మా తాతయ్య నాకెన్నో కథలు చెప్పేవాడు.గొప్ప రాజులు,వింత రాక్షసులు,రెక్కల గుర్రాల మీద వీరులు,అబ్బో ఎన్నో!రోజుకో కథ,కథ అయిపోతే అబ్బా అప్పుడే అయిపోయిందా? అనే బాధ కలిగేది!
ఒకరోజు తాతయ్య పని మీద ఐదు రోజులు వేరే ఊరు వెళ్ళాడు.మరి నాకు కథలు చెప్పేవారేరి? కథ లేని రోజు ఏదో వెలితి!
ఏంచేస్తాంమరి నిద్ర ముంచుకొచ్చింది.నిద్రపోయా కానీ,నాబుర్రలో తాతయ్య చెప్పిన కలలన్నీ కలసిపోయి వింతకల వచ్చింది!అదే ఈ కథ.
మా ఇంటిదగ్గర ఆడుకుంటున్న నేను అలా వెళ్ళే సరికి ఓ పెద్ద అడవి వచ్చేసింది!పెద్ద చెట్లు,మంచి పువ్వులు,భలే రంగుల పండ్లు,మరికొంత దూరం వెళ్ళేసరికి ఓ పెద్ద కొలను తామర పూలతో నిండి ఉంది.ఒడ్డున వింత పూల చెట్లు.ఎంతో అందంగా ఉన్నాయి.
అక్కడికి తెల్లనిగుర్రం వచ్చింది,దానిమీద ఓ రాజకుమారుడు ఠీవిగా కూర్చుని ఉన్నాడు.రాజ కుమారుడు గుర్రందిగి నన్ను చూసి చిరునవ్వుతో "ఇక్కడకురా బాబూ"పిలిచాడు.
భయం భయంగా వెళ్ళాను.
"ఒక్కడివే ఇక్కడ ఏంచేస్తున్నావు?" అడిగాడు.
"అడవి అందాలు చూస్తున్నాను"చెప్పాను.
"నీకు ఎన్నో వింతలు చూపిస్తాను నాతో గుర్రం మీద వస్తావా?"అడిగాడు.
ఇంత ఆనందాన్ని మొహంమీద పులుముకుని "సరే"అని విప్పారిన కళ్ళతో చెప్పాను.
అంతే రాజకుమారుడు నన్ను ఎత్తి గుర్రం మీద కూర్చోబెట్టి తను కూర్చుని గుర్రన్ని అదలించాడు.అది లయబద్దంగా పరుగెత్తి వింతగా ఆకాశంలోకి ఎగిరింది."ఇప్పుడు చూడు కిందకి" అన్నాడు.
కిందకు చూస్తే,అబ్బో మంచు పర్వతాలు పచ్చని అందమైన తోటలు,గలగల పారే నదులు,గొప్ప భవంతులు,పెద్ద కోటలు,ఒకటేమిటి అన్నీ వింతగా కనబడసాగాయి!
రాకుమారుడు గుర్రాన్ని సుతారంగా తట్టేసరికి గుర్రం ఓ నల్లటికొండ దగ్గర దిగింది.
"ఈ కొండ గుహలో ఓ దుష్ట మాంత్రికుడు ఉన్నాడు,వాడు అమాయకులను ఏడిపిస్తుంటాడు,అదిగాక చిన్న పిల్లల్ని ఎత్తుకొచ్చి ఏవో పూజలు చేసి ఇంకా శక్తులు సంపాదించాలని చూస్తుంటాడు.అందుకే వీడి పని పట్టాలి.నీవు గుర్రం దగ్గరే ఉండు"చెప్పి గుహలోకి వెళ్ళాడు.
నేను మెల్లగా ఒక పెద్ద బండరాయి వెనుక నక్కి ఏంజరుగుతుందా అని చూస్తున్నాను.
పెద్ద అరుపులతో ఒక గుండు మాంత్రికుడు గుహ బయటికి వచ్చాడు అప్పటికే వాడి గుండెల మీద రక్తపు మరకలు ఉన్నాయి!వాడి చేతిలో మంత్ర దండం ఊపుతూ ఏవో మంత్రాలు చదువుతున్నాడు.ఆ మంత్ర దండం కొసన ఒక నక్కమొహం ఉంది!
పరుగున వచ్చిన రాకుమారుడు "ఈ రోజుతో నీ మాయలు నాశనం"అని గట్టిగా అరిచాడు.
"ఎవడివిరా నీవు నన్ను నాశనం చేయాలని చూస్తున్నావు?"అని మంత్రదండం ఎత్తాడు.మంత్రదండంలోంచి వింత కిరణాలు వెలువడ్డాయి.
రాజకుమారుడుకత్తి ఎత్తి బలంగా ఆ మంత్ర దండాన్ని కొట్టాడు,ఆ కత్తి మీద పవిత్ర బీజాక్షరాలు ఉన్నాయి.మాంత్రికుడి మొహంలో భయం కనబడింది.ఆ మంత్ర దండం రెండు ముక్కలయింది.వాడి మంత్రదండం నుండి నక్క దూకి బాధగా తోక ముడుచుకొని అరుస్తూ అడవిలోకి పారిపోయింది!
గుహలో ఏదో భయంకర విగ్రహం పెళపెళ మన్న శబ్దంతో విరిగి పడిపోయింది!తరువాత గుహ కూడా కూలి పోయింది.
మాంత్రికుడు పెద్దగా అరుస్తూ కింద పడిపోయాడు.వాడిలో మార్పులు సంభవించి వాడి శరీరం ఎముకల కుప్పగా మారి పోయింది!కపాలం పెద్ద శబ్దంతో పేలి పోయింది! మాంత్రికుడు పట్టుకొచ్చిన పిల్లలు పక్షులుగా మారిపోయి వాళ్ళ ఊళ్ళకు ఎగిరి పోయారు!రాకుమారుడు ఆ కపాలం పెద్ద ముక్క తన చేతిలోకి తీసుకుని అందులోకి చూడమన్నాడు,చూస్తే ఏముంది,ప్రపంచంలోని ఏడు వింతలు,కొత్త ఏడువింతలు,అన్ని దేశాలు అధ్బుతమయిన శిల్పాలు,ప్రసిద్ధ చిత్రాలు కనబడసాగాయి! చెడ్డవారు ఎర్రటి రంగుతో కనబడసాగారు! మంచివారు తెల్లని రంగులో ప్రశాంత వదనాలతో కనబడసాగారు!
"తృప్తిగా ఉందా?అన్నీ చూశావు కదా?" అడిగాడు రాజకుమారుడు.
"అన్నీ భలే ఉన్నాయి"అని నవ్వుతూ చెప్పాను.
రాజకుమారుడితో అలా మాట్లాడుతుండగానే ఆకాశంలో రకరకాల గ్రహాలు,నక్షత్ర రాసులు కనబడ్డాయి! ఉన్నటుటుండి ఒక నక్షత్రం రాలి నావైపు దూసుక రాసాగింది!
భయంతో కెవ్వున కేక వేశాను.అంతే అమ్మలేచి లైటు వేసి,"ఓరి పిచ్చి కన్నా కలవచ్చిందా"అని అడిగింది.నా భయం పోవడానికి నామీద చెయ్యి వేసి పడుకుంది.నాకు భయం పోయింది.
కలలోని వింతకథతో నాకు ఆనందం మిగిలి పోయింది.తాతయ్యవస్తే ఈ కథ చెప్పాలి అనుకుంటూ నిద్రపోయాను!
కలలో కథ:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి