మధురా నగరిలో...:--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

మధురా నగరిని చల్లనమ్ముదము 
 తోడుగ రారా కన్నయ్యా !
నన్నూ  వీడక రారా కృష్ణయ్యా !

మేడలో భామలు మెల్లగ పిలిచే 
చూడకు నీవిక చిన్నయ్యా 
మురళిని ఊదకు వీధిలో కృష్ణయ్యా!

తుంటరి వెధవలు తూలిన మాటలు 
వింటివ చూడుము నందయ్యా 
నాకే  జంటవు నీవట కృష్ణయ్యా !

వంటరి దానను వెన్నెల గువ్వను 
కంటికి రెప్పగ  కన్నయ్యా 
నీవే కావుము ప్రియముగ కృష్ణయ్యా!!

గోవులు కాచే గోపిక నేనూ 
గొల్లల పడుచును చిన్నయ్యా 
నామది నిన్నే నమ్మితి కృష్ణయ్యా!!