కౌశికుని సత్య దీక్ష:- కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445

  కౌశికుడు మహాతపస్వి.ఆయన ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుతూ,తనే సత్యవంతుడనే గర్వంతో ఉండేవాడు.ఒకరోజు అడవిలో కౌశికుడు ధ్యానంలో ఉండగా ఒక వ్యక్తి బిత్తర చూపులతోపరుగున వచ్చి "ఋషి చెంతనే ఉన్నానుకదా!" అనే ధైర్యంతో అక్కడ దట్టమయిన పొదలో దాక్కున్నాడు.ఈ విషయం కౌశికుడు గమనించాడు.ఇంతలో ఇద్దరు క్రూరులైన దారి దోపిడీ దొంగలు కత్తితో వచ్చి "స్వామీ, ఇటువైపు ఒక వ్యక్తి వచ్చాడా?" అడిగారు.
       ఇప్పుడు రాలేదని అబద్దం చెబుతే తన సత్య ధర్మానికి తీరని మచ్చ పడుతుందని తలచి "అదిగో ఆ పొదలోనే ఉన్నాడు" అని భయంకర నిజం చెప్పాడు.
       వెంటనే ఆ దొంగలు ఆ పొదలోని వ్యక్తిని బయటకు లాగి కౌశికుని ఆశ్రమానికి దూరంగా తీసుక పోయి అతని వద్ద ఉన్న బంగారం దోచుకుని పొడిచి చంపారు.
       కొద్ది సంవత్సరాల తరువాత కౌశికుడు చనిపోయాడు.
       కౌశికుడు ఎంత తపస్సు చేసినా,ఎంతసత్యం పలికినా అతనిని నరకానికి తీసుక వెళ్ళారు యమ భటులు!
       "నేను చేసిన పాపం ఏమిటి?,ఎందుకు నరకానికి తీసుక వచ్చారు?" అని యముణ్ణి అడిగాడు కౌశికుడు.
       "శ్రీ కృష్ణ భగవానుడు మిమ్మల్ని వెయ్యేళ్ళు నరకంలో ఉంచమన్నారు,ఆ విషయం ఆయననే అడగండి"అని యముడు చెప్పాడు.
       ఒకరోజు యముణ్ణి కలవడానికి శ్రీకృష్ణుడు వచ్చాడు.
       "మహానుభావా,నా కెందుకీ శిక్ష?,నేను తపస్విని, సత్యం పలికే వాణ్ణికదా!" అడిగాడు.
     దానికి శ్రీకృష్ణుడు " నీవు సత్యాన్ని పలికావు,కానీ ఆ సత్యం పలకడం ద్వారా ఒక అమాయకుడైన వ్యక్తి బలి అయి పోయాడు.అతన్ని రక్షించే శక్తి నీదగ్గర లేదు.అన్యాయాన్ని ఎదిరించగలిగిన శక్తి ఉన్నప్పుడే నీవు సత్యాన్ని పలకాలి.అమాయకుడి వధకు నీవు కారణం అయ్యావు.నీవు ఏం చెప్పకుండా ఉండాల్సింది,ఒకవేళ ఆ దొంగలు నిన్ను చంపి ఉంటే అమాయకుణ్ణి రక్షించినందుకు నీకు శాశ్వత స్వర్గం లభించి ఉండేది" అని వివరించాడు శ్రీ కృష్ణుడు.
       "మహాత్మా,నా తప్పు తెలుసుకున్నాను,అప్రియమైన సత్యాన్ని ఎప్పుడూ పలక కూడదని తెలుసుకున్నాను"అని కౌశికుడు విన్నవించుకున్నాడు.
       తప్పును తెలుసుకున్న కౌశికుడికి శ్రీకృష్ణుడు శిక్ష తగ్గించి కొంతకాలమే నరకంలో ఉండేట్టు చేశాడు.
(పురాణ కథ ఆధారం)
                 
     
కామెంట్‌లు