"తులసీ"తో కొన్ని ముచ్చట్లు:-- యామిజాల జగదీశ్


 ఆనందం, తృప్తి అన్నింట్లోనూ పొందలేం. మనం చేసే పనులన్నింట్లో కొన్నే  ఆనందాన్నిస్తాయి. మరికొన్ని తృప్తికి  పరిమితమవుతాయి. తృప్తీ, ఆనందమూ కలిసి పొందే అనుభూతులు అరుదుగా ఉంటాయి. నా ఉద్యోగయానంలో ఈ రెండూ మనసారా పొందినవి ఒక్క "ఉదయం" దినపత్రికలోనే అని కచ్చితంగా చెప్పగలను.  "ఉదయానుబంధాన్నెప్పుడూ మరచిపోలేను.
అటువంటి "ఉదయం"లో  అందరితోనూ నాకు సన్నిహిత సంబంధాలున్నాయని నేనంటే అది "అతే" అవుతుంది. ఎందుకంటే నాకు పరిచయముండి సన్నిహితంగా మెలిగినవారు కొందరైతే ఇంకొందరితో చనువుగా మెలిగిన సందర్భాలుంటాయి. 
పన్నెండేళ్ళ "ఉదయం" ప్రస్థానంలో నేనెక్కువ కాలం పని చేసింది స్పోర్ట్స్ డెస్కులోనే. ముగ్గురు inchargeల కింద పని చేశాను. వారు...వాడ్రేవు ఆంజనేయులుగారు. తెలిదేవర భానుమూర్తిగారు. తులసీకృష్ణగారు. 
ఆంజనేయులుగారి తర్వాత కొద్ది రోజులు భానుమూర్తిగారు స్పోర్ట్స్ డెస్కులో ఉండి మళ్ళా జనరల్ డెస్కుకి వెళ్ళాక విజయవాడ బ్రాంచ్ నించి incharge గా తులసీకృష్ణగారు హైదరాబాద్ వచ్చారు.
ఆయన వచ్చీరావడంతోనే, సంపాదకులు కె. రామచంద్రమూర్తిగారు నన్నూ, తులసీకృష్ణగారిని తన క్యాబిన్ లోకి పిలిచారు. 
మూర్తిగారు తులసీకృష్ణగారితో చెప్పిన మాట "వయస్సులో ఈయన పెద్దయినంత మాత్రాన మొహమాటపడక్కర్లేదు. వర్క్ విషయంలో ఈయనతో గట్టిగానే ఉండాలి...తప్పులు రాకూడదు " అంటూ నన్నుద్దేశించి చెప్పారు. 
నేను తులసీకృష్ణగారికంటే వయస్సులో దాదాపు తొమ్మిదేళ్ళ పెద్దవాడిని. ఆయన సారథ్యంలో పని చేయడంలో నాకెలాంటి ఒత్తిడీ ఎదురవలేదు. ఆయన విజయవాడలో పని చేస్తున్న రోజుల్లోనే నాకు పరిచయముండేది.  ఇంటర్ మీడియా క్రికెట్ టోర్నమెంట్లలో ఆడేందుకోసం అప్పుడప్పుడూ ఆయన విజయవాడ నించీ హైదరాబాద్ వస్తుండటంవల్ల మా మధ్య సమన్వయ కుదిరింది. తల్లావజ్ఝల   లలితాప్రసాద్, సంగిశెట్టి శ్రీనివాస్, ఆదిమూలం సుమతి కూడా ఉదయం స్పోర్ట్స్ డెస్కులో ఆయన ఆధ్వర్యంలో పని చేసినవారే. 
క్రీడావార్తలు రాసేటప్పుడు కొన్ని పదాలు ఆయన మాటలు అనుసరించేవాడిని.
"ఆట" శీర్షికతో ఉదయం పత్రికలో (ప్రతి గురువారం అన్నట్టే గుర్తు) వారానికోరోజు క్రీడలకు సంబంధించి ఓ స్పెషల్ పేజీ ఉండేది. అందులో స్నూకర్, బోలియర్డ్స్, బాస్కెట్ బాల్ , వాలీబాల్ వంటి క్రీడల చరిత్ర రాసే అవకాశం నాకు కల్పించింది తులసీగారే.
ఉదయంలో  ఉన్నప్పుడు నన్ను మొట్టమొదటిసారిగా ఓ ప్రెస్ మీట్ కి పంపింది తులసీగారే. చిక్కడపల్లిలోని ఓ హోటల్లో జరిగిన క్యారంబోర్డు అసోసియేషన్ వారి ప్రెస్ మీట్ కి ఆయన మాటగా వెళ్ళాను. 
అలాగే, జాతీయ క్యారమ్స్ ఛాంపియన్ నిర్మలగారిని ఇంటర్వ్యూ చేసే అవకాశం కల్పించిందీ ఆయనే. ఆమెను ఇంటర్వ్యూ చేసాక రాసిన ప్రతిని నిర్మలగారికి చూపిం చాక పబ్లిష్ చేద్దామన్నప్పుడు తులసీగారు "ఒకరిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత రాసిన స్క్రిప్ట్ మీద మీకు నమ్మకం ఉండాలి తప్ప ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ దగ్గరకెళ్ళి నేను రాసింది సరిగ్గా ఉందోలేదో చూడండి అని అడగటం సరికాదు" అన్నారు. అదీ నిజమేగా అనిపించి నేను రాసింది సరిచూసి పేజీలో పెట్టించారాయన.
ఇక ఉదయం క్రికెట్ టీమ్ విషయానికొస్తే, మా జట్టులో చెప్పుకోదగ్గ ఆటగాళ్ళల్లో తులసీకృష్ణ, సోమశేఖర్ (పర్సనల్ ఆఫీసర్), గణేశ్, లలితాప్రసాద్, టి.పి. దాస్, చంద్రశేఖర్, రవికాంత్, సురేన్ద్ర, వెంకటకృష్ణ తదితరులున్నారు. తులసీకృష్ణ ఉదయం జట్టుకే కాకుండా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ జట్టుకికూడా ప్రాతినిధ్యం వహించడం విశేషం. 
ఏస్థాయి క్రికెటరైనా ఒక్కసారైనా ఈడెన్ గార్డెన్ ( కలకత్తా)లో ఆడాలని కలగంటాడు. అప్పుడే తన క్రికెట్ కెరీర్ సాఫల్యమైనట్టు అనుకుంటాడు. అటువంటి ఈడెన్ గార్డెన్ మైదానంలో జరిగిన ఆల్ ఇండియా ప్రెస్ క్లబ్ క్రికెట్ టోర్నమెంటులో తులసీకృష్ణ హైదరాబాద్ నించి ఆడి సెంచరీ చేయడం అపూర్వం. ఈ క్రమంలో దక్షిణాది నించి సెంచరీ చేసిన తొలి బ్యాట్స్ మన్ గా  తులసీగారు చరిత్రపుటలకెక్కడం విశేషం.
అలాగే బెంగళూరులో జరిగిన ఐటీసీ స్పాన్సర్డ్ విల్స్ కప్ క్రికెట్ టోర్నమెంట్ మూడు మ్యాచ్ ల  సిరీస్ లో తులసీకృష్ణ ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచి పలువురి ప్రశంసలందుకున్నారు. 
తులసీకృష్ణ గత నెల ముప్పయ్యో తేదీన సాక్షి టీవీ ఛానెల్ నించి పదవీవిరమణ చేసారు. వాళ్ళ అన్నయ్య హిందూ (చెన్నై) దినపత్రిక నుంచి కార్టూనిస్టుగా సుదీర్ఘ సర్వీస్ తర్వాత రిటైరయ్యారు. 
ఈ జ్ఞాపక వాక్యాలు ఓ చిరు సంఘటనతో ముగిస్తాను. 
హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఇంటర్ మీడియా క్రికెట్ టోర్నమెంట్ లో ఆంధ్రప్రభతో జరిగిన మ్యాచ్ లో "ఉదయం" ఇన్నింగ్స్ లో నేనూ, సురేన్ద్ర కలిసి బ్యాటింగ్ చేసినప్పటి విషయమిది. సురేన్ద్ర ఓ షాట్ కొట్టాక పరుగుల కోసం పరిగెట్టాం. రెండో పరుగుకే బంతి బవుండరీ లైన్ తాకడంతో అంపైర్ ఫోర్ ప్రకటించడాన్ని చూసుకోక నేను మూడో పరుగుకోసం పరుగెత్తుకొస్తుంటే "బంతి బవుండరీ లైన్ దాటింది. ఎందుకనవసరంగా పరుగెట్టి ఆయాసపడతారు" అని సురేన్ద్ర చెప్పడం ఇప్పటికీ గుర్తే.