బొమ్మలు వేయటం ఒక మంచి కళ.ఒక కథ కానీ,నవల కానీ చదివి అర్థం చేసుకుంటే ఆనందం.కానీ ఎవరైనా చిత్రించిన బొమ్మ చూస్తే వెంటనే ఆనందం కదా!
చాలా మందికి బొమ్మలు వేయాలనుంటుంది,కానీ ఏవిధంగా మొదలు పెట్టాలో తెలియదు.'కృషితో నాస్తి దుర్భిక్ష్యం'అన్నారు కదా! కృషి చేస్తే దేనిమీదనైనా పట్టు సాధించ వచ్చు.
మొదట చక్కగా గీతలు(straight lines) గీయడం,వృత్తాలు ఏపరికరాలు ఉపయోగించకుండా వేయడం అభ్యాసం చేయండి. ఓ ఆకు, తాగే గ్లాసు వంటివి ముందర పెట్టుకుని చక్కగా వేయడానికి ప్రయత్నించండి,బాగా రాక పోయినా పరవాలేదు ప్రయత్నిస్తూ పోతే అవే వస్తాయి.'అభ్యాసం కూసు విద్య' అన్నారు కదా!బొమ్మలు వేయాలన్న తపనే మిమ్మల్ని మంచి బొమ్మలు వేసేట్టు చేస్తుంది.
మీ పెరటి లో పూల చెట్టు ఉంటే దానిని బాగా గమనించండి,అంటే వాటి అమరిక తెలుస్తుంది.తరువాత పూలతో ఉన్న కొమ్మ కోసి దాని జాగ్రత్తగా వెయ్యడానికి ప్రయత్నించండి.మీకు తెలియకుండానే మీలో ఉత్సాహం పెల్లుబుకుతుంది!
మెల్ల మెల్లగా కుర్చీ, టేబుల్,పూలకుండీని వేయడానికి ప్రయత్నించండి.
ఇక మనుషులు,జంతువుల బొమ్మలు వేయాలంటే 'అనాటమి' బాగా గమనించాలి,అంటే మనిషికి ఉన్న చేతుల పొడవు,కాళ్ళపొడవు,కళ్ళు,నుదురు,కళ్ళ మధ్య ముక్కు అమరికల వంటివి గమనించండి,మనిషి కుర్చీలో కూర్చున్నప్పుడు ఏ విధంగా కూర్చుంటాడు? నడిచినప్పుడు ఎలా నడుస్తాడు?వంటివి గమనించాలి గేదె,ఆవు,కుక్కలను కూడా బాగా గమనించాలి.
ఇవే కాకుండా మంచి చిత్రకారులు వేసిన బొమ్మల్ని బాగా గమనించాలి.వీలైతే పత్రికలలోని బొమ్మల్ని కత్తిరించి ఒక ఆల్బమ్ తయారు చేసుకుంటే అది మీకు రెఫరెన్స్ గా ఉపయోగపడుతుంది.
మెల్లగా వాటర్ కలర్ చిత్రాలు అభ్యాసం చేయండి. వీటిని గురించి తెలసుకోవాలంటే ఇప్పుడు బోలెడు పుస్తకాలు ఉన్నాయి.యు-ట్యూబ్ లో కూడా ఈ విశేషాలు ఉన్నాయి.చెయ్యి బాగా తిరిగాక, ఆయిల్ పెయింట్స్,ఆక్రిలిక్ పెయింట్స్ వంటివి ప్రయత్నించవచ్చు. రంగుల అమరిక కోసం కార్టూన్ నెట్ వర్క్ చూడండి చెట్లు,జంతువుల రంగులు, బొమ్మ వెనకాల రంగుల అమరిక(back ground) తెలుస్తాయి.
కార్టూన్ కళ మరొక విధంగా అభ్యసించాలి.కార్టూన్ ముచ్చట్లు మరొక సారి ముచ్చటించుకొందాం.పెన్సిల్,పెన్,క్రయాన్స్ వంటి వాటితో చక్కగా వేయవచ్చు.ఏది ఏమైనా పరిశీలన,అభ్యాసం చిత్రకళలో చాలా మఖ్యమైన అంశాలు.
మరి ఈ రోజే చిత్రించడం మొదలు పెడతారు కదా!
బొమ్మలు వేయాలనుందా?:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి