సెంట్రల్ యూనివర్సిటీ వారు, ఎమెస్కో వారు సంయుక్తంగా ప్రచురించిన "వర్ణన రత్నాకరం" నాకెంతో ఇష్టమైన పుస్తకం. ఇవి మొత్తం ఇరవైమూడు సంపుటాల సెట్టు. సాహిత్యంమీద మక్కువ కలవారు చదివి భద్రపరచుకోవలసిన పుస్తకాలివి అని నా వ్యక్తిగత అభిప్రాయం.
మన మహాకవులు తమ తమ కావ్యాలలో అవసరమైన సందర్భాలలో వర్ణనలకు ఎంతటి ప్రాధాన్యమిస్తారో తెలియంది కాదు. వర్ణనల నిర్వచనానికి నిదర్శకులని చెప్పడం చిన్న మాటే అవుతుంది. వారి వర్ణనా తీరు తెలుసుకోవడానికి కావ్యాలు చదివితేనే తెలిసొస్తుంది. కానీ కావ్యాలన్నీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయా అంటే ఒకింత అనుమానమే. అయినా అన్ని కావ్యాలూ కొని చదవగలమా.... కానీ ఆ సమస్యను తగ్గించి వివిధ కావ్యాలలో ఉండే వర్ణనలను టీకా తాత్పర్యాలతో ఈ "వర్ణన రత్నాకరం" మనముందుంది. ఎవరో చెప్పి వినడంకన్నా స్వయంగా చదివి ఆస్వాదించడానికి వర్ణన రత్నాకరం సంపుటాలలో మొదటి పదీ నా దగ్గరున్నాయి.
నౌకరీ చేస్తున్న రోజుల్లో డబ్బులు మిగుల్చుకుని అప్పుడప్పుడూ ఒకటీ రెండూ వంతున తొలి పది భాగాలూ కొనగలిగాను. ఇంతలో రిటైరైపోవడంతో డబ్బులాడక మిగిలినవి కొనలేకపోయాను. కానీ ఎలాగైనా కొనాలనే ఆరాటమైతే కించిత్ కూడా తగ్గలేదు.
ఇంతలో అనుకోకుండా ఓ పని చేసినందుకు ఓ ఆరు వందలు అందాయి. వాటితో ఓ మూడు సంపుటాలైనా కొందామని నాకు బాగా పరిచయమున్న ఓ పుస్తకాల దుకాణానికి వెళ్ళాను. మూడు భాగాలు అయిదు వందల యాభై రూపాయలకు ఎంపిక చేసుకుని బిల్లు వేయించుకుని మహదానందంగా ఇంటికి వచ్చి చదివెయ్యాలనుకున్నాను. క్యాష్ కౌంటర్ కొచ్చి బిల్లు వేయించుకుందామని నిల్చోగా ఆ షాపు సిబ్బంది ఒకరు "మూడు భాగాలు ఇవ్వడం కుదరదండి. అవి సెట్టుగా ఇరవైమూడూ కొనాల్సిందే" అన్నారు.
"ఇదేంటీ, మొదట్లో ఒకటి రెండూ పుస్తకాలు ఇక్కడే మీ షాపులోనే కొన్నానండి" అని ఆ మనిషితో అంటూనే కౌంటర్లో ఉన్న వ్యక్తి బాగా తెలిసిన వారవడంతో ఆయన ఇస్తారన్న ఆశతో నిలబడితే "ఇంపాసిబుల్" అండి కొంటే ఇరవైమూడు భాగాలూ కొనండి లేదంటే ఎక్కడ తీసారో అక్కడ పెట్టేయండి అని ఆ సిబ్బంది అనడంతో మనసు చివుక్కుమంది. ఓ మంచి మనసుని కోల్పోయినంతగా బాధపడ్డాను. ఆఖరి క్షణంలో అనుకున్నది చేజారితే ఎంత ఆవేదన కలుగుతుందో అంతలా నలిగిపోయింది నా మనసు. జీవితంలో విలువైనదేదో కోల్పోయినంతగా బాధపడిపోయి ఆ మూడు పుస్తకాలనూ ర్యాక్ లో పెట్టేసి మరుక్షణం షాపులో నించి బయటపడ్డాను. నిజానికి ఆ షాప్ కి ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక పుస్తకం కొనుక్కునిగానీ ఇవతలకు రాను. అంతేకాదు షాప్ సొంతదారులతో బోలెడు కబుర్లు చెప్పీ చెప్పించుకోవడం సర్వసాధారణంగా జరిగేవే. అలాంటిది ఈసారి అనుకున్న మూడు పుస్తకాలూ కొనలేకపోయానే అనే బాధతో ఏదో ఓడిపోయినంతలా ఏదో చేదు అనుభవాన్ని చవిచూసినవాడిలా వెనక్కు వచ్చేసాను.
కారణం, వర్ణన రత్నాకరంపై ఉన్న ప్రేమ. అభిమానం. రత్నాకరమంటే సాగరం. ఈ వర్ణన రత్నాకర సెట్టు ఓ మహాసాగరం. ఈ రత్నాకరంలోని రత్నాలు వర్ణనలే. ఒకే అంశాన్ని ఆయా కవులు ఎన్ని విధాలుగా వర్ణించారో, వారి దృష్టి ఎన్ని కోణాలలో ప్రసరించిందో తెలుసుకోవడానికి ఈ పుస్తకాలు చదివితీరాలి. అవి చదువుతుంటే మన హృదయం ఆనందంతో వికసిస్తుందనడం అతిశయోక్తికాదు.
మన మహాకవుల వర్ణనలు పద్యాలపై పట్టులేని నాలాంటి వారు చదివితే అంత తేలికగా అర్థంకావు. అయితే వాటిని అర్థం చేసుకుని ఆస్వాదించడానికి అతి సరళమైన వ్యాఖ్యానాలతో బేతవోలు రామబ్రహ్మంగారు తదితరులు పాఠకుల ముందుంచడం ముదావహం.
ఈ శేషజీవితంలో మిగిలిన పదమూడు సంపుటాలు ఎలాగైనా కొని చదవాలని ఆశ. నెరవేరేనా లేక నిరాశగా మిగిలిపోతుందా....??? ఎందుకంటే డబ్బులు లేక చేతులు కట్టేసినట్టవడంతో ఆశ పండటం అనుమానమే.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి