శాంతి కత్తి:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

  మార్తండ మహారాజు వద్ద వీరయ్య సైన్యానికికి కావలసిన కత్తులు చేసే కర్మాగారానికి యజమాని.
మార్తాండ రాజు పొరుగు రాజులతో యుద్ధం చేసి రాజ్య విస్తరణ కాంక్షించే వాడు.ఆ యుద్ధాల్లో అనేక వేలమంది చనిపోయారు.ఆ యుద్ధాలు వీరయ్యను ఎంతో కదిలించాయి
      ఏది ఏమైనా మార్తాండ మహారాజు మనసుమార్చి యుద్ధాలను ఆపి ప్రాణ రక్షణ,ఆస్థి రక్షణ  చేయాలని వీరయ్య నిశ్చయించాడు.అందుకే తాను తయారు చేసే కత్తుల మీద ప్రస్ఫుటంగా 'శాంతి  శాంతి'అని చెక్కడమే కాకుండా కత్తుల కొసన తెల్లని రంగు పూయసాగాడు.ఆ కొత్త కత్తులను చూసి మార్తాండ రాజు ఆశ్చర్యపోయాడు.
      "ఇదేమిటి ఈ కత్తుల మీద'శాంతి శాంతి'అని వ్రాయించావు,తెల్లరంగు పూయించావు,నీ ఉద్దేశ్యం ఏమిటి?" అని అడిగాడు.
        "ఈ కత్తితో ఎదుటి వాడిని చంపాలంటే చంపేవాడు ఒక్క క్షణం శాంతిని గురించి ఆలోచిస్తే ఎదుటివాడి ప్రాణం పోకుండా ఉంటుంది,ఎదుటి వాడు కత్తిమీద 'శాంతి శాంతి' అక్షరాలు చూసినపుడు తెల్ల రంగు చూసినపుడు వాడి మనసుకూడా మారవచ్చు"అదే నా ఉద్దేశ్యం చెప్పాడు వీరయ్య..
       "నేను ఈ విధంగా కత్తులను చేసినందుకు తమరు అన్యధా తలచకండి.ఒక్కసారి తోటి వాడి ప్రాణాలను గురించి,యుద్ధంలో చనిపోయిన వారి కుటుంబాలను గురించి ఆలోచించండి.శాంతి,ప్రేమ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది.తెలుపు రంగు శాంతికి చిహ్నమే,మహారాజా నేను మీకు చెప్పేంతవాడిని కాను.మనం యుద్ధాలు చేసి రాజ్యాలు ఆక్రమించే బదులు,ఆయా రాజ్యాల శాస్త్రజ్ఞులను,కళాకారుల్ని ఆహ్వానించి మన దేశంలో యువతకి శిక్షణ ఇప్పిస్తే యుద్ధ రక్తపాతం తప్పుతుంది,యుద్ధ ఖర్చుతగ్గుతుంది,ఎవరికీ ప్రాణ నష్టం ఉండదు,అందరికీ మానసిక శాంతి లభిస్తుంది. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి..."అని వీరయ్య చేతులు జోడించి చెప్పాడు.
         "నిజానికి నీవు కత్తులు చేస్తున్నా నీ మనసు వెన్న వంటింది,నీవు చెప్పిన విషయం ఆలోచించదగ్గది"అని తన మెడలో వజ్రాల హారాన్ని వీరయ్య మెడలో వేశాడు మార్తాండుడు.
        రెండవరోజే మంత్రుల సమావేశం ఏర్పాటు చేసి వీరయ్య ఆలోచనని మంత్రులముందు వినిపించాడు. తర్జన భర్జనల తరువాత మంత్రులందరూ ఏకగ్రీవంగా వీరయ్య ఆలోచనను ఆమోదించారు.
         అప్పటినుండి మార్తాండ మహారాజు యుద్ధాలను మాని,పొరుగు రాజ్యాలతో శాంతితో మసలుకొంటూ,తన దేశం ,పొరుగు దేశాల అభివృద్ధికి పాటు పడసాగాడు.
      'The world will not be destroyed by those who do evil,but by those who watch them without doing anything----Einstein.
                   ***************

కామెంట్‌లు