నిప్పునైన నీటివోలె మార్చగలవు సుందరాంగి
నీపెదాల చిరునవ్వులు శాశ్వతంగ నిలవాలని
ముల్లునైన మల్లెపువ్వు చేయగలవు సుందరాంగి
అపురూపం నీ అందం అతిమధురం నీ నేస్తం
అనురాగం ఆత్మీయత పంచగలవు సుందరాంగి
జీవితమే వసంతమని ఆనందం అమృతమని
కష్టాలను కన్నీళ్లను బాపగలవు సుందరాంగి
మబ్బులకై పుడమిలా నీ కోసం ఎదురుచూసి
జ్ఞాపకాల కావ్యాలను రాయగలవు సుందరాంగి
కళ్ళముందు నీవుంటే కాలమేమొ తెలియదాయె
పురివిప్పిన మయూరమై ఆడగలవు సుందరాంగి
పొంగిపొరలే జలపాతం హొయలొలికే యవ్వనం
వెన్నెల్లో పరవశించి పాడగలవు సుందరాంగి
నింగిలోని తారలన్ని నీకు పోటి కాదు నిజం
జాబిలిలా జిగేల్మనీ మెరువగలవు సుందరాంగి
ఎటు చూసిన నీరూపం చీకటిలో చిరుదీపం
వెన్నెల్లో గోదారై పొంగగలవు సుందరాంగి
అణువణువున మల్లెపూల పరిమళాన్ని వెదజల్లీ
మాయజేసి మనసువెన్న చిలకగలవు సుందరాంగి
నరసింహం గుండెనిండ ప్రేమనింపి వదిలావే
నాశ్వాసే నీ ధ్యాసగ నిలుపగలవు సుందరాంగి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి