ఇటీవల ఓ రోజు పాత్రికేయ మిత్రులు సూర్యప్రకాశ్ గారి నించీ వాట్సప్ మెసేజ్....
"మీ రెస్యూమ్ పంపండి" అని.
అది చదవడంతోనే ఇప్పుడెవరిస్తారు నాకు నౌకరీ? నా రెస్యూమ్ ఎందుకూ? అనుకున్నా. ఎందుకంటే సాక్షి దినపత్రిక నించీ రిటైరై ఇది తొమ్మిదో సంవత్సరం. ఎందుకు నా రెస్యూమ్ అని అడగాలనుకుంటూనే నా ఉద్యోగ జీవిత వివరాలు టూకీగా పంపాను.
నిజానికి నేను చిన్నా చితకా ఉద్యోగాలు ఇరవైదాకా చేసాను. అయితే వాటిలో ఎక్కువ కాలం పని చేసింది మాత్రం పత్రికా రంగంలోనే. నౌకరీ చేసిన చోటల్లా తృప్తిగానే కొనసాగించాను నాకప్పగించిన బాధ్యతలనే అనుకుంటున్నాను. కానీ నాకంటూ ఎలాంటి ప్రత్యేకతలూ లేకుండానే ఉద్యోగపర్వం నించి ఇంటికి చేరాను.
మీడియాలో దాదాపు ముప్పై అయిదేళ్ళుపైనే కొనసాగాను. కలం పట్టిందైతే నలబై ఏళ్ళపైనే....
బుజ్జాయి అనే పిల్లల మాసపత్రికలో పంతొమ్మిదిన్నరేళ్ళు రాశాను. బుజ్జాయి పత్రికతో మరచిపోలేని అనుబంధముంది నాకు....
నేను పంపిన రెస్యూమ్ చూసిన సూర్యప్రకాశ్ గారు ఆ వివరాలను ప్రముఖ రచయిత్రి జలంధర చంద్రమోహన్ గారికి పంపి నాకు ఆవిడ సెల్ నెంబరిచ్చారు. ఆవిడ ఫోన్ చేస్తారంటూనే మీరు కాల్ చేసినా పరవాలేదనడంతో నేనే కాల్ చేసాను జలంధర గారికి. పరస్పర పరిచయ పలకరింపులయ్యాక మద్రాసులోని పాండిబజారులో వారింటికి నా చిన్నప్పుడు మా నాన్నగారితో వెళ్ళిన రోజులూ, వారింటి ఆవరణలో జరిగిన మా తెలుగు మాష్టారు కోట సత్యరంగయ్య శాస్త్రిగారి అవధానికి నేను హాజరైన వంటివి జ్ఞాపకం చేశాను.
జలంధర గారి తండ్రిగారే డాక్టర్ గాలి బాలిసుందర రావుగారు. ఇంట్లో అల్మరాలకు తాళాలు వేసుకుంటే సాటిమనుషులను అవమానించినట్లే అని భావించే వారాయన. ఆయన మద్రాసు నగరంలో పేరు మోసిన వైద్యులు. అప్పటి సాహిత్యకారులందరికీ ఆయన దగ్గరి వారే. ఇక ఆమె మేనత్త ‘ లత ‘ గారు గురించి వేరేగా చెప్పక్కర్లేదు. తెలుగు సాహిత్య పుటల్లో ఆమెకో ప్రత్యేక స్థానం ఉంది. కృష్ణశాస్త్రి గారు, కొడవటిగంటి కుంటుంబరావు, గారుబలిజేపల్లి లక్ష్మీకాంతంగారు వంటి ప్రసిద్ధ సాహితీవేత్తలను దగ్గరగా చూసిన భాగ్యవంతులు జలంధరగారు.
జలంధరగారు ప్రతీ జూలై నెలలో ఓ పాత్రికేయుడిని ఉచితరీతిన సత్కరిస్తున్నట్టు, ఈ ఏడాది మిమ్మల్ని సత్కరించాలనుకున్నట్టు చెప్పిన మాట విన్నాక అందుకు నాకెలాటి అర్హతా లేదని సున్నితంగా తిరస్కరించడానికి విఫలయత్నం చేశాను. అదే మాట సూర్యప్రకాశ్ గారితోనూ చెప్పాను. కానీ ఇద్దరూ నా మాట పక్కనపెట్టారు. జలంధరగారు చెయ్యవలసిన సత్కారం నాకు (జూలై 18, 2021నాడు) చేయనే చేశారు.
