ఆ ఇల్లు మరచిపోలేనిది. అవును, మరచిపోలేనిదే. అదేమీ బంగళాకాదు. ఓ రెండు గదుల చిన్న గూడు. ఆ రెండు గదుల్లో వంటగది జానెడు, దానికి ఆనుకుని స్నానాలగది. ఈ రెండూ చీకటి గుయ్యారాలే. పట్టపగలైనా లైటు వెలుగుతూ ఉండాల్సింది. ముందు గదిలో వెలుగుకి లోటు లేకున్నా వాకిలి తలుపు రోడ్డుమీదకే ఉండేది. ఈ గదికి మాత్రమే రంగులద్దారు మేము అద్దెకు దిగినప్పుడు. గోడకు కొట్టిన రంగులు వెలసిపోతూ ఉండేది. కొన్ని చోట్ల పెచ్చులూడిపోయేవి. అంతా డొల్ల. ఈ గదిలో చెక్కతో ఓ అటక. దాని మీద కొన్ని పుస్తకాలు. ఈ అటకకిందే ఓ గూడు. అందులో ఓ అయిదారు పుస్తకాలు. ఇంతకీ మేముండిన ఈ భవనం ఎక్కడిదో చెప్పలేదు కదూ. ఇదిగో చెప్తున్నా...
హైదరాబాదులో నేను పని చేస్తూ వచ్చిన ఉదయం దినపత్రిక లాకౌట్ చేసాక పెట్టేబేడా సర్దుకుని మద్రాసుకెళ్ళిపోయాం. వెళ్ళీ వెళ్ళడంతోనే వెస్ట్ మాంబలంలో మా బావమరిది రాజశుక ఇంట కొంత కాలం ఆశ్రయం పొందాం. ఆ తర్వాత ఈ వెస్ట్ మాంబలంలోనే బరోడా స్ట్రీటులో అద్దెకు దిగిన ఇంద్రభవనమే మొదట్లో చెప్పినదంతా. శుక చలవతో ఆంధ్రజ్యోతిలో కంట్రిబ్యూటరుగా చేరాను. అతని సిఫార్సుతోనే రామకృష్ణామిషన్ లో ఓ స్వామీజీ దగ్గర గుమాస్తాగా చేరాను. ఈ రెండూ పార్ట్ టైమ్ నౌకరీలే. ఈ విషయం పక్కన పెడితే బరోడా వీధిలోని వారంతా స్వల్పకాలంలోనే సన్నిహితులవడంతో ఇంట్లో కన్నా రోడ్డుమీదే ఎక్కువగా ఉండేవాళ్ళం ఇరుగుపొరుగువారితో కబుర్లు చెప్పుకుంటే. పైగా సాయంత్రాలు మా ఆవిడ రేణుక ఓ పది పదిహేనుమంది పిలల్లకి ట్యూషన్ చెప్పేది. ఒక్కొక్కరూ పాతికా పరకా ఇచ్చేవారు నెలకు. పిల్లలు వచ్చేసరికి నే
ను ఇంట్లో ఉండేందుకు చోటుండేదికాదు. బయటకు వచ్చేసేవాడిని. ఆ ఇంట్లో ఉన్నప్పుడే మిత్రుడు ఎం.కె.రావు తీసిన ఫోటో ఈ మధ్య ఓ పుస్తకంలో బయటపడితే బరోడా స్ట్రీట్లో చేసిన కాపురం కళ్ళ ముందు కదలాడింది. ఇల్లు అగ్గిపెట్టెంతే అయినా వచ్చీపోయేవారందరి పలకరింపులతో సరదా సరదాగా సాగిపోయేవి రోజులు. ఇక్కడున్న రోజుల్లోనే ముందు గదిలో ఓ సైకిల్ కూడా ఉండేది. మా అన్నయ్య కొడుకు హేము ఇచ్చిన సైకిల్ అది. దానిమీదే మా అబ్బాయిని ఇంటికి రెండు వీధులవతల ఉన్న స్కూల్లో దింపుతుండే వాడిని. మొత్తం మీద ఈ ఇల్లెప్పటికీ మరచిపోలేను. ఇప్పటికీ ఆ వీధిలో వాళ్ళు ఫోన్ చేసి పలకరిస్తుం టారు ప్రేమతో.....
ఆ ఇల్లు మరవలేను:-- యామిజాల జగదీశ్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి