస్తకాలుకూడా అందుకున్నాను.
దాదాపు మూడు గంటలు సౌభాగ్యగారింట గడపాం నేనూ‌ , లలితా ప్రసాద్....ఒకటా రెండా....అనేకానేక అంశాలు...మధ్యలో ఓ మారు కాఫీ వాళ్ళావిడ పెట్టిచ్చారు. మరొకసారి సౌభాగ్యగారే స్వయంగా చక్కని చిక్కని టీ తయారు చేసిచ్చారు. 
పాత్రికేయులు కృష్ణగారి గురించి, తిరుమల రామచంద్రగారి గురించి, ఉదయం కార్యాలయ సంగతులు ఇలా ఒకటేంటి వివిధ అంశాలపై ముచ్చట్లు. సౌభాగ్యగారు మాటల మధ్యలో ఓమారు లోపలికి తీసుకెళ్ళి ఆయన పుస్తకాల వరుసను చూపించారు. ఓ అద్దాల తలుపులోంచి ఆ పుస్తకాలను చూస్తుంటే ఎంత ముచ్చటేసిందో. మల్లాది రామకృష్ణ శాస్త్రిగారింట, ఆరుద్ర గారింట‌, కొంగర జగ్గయ్య గారింట కూడా పుస్తకాలు అందంగా ఓ వరుస క్రమంలో పేర్చి ఉండటం చూసాను. అవి చూడటానికి బలేగా ఉండేవి. మల్లాదిగారింట ఎప్పుడెళ్ళినా అలాగే ఉండేవి. అవి క్రమం తప్పడం చూడలేదు. ఆ పుస్తకాల గది మధ్యలో మల్లాదివారు నేల మీద మఠం వేసుకుని ఏదో ఒక పుస్తకం తిరగేయడమూ చూసాను. 
  మధ్యమధ్యలో సౌభాగ్యగారి రచనల గురించి నేనొకటి రెండు ప్రశ్నలు వేశాను. 
ఆయన రాసిన తొలి పుస్తకం 1984లో  "సంధ్యా బీభత్సం" అచ్చయింది. ఈ పుస్తకం ఆయన శ్రీమతిగారి ప్రోత్సాహం ఉండటం విశేషం. ఎక్కడో తప్ప ఇలా శ్రీమతుల అండదండలుండవు. అంతేకాదు, ఆయన పుస్తకల లైబ్రరీ ఏర్పాటులోనూ ఆమె సహాయసహకారాలుండటం ముదావహం. ఈ విషయంలో ఆయన అదృష్టవంతులే.
ఇంతకూ ఇక్కడో విషయం చెప్పడం మరిచాను. బహుశా అందరికీ తెలిసిన విషయమే కావచ్చు. సౌభాగ్యగారి అసలు పేరు పి. విజయకుమార్. చిత్తూరుజిల్లాలో తిరుపతి సమీపంలోని ఓ పల్లెలో పుట్టిపెరిగిన ఆయన  రొంపిచర్ల‌, తిరుపతిలలో చదువుకున్నారు. 
హైదరాబాదులోని గ్రామర్ స్కూల్లో తెలుగు మాష్టారుగా పని చేసి రిటైరైన సౌభాగ్యగారు రచయితగా, అనువాదకులుగానే తెలుసు. కానీ ఆయన మొదట్లో కవి అన్న సంగతి లలితాప్రసాద్ గారివల్ల తెలిసింది.
సౌభాగ్యగారి పుస్తకాల జగత్తులో ఒకేరోజు 27 పుస్తకాలు విడుదలైనప్పుడు ఆశ్చర్యపోయాను. అంతకుముందెన్నడూ నేనెప్పుడూ వినలేదు ఒక రచయిత పుస్తకాలు ఒకేరోజు విడుదలవడం. ఇదే ఓ విశేషమనుకుంటే ఆయన షష్టిపూర్తి సందర్భంలో ఏకంగా 61 పుస్తకాలు హైదరాబాద్ పుస్తకప్రదర్శనలో ఆవిష్కరణ జరుపుకోవడం అపూర్వం. అమోఘం. 
ఆయనకు పరిచయం కాకముందే నేను ఎంతో ఇష్టపడి చదివిన పుస్తకం "ప్రేమలేఖలు". ఇక ఆయన నుంచి తాజాగా అందుకున్న పుస్తకాలలో నాకు "నేనే ఒక ఉద్యమం" కవితా సంపుటి ఎంతగానో నచ్చింది. ఈ పుస్తకం ముఖచిత్రం ఎర్రటి ఎరుపులో ఉండటం చూసి మొదట పక్కన పెట్టేశాను విప్లవ కవిత్వమేమో అనుకుని!! కానీ రెండోసారి ఈ పుస్తకం చదివినప్పుడు ఇందులోని ప్రతి కవిత నాకు నచ్చింది. ఈ పుస్తకాన్ని నటుడు, రచయిత తనికెళ్ళ భరణిగారికి అంకితమిస్తూ "నా జీవితాన్ని రంగులరాట్నం చేసి తిప్పి స్వర్గద్వారపు అంచులు తాకించిన నా హృదయబాంధవుడిగా" భరణిగారిని పేర్కొన్నారు సౌభాగ్య. 
నేను పనివాణ్ణి
పనికి వచ్చేవాణ్ణి
అదే సమయంలో పనికి మాలినవాణ్ణి
ప్రయోజనాలు ఆశించని వాణ్ణి
పట్టుకుందామంటే జారిపోయే పాదరసంలాంటి వాణ్ణి
మర్యాద తెలిసిన వాణ్ణి....అని " నేను " అనే కవితలో చెప్పుకున్న సౌభాగ్యగారు "కవిత్వాన్ని ఎలా తయారు చేస్తారు? నేర్పించడానికి అది నినాదం కాదు...పట్టుకోవడానికి అది పిట్టకాదు....కవిత కనిపించని చోట రూపొందుతుంది....మనసులోపలి పొరల్లో మల్లెలా విచ్చుకుంటుంది....అది ఒకరు చెప్పినట్లు రాదు....కవిత్వానికున్న స్వేచ్ఛ సృష్టిలో దేనికీ లేదు" అన్నారు "కవిత్వం నేర్పబడును" అనే కవితలో.
ఆయనతో పరిచయం, మాటలూ అన్నీ బాగానే ఉన్నా ఆయన ఇస్తాననగానే ప్రతిగా నేనేమీ ఇవ్వకుండా "వర్ణన రత్నాకరం" సంపుటాలను సంచీలో సర్దుకుని ఇంటికొచ్చేయడం ఒకింత సిగ్గేసింది. 
క్షమించండి సౌభాగ్యగారూ!!

కామెంట్‌లు