ఇది నమ్మలేని సంఘటన. ఎందుకంటే నేనేమీ సక్సెస్ ఫుల్ జర్నలిస్టుని కాను. సామాన్యుడిగా రంగప్రవేశం చేసిన మీడియా నుంచి అంతే సామాన్యుడిగా ఇవతలకొచ్చేశాను. అటువంటి నాకీ సత్కారం ఊహాతీతం. అందులోనూ జలంధరగారి నించీ పారితోషిక సత్కారం పొందడం చిరస్మరణీయం.
ఈ సత్కారం....
వాకిలి తలుపు తీయడంతోనే చడీచప్పుడు చేయక ఇంట్లోకి ప్రవేశించే ఎండపొడలాటిది!
ఉడికించే వేసవిలో ఆకస్మికంగా కురిసి మనసుని చల్లబరిచే వర్షంలాటిది!
అర్ధరాత్రి ఏ ఆర్భాటం చేయకుండా వికసించే పరిమళించే పువ్వులాటిది!
ఆవిడ గురించి నేనిప్పుడు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమేమీ లేదు కానీ కృతజ్ఞతాపూర్వకంగా ఒకటి రెండు మాటలు చెప్పాలనిపించింది.
జలంధరగారు తన పద్నాలుగో ఏట స్కూల్ మ్యాగజైన్ కి "అమ్మ" అని కథ రాశారు. ఆ తర్వాత కాలేజీ మ్యాగజైన్ కి కథ రాయగా విద్వాన్ విశ్వంగారు అది చూసి "ఆంధ్రప్రభ"లో ప్రచురించారు. అలా ఆవిడకే తెలియకుండానే ప్రచురించి ఆ పత్రికను విశ్వంగారు ఇచ్చినప్పుడు " it was a thrilling moment " అన్నారు.
ఆవిడ రాసిన "పున్నాగ పూలు" నవలకు "విద్వాన్ విశ్వం" పేరిట నవసాహితి ఇంటర్నేషనల్ వారి పురస్కారం దక్కడం అపూర్వం.
వందకుపైగా కథలూ, నాలుగు నవలలూ, ఇరవైకిపైగా రేడియో నాటికలూ, "సాహిత్యంలో సజీవ మూర్తులు" అని తెలుగులో ఇరవై నవలలో స్త్రీ పాత్ర విశ్లేషణలు రాసిన జలంధరగారు "మైత్రి" అని "ఆంధ్ర భూమి" లో నాలుగేళ్ళపాటు "social and counselling column" నిర్వహించారు. తన సాహితీ ప్రస్థానంలో "పున్నాగపూలు" నవల, "మైత్రీ" కాలమ్ ప్రత్యేకమని, ఇవి ఆంధ్ర దేశంలో సాహిత్యం చదివే అందరి ఇంట్లోనూ తనను ఓ అడబడుచుగా నిలబెట్టాయని, అద్భుతమైన అమోఘమైన అనుభవమని అన్నారు.
'పున్నాగ పూలు ‘ నవలకి ప్రేరణ తన తండ్రి డా. గాలి బాలసుందర రావు గారు, తన గురువు డా. గోపాలకృష్ణ గారని ఆమె చెప్పారు.
సోమర్ సెట్ మాం, ఆస్కార్ వైల్డ్, బెర్నార్డ్ షా రచనలను ఇష్టపడి చదివిన జలంధరగారికి ఆదూరి సత్యవతీ దేవిగారి కవిత్వం, ఎన్. గోపి గారి కవితలతోపాటు కొన్ని స్త్రీవాద కవితలు ఇష్టం.
పరిష్కారాన్ని కనుచూపుమేరలోనైనా చూపించని రచనలపైన నమ్మకం లేని జలంధరగారు పరిష్కారం అంటే ఒక పాజిటివ్ ఆలోచన అని అభిప్రాయపడ్డారు. సాహిత్యం టానిక్ లాగా పని చేయాలే తప్ప మత్తు మందులాగా కాదంటారు. మంచి పుస్తకం ఆలోచించటాన్ని నేర్పాలంటారు.
మానవత్వం తప్ప ఏ అస్తిత్వవాదంలోనూ విశ్వాసం లేని జలంధరగారికి తను రాసిన కథలలో “నిర్మోహ దర్పణం” అంటే ఎంతో ఇష్టం.
"చదవటం వల్ల ఆలోచించ గలం. చాలా తెలుసుకుంటే గాని రాయలేమన్న" జలంధర గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే పుస్తకాలు చదివితే రాయలేననుకుని చదవడం తగ్గించేశాను పుస్తకాలను. కానీ ఓ తమిళ రచయిత చేసిన సూచనతో పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. చదవడం వల్ల ఏదెలా రాయాలో తెలుసుకుంటున్నాను. పఠనౌలో రాతలో నేనిప్పటికీ విద్యార్థినే.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి