బాధిత పిల్లలకు ప్రభుత్వాల బాసట:- నల్లాని రాజేశ్వరి వెల్లడి

 అనంతపురము::కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకోవడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ముందుకురావడం అభినందనీయమని ప్రముఖ రచయిత్రి, బాలల సంక్షేమ సమితి (సిడబ్ల్యూసి) ఛైర్ పర్సన్ నల్లాని రాజేశ్వరి అన్నారు.
ఏపి మహిళా శిశుసంక్షేమ శాఖ సంచాలకులు కృతికాశుక్ల  బాలల సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్ ప్రసాదమూర్తితో కలిసి దూరవీక్షణ సమీక్ష నిర్వహించారని చెప్పారు.
భాధిత పిల్లల వివరాలను ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నామని రాజేశ్వరి చెప్పారు.
తల్లి, తండ్రి ఇద్దరినీ కోల్పోయి అనాథలైన చిన్నారుల కోసం 
ఏపీ ప్రభుత్వం రూ. పది లక్షలు డిపాజిట్ చేస్తోందన్నారు. 
‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్’ పేరుతో కొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మే 29న ప్రకటించారని తెలిపారు.
ఈ పథకంలో భాగంగా కరోనాతో అనాథలైన పిల్లల పేరిట నగదు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి.. ఉచిత విద్యను అందజేస్తారన్నారు.  కేంద్రీయ, నవోదయ, సైనిక లేదా ప్రయివేట్ విద్యాలయాల్లో వీరికి చదువు చెప్పిస్తారన్నారు.  దీనికయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుందని, వీరికి 18 ఏళ్లు నిండిన తర్వాత నెల నెలా స్టయిపెండ్ అందిస్తారని చెప్పారు. డిపాజిట్ చేసిన నగదును 23 ఏళ్లు నిండిన తర్వాత రూ. 10 లక్షలు ఇస్తారని, ఈ నగదును వ్యాపారం లేదా ఇతర అభివృద్ధి కార్యక్రమాలను వినియోగించవచ్చన్నారు.
ఉన్నత చదువుల కోసం రుణాలను ఇప్పించి.. వీటికి వడ్డీని పీఎం కేర్స్ నుంచి చెల్లిస్తారని చెప్పారు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు ఆయుష్మాత్ భారత్ స్కీమ్ కింద రూ. 5 లక్షల విలువైన ఆరోగ్య బీమా కల్పిస్తారన్నారు. దానికి పీఎం-కేర్స్ నుంచే ప్రీమియం చెల్లిస్తారని రాజేశ్వరి పేర్కొన్నారు. ‘‘'పిల్లలు దేశ భవిష్యత్తు. వారికి అవసరమైన భద్రత, సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం.. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు భవిష్యత్తుపై భరోసా కల్పించడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత’’ అని ఈ పథకం ప్రకటించిన సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొనడం ఆనందకరమన్నారు.
పదేళ్లలోపు అనాథలైన చిన్నారులను సమీపంలోని కేంద్రీయ లేదా ప్రయివేట్ విద్యాలయాల్లో డే స్కాలర్‌గా చేర్పిస్తారని తెలిపారు. ఒకవేళ ప్రయివేట్ పాఠశాలలో చేరితే విద్యాహక్కు చట్టం కింద పీఎం కేర్స్ నుంచి ఫీజులు చెల్లిస్తారని, యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్ అన్ని ఖర్చులను భరిస్తారని వివరించారు. ఇక, 11 నుంచి 18 ఏళ్లలోపు చిన్నారులను సైనిక, నవోదయ పాఠశాలల్లో చేర్చుతారని నల్లాని రాజేశ్వరి చెప్పారు.
రాష్ట్రంలోని పిల్లల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. జగనన్న గోరుముద్ద, విద్యాకానుక,  అమ్మఒడి, నాడు-నేడు, నూతన విద్యావిధానం వంటివి వ్యవస్థ సమూల మార్పులకు దోహదం చేస్తాయన్నారు.
దూరవీక్షణ సమీక్షలో జిల్లా  సిడబ్ల్యూసి సభ్యులు, ఐసిడిఎస్, ఐసిపిఎస్, బాలల సంక్షేమశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కామెంట్‌లు