*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౬౦ - 60)

 శార్దూలము:
*అంతా సంశయమే శరీర ఘటనం | బంతా విచారంబే లో*
*నంతా దుఃఖపతంపరాన్వితమే మే | నంతా భయభ్రంతమే*
*యంతానంత శరీరశోషణమే దు | ర్వ్యాపారమే దేహికిన్*
*చింతన్నిన్నుదలంచి పొందరు నరుల్ |  శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.
మనిషి పుట్టడం, పెరగడం, చనిపోవడం అంతా అనుమానంతో వున్న విషయమే.  ఈ మనుషులు ఆలోచించే విషయాలు అన్నీ కూడా ఒక ఇబ్బంది నుండి ఇంకొక ఇబ్బంది లోకి వెళ్ళేలా చేసేవే.  శరీరాన్ని చిక్కిపోయేలా చేసుకుని  ఏదో సాధిద్దామని ప్రయత్నం చేసి భయపెట్టే పనులే చేస్తున్నారు. కానీ,  ఆ ఇబ్బందులు అన్నీ తీసివేసి వాళ్ళను రక్షించ గలిగే నిన్ను చేరుకునే ప్రయత్నం మాత్రం చేయడం లేదు, విశ్వరూపా!.........అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*ఈ జనన మరణాల మధ్య కొట్టుమిట్టాడుతూ, ఈ దేహంను సాధనంగా చేసుకుని ఐహికంగా ఏదో సాధంచాలి అని తనపడి, వివిధములైన బాధలను తనవిగా చేసుకుని, శరీరాన్ని శుష్కింపచేసుకుని కాలం వెళ్ళబుచ్చుతారు తక్క, ఈ ఈతి బాధలన్నిటినీ తొలగించడానికి, మాకు ఆత్మశక్తిని ఇవ్వడానికి, మా పిలుపు కోసం ఎదురుచూస్తూ నువ్వు వున్నవన్న స్పృహ మాత్రం పూర్తిగా కోల్పాయాము.  ఎన్ని చేసినా, ఎలా చేసినా, ఏం చేసినా అది చివరగా నీకు మాత్రమే చెందుతుంది అని మా మనుషులకు ఎప్పుడు తెలుస్తుంది, విరూపాక్షా! మమ్మల్ని ఈ అమాయకత్వం నుండి నీవైపు ఆడుగులు వేసేటట్టు చేయి, కాశీ విశ్వేశ్వరా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